Share News

మన్యంలో ముమ్మరంగా నూర్పులు

ABN , Publish Date - Jan 06 , 2024 | 12:59 AM

ఏజెన్సీలో వరి, రాగి పంటల నూర్పిడి పనుల్లో గిరిజన రైతులు బిజీగా వున్నారు. ఎక్కడ చూసినా వరి నూర్చడం, ధాన్యం తూర్పారపట్టడం, బస్తాల్లో నింపి ఇళ్లకు తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాగి కంకులను సంప్రదాయ పద్ధతుల్లోనే నూర్పులు చేస్తుండగా, వరి పంటను మాత్రం యంత్రాలతో నూర్చుకుంటున్నారు.

మన్యంలో ముమ్మరంగా నూర్పులు
పాడేరు శివారులో యంత్రంతో వరి పైరును నూర్చుతున్న రైతులు

మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో నెల ఆలస్యం

వరి నూర్పిడికి యంత్రాలు వినియోగం

పాత పద్ధతులతో పోలిస్తే ఖర్చులు, సమయం ఆదా

సంప్రదాయ పద్ధతిలో రాగి పంట నూర్పులు

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

ఏజెన్సీలో వరి, రాగి పంటల నూర్పిడి పనుల్లో గిరిజన రైతులు బిజీగా వున్నారు. ఎక్కడ చూసినా వరి నూర్చడం, ధాన్యం తూర్పారపట్టడం, బస్తాల్లో నింపి ఇళ్లకు తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. రాగి కంకులను సంప్రదాయ పద్ధతుల్లోనే నూర్పులు చేస్తుండగా, వరి పంటను మాత్రం యంత్రాలతో నూర్చుకుంటున్నారు.

గత ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ శాఖ అధికారులు లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 59,189 హెక్టార్లలో వరి, 18,918 హెక్టార్లలో రాగి పంటను వేశారు. సాధారణంగా ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో వరి, చోడి పంటల కోత, కుప్ప, నూర్పు పనులు చేస్తుంటారు. కానీ ఈ ఏడాది వరి పంట కోతలు, కుప్ప దశల్లో ఉన్నప్పుడు మిచౌంగ్‌ తుఫాన్‌ విరుచుకుపడింది. భారీ వర్షాలు పడడంతో వారం నుంచి పది రోజులపాటు పొలాల్లో నీరు నిలిచింది. తరువాత పొడి వాతావరణం లేకపోవడం, ఆకాశం మేఘావృతమై ఎండ కాయకపోవడం, మంచు ప్రభావం పెరగడం వంటి కారణాల వల్ల వరి, రాగి పంటల కోతలు, నూర్పులు ఆలస్యం అయ్యాయి. వరి పనలు, రాగి కంకులు బాగా ఆరడంతో కొద్ది రోజుల నుంచి నూర్పుల పనుల్లో నిమగ్నమయ్యారు. సంక్రాంతి పండుగ సమీపిస్తుండడంతో ఈలోపే నూర్పులు పూర్తిచేసి వడ్లు, రాగులను ఇళ్లకు చేర్చుకునే ప్రయత్నాల్లో వున్నారు. కుటుంబ అవసరాలకు సరిపడ ధాన్యం, రాగులను వుంచుకుని, మిగిలిన పంటను సంతల్లో విక్రయించుకుంటారు. వచ్చిన సొమ్ముతో పండుగకు, కుటుంబ అవసరాలకు కావాల్సిన సామగ్రి, సరకులు, వస్తువులను కొనుగోలు చేసుకుంటారు.

వరిఇ నూర్పు యంత్రాలతో సమయం, ఖర్చులు ఆదా

సుమారు పదేళ్ల క్రితం వరకు గిరిజన రైతులు వరి పంటను సంప్రదాయ పద్ధతిలోనే నూర్చుకునే వారు. వరి పైరును కోసి, పనలు ఎండిన తరువాత మెరక ప్రదేశాల్లో కుప్పలుగా వేసుకుంటారు. అనంతరం వెసులుబాటు చూసుకుని పశువుల సాయంతో నూర్చుకునేవారు. అయితే వరి నూర్పులకు యంత్రాలు రావడంతో గిరిజన రైతులు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి యంత్రాలతో పంటను నూర్చుకుంటున్నారు. దీనివల్ల సమయం, ఖర్చులు ఆదా అవుతాయని చెబుతున్నారు. ఐదారేళ్ల క్రితం కొద్ది మంది రైతులతో మొదలైన యంత్రాలతో నూర్పిడి, ఈ ఏడాది దాదాపు సగం మంది రైతులు పూర్తిగా యంత్రాలపైనే ఆధారపడి వరి పంటను నూర్చుకుంటున్నారు. పాత పద్ధతిలో పశువుల సాయంతో రోజుకు ఒక ఎకరా పంటను నూర్చుకునేవారు. ట్రాక్టర్లు, పవర్‌ టిల్లర్లు వచ్చిన తరువాత ఎకరా వరిపంటను నూర్చడానికి మూడు గంటలు పడుతుంది. తరువాత తూర్పారబట్టడం అదనపు పని. ఈ విధంగా అయితే ఎకరాకు రూ.4,500 వరకు ఖర్చు అవుతుంది. అదే యంత్రంతో నూరిస్తే రూ.1,500లతో గంటలోపే పని పూర్తవుతున్నది. పాత పద్ధతుల్లో అయితే పంట నూర్చిన తరువాత ధాన్యం తూర్పార పట్టాలంటే గాలి కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ఒక్కోసారి నూర్చిన రోజు తూర్పారకు సరిపడ గాలి వీచకపోతే ధాన్యాన్ని కల్లంలోనే వుంచి, మరుసటి రోజో, ఆ తరువాత తూర్పారపట్టాల్సి వచ్చేది. నూర్పిడి యంత్రాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఈ సమస్య తొలగిపోయింది.

సంప్రదాయ పద్ధతిలోనే రాగి నూర్పులు

గిరిజన రైతులు వరి నూర్పులకు భిన్నంగా రాగి పంటను సంప్రదా పద్ధ్దతిలోనే నూర్చుకుంటున్నారు. పొలంలో పంట పండిన తరువాత రాగి కంకులను కోసి ఎండబెడతారు. బాగా ఎండిన తరువాత కుప్పగా పోసి దుడ్డు కర్రతో మోదుతారు. కంకుల నుంచి గింజలు వేరైన తరువాత తూర్పారపడతారు.

Updated Date - Jan 06 , 2024 | 12:59 AM