కొత్త కలెక్టర్ ముంగిట పెను సవాళ్లు
ABN , Publish Date - Jun 27 , 2024 | 12:42 AM
జిల్లాలో పాలన కుంటుపడింది. అభివృద్ధి పడకేసింది. వ్యవస్థలు గాడి తప్పాయి... ఈ తరుణంలో కొత్తగా వచ్చే కలెక్టర్‌కు ఇవి పెను సవాళ్లు విసురుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ మూలాలున్న కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయాల పేషీల నుంచే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

- నేడు కలెక్టర్‌గా ఏఎస్.దినేశ్‌కుమార్ బాధ్యతల స్వీకారం
- కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయాలను గాడిన పెట్టడమే ప్రధానం
- పేషీలతో పాటు పలు ప్రభుత్వ శాఖల ప్రక్షాళన అనివార్యం
- క లెక్టర్ చొరవ తీసుకోకుంటే గత పరిస్థితులే కొనసాగే అవకాశం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పాలన కుంటుపడింది. అభివృద్ధి పడకేసింది. వ్యవస్థలు గాడి తప్పాయి... ఈ తరుణంలో కొత్తగా వచ్చే కలెక్టర్‌కు ఇవి పెను సవాళ్లు విసురుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ మూలాలున్న కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయాల పేషీల నుంచే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జిల్లాకు కొత్త కలెక్టర్‌గా నియమించిన ప్రస్తుత ప్రకాశం కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. పాడేరు కేంద్రంగా జిల్లా ఏర్పడి రెండేళ్లు పూర్తయినప్పటికీ ఐటీడీఏ స్థాయిలో పాలన సాగడంతో జిల్లా ఏర్పడిన అనుభూతి పాలనలో కనిపించలేదు. గిరిజన ప్రాంతానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు గిరిజనాభివృద్ధి, అందుకు ఉద్దేశించి ఏర్పడిన ఐటీడీఏలు, కొత్తగా వచ్చిన కలెక్టరేట్ తదితరాలపై కనీసం దృష్టి సారించిన దాఖలాలు లేవు. కేవలం వారి వ్యక్తిగత పనులు, ఆదాయ వనరులు మినహా గిరిజన ప్రాంతంలో పాలనను కనీసం పట్టించుకోలేదు. దీంతో కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయాలు సైతం పూర్తిగా గాడి తప్పాయి. దీంతో ఏదోలా కాలం గడుపుతున్నట్టుగానే ఉంది కానీ, పాలన సాగుతున్నట్టుగా ప్రజలకు అనిపించడం లేదు. ఈ తరుణంలో ప్రభుత్వం మారడం, ఉత్సాహవంతుడైన ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్‌ను కలెక్టర్‌గా నియమించడంతో గత దుస్థితికి చరమగీతం పాడడంతోపాటు వ్యవస్థలు గాడిన పడి, గిరిజనాభివృద్ధికి బాటలు పడతాయని మన్యంవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పేషీల నుంచి ప్రక్షాళన అవసరం
వైసీపీ మూలాలున్న కలెక్టరేట్, ఐటీడీఏ కార్యాలయాల ఫేషీల నుంచే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కలెక్టరేట్ ఫేషీలో సీసీల సూచనలు, మార్గదర్శకాల ఆధారంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వాస్తవానికి కలెక్టర్ సూచించినది అమలు చేయడానికి మాత్రమే సీసీలుంటారు. కానీ ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా సీసీలకు కాస్త అవకాశం ఇవ్వడంతో దానిని ఆసరాగా చేసుకుని కలెక్టర్లనే తప్పుదారి పట్టిస్తున్నారని పలు శాఖలకు చెందిన అధికారులు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌కు కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తారని, అదే సీసీకి కాల్ చేస్తే సరిగా స్పందించరని జిల్లా స్థాయి అధికారులే బాధపడిన సందర్భాలున్నాయి. అలాగే ఐటీడీఏలోనూ ఇదే పరిస్థితి గత కొన్నాళ్లుగా కొనసాగుతున్నది. ఐటీడీఏ పీవోకు సీసీగా ఉన్నవారిపై పూర్తిగా ఆధారపడడంతో ఇదే అవకాశంగా భావించి, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఐటీడీఏ గత పీవో వద్ద సీసీగా వ్యవహరించిన వ్యక్తి, సదరు పీవోకు చెడ్డ పేరు తేవడంతోపాటు, తను బాగానే సంపాదించాడని, ఇప్పటికీ అదే సంస్కృతి ఐటీడీఏ పీవో షేషీలో కొనసాగుతున్నదని అధికారులు, పలువురు కాంట్రాక్టర్లు అంటు న్నారు. ఈ తరుణంలో కలెక్టర్, ఐటీడీఏ పీవోలకు చెందిన పేషీలతోనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది. పాడేరు కేంద్రంగా జిల్లా ఏర్పడినప్పటికీ కలెక్టర్, జేసీ, ఎస్‌పీ, కలెక్టరేట్‌లోని విభాగాలు మినహా ఇతర శాఖలకు చెందిన అధికారులు ఏం చేస్తున్నారో కూడా జనానికి అర్థం కాని పరిస్థితి. ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన శాశ్వత అధికారులు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. దీంతో ప్రస్తుతం జిల్లా అయినప్పటికీ డివిజన్ స్థాయి పాలన సాగుతున్నట్టుగానే ఉంది.
26 నెలల్లో ఒక్కమారే ఐటీడీఏ పాలకవర్గ సమావేశం
గిరిజన అభివృద్ధి, సంక్షేమానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేయాల్సిన తీర్మానాల కోసం ప్రతి మూడు నెలలకు ఒకమారు ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించాల్సి ఉంది. ఇది ఐటీడీఏలకు రాజ్యాంగ పరంగా కల్పించిన అవకాశం. కానీ 2022 ఏప్రిల్‌లో జిల్లా ఏర్పడిన తరువాత కేవలం ఒకమారు మాత్రమే ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. సుమారుగా 26 నెలల్లో కేవలం ఒకసారి మాత్రమే పాలకవర్గ సమావేశం నిర్వహించారంటే ఐటీడీఏకు చైర్మన్‌గా ఉన్న కలెక్టర్, ఐటీడీఏకు ప్రాజెక్టు అధికారిగా వున్న పీవోకు గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ ఉందో అర్థం చేసుకోవచ్చు. గిరిజనుల అభ్యున్నతి కోసం పరితపించే ఐఏఎస్ అధికారులు పీవోలుగా పని చేసిన పాడేరు ఐటీడీఏకు ఈ దుస్థితి ఏర్పడడం చాలా బాధాకరం. అలాగే సబ్‌కలెక్టర్ కార్యాలయం ద్వారా గిరిజనులకు రెవెన్యూ పరమైన సేవలు సక్రమంగా అందించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆశించిన స్థాయిలో సేవలు అందడం లేదనే వాదన బలంగా వినిపిస్తున్నది. కొత్త కలెక్టర్ తన కార్యాలయం నుంచి మొదలు పెట్టి ఐటీడీఏ, సబ్‌కలెక్టర్ కార్యాలయం నుంచి తన పరిధిలో ఉన్న ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై దృష్టి సారించి గిరిజనులకు కొత్త ప్రభుత్వం ద్వారానైనా ఆశించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందించాలని మన్యం వాసులు కోరుతున్నారు.