విశాఖకు పొంచి ఉన్న ముప్పు
ABN , Publish Date - Aug 02 , 2024 | 01:19 AM
భూతాపం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.
వాతావరణ మార్పులతో పెరుగుతున్న సముద్ర మట్టాలు
1992 నుంచి 2021 వరకూ 2.381 సెంటీమీటర్ల మేర పెరిగిన నీటి మట్టం
ఏడాదికి సగటున 0.181 సె.మీ. పెరుగుదల
2040కల్లా తీరంలో 6.96 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నీట మునిగే ప్రమాదం
ప్రమాదంలో పోర్టు, తెన్నేటి పార్కు, రుషికొండ, మంగమారిపేట బీచ్‌లు
ముంబై తరువాత అత్యధికంగా విశాఖలోనే సముద్ర మట్టం పెరుగుదల
బెంగళూరుకు చెందిన సీఎస్‌టీఈపీ సంస్థ అధ్యయనంలో వెల్లడి
విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):
వాతావరణ మార్పులతో సముద్ర మట్టాలు శరవేగంగా పెరుగుతున్నాయా?, ఈ పరిణామం దేశంలోని తీర నగరాలకు ముప్పుగా పరిణమించనున్నదా?, ఆ జాబితాలో విశాఖ నగరం కూడా ఉందా? అంటే...అవుననే అంటోంది బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్‌టీఈపీ). 2040కల్లా తీర ప్రాంతంలో 1.02 శాతం (6.96 చ.కి. విస్తీర్ణం) నీట మునిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
భూతాపం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. తీర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. గడచిన 30 ఏళ్లుగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అండ్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. ఈ క్రమంలో 2040 నాటికల్లా విశాఖపట్నం తీరంలో 1.02 శాతం భూభాగం నీట మునిగే అవకాశం ఉందని బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్‌టీఈపీ) తాజా అధ్యయనం వెల్లడించింది. 1992 నుంచి 2021 వరకూ ఏడాదికి 0.181 సెంటీమీటర్ల వంతున మొత్తం 2.381 సెంటీమీటర్ల మేర సముద్ర మట్టం పెరగడంతో తీరప్రాంతంలోకి చొచ్చుకు వచ్చింది. ఇదేవిధంగా 2040 నాటికి సముద్రమట్టం 16.7 నుంచి 18.3 సెంటీమీటర్ల మేర పెరిగే అవకాశం ఉందని, తీరంలో సుమారు 1.02 ప్రాంతం (6.96 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం) ముంపునకు గురవుతుందని గత నెలలో విడుదల చేసిన అధ్యయనంలో సీఎస్‌టీఈపీ పేర్కొంది. ‘సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు ముప్పు’ అన్న అంశంపై బెంగళూరుకు చెందిన సీఎస్‌టీఈపీ సంస్థకు చెందిన డాక్టర్ జె.అనూషియా, ఎం.సాయి వెంకటరమణ (ఏయూ ఓషనోగ్రపీ పూర్వ విద్యార్థి), ఎంఎస్ ప్రదీప్, ఎస్.విద్యలతో కూడిన పరిశోధక బృందం దేశంలోని తీర నగరాలపై అధ్యయనం చేసింది. దేశంలో ముంబై తరువాత ఎక్కువగా హల్దియా, విశాఖపట్నం నగరాలే సముద్ర ముప్పునకు గురవుతాయని అధ్యయనంలో హెచ్చరించింది. విశాఖపట్నంలో పోర్టు నుంచి మంగమారిపేట వరకు తీర ప్రాంతంపై ఈ బృందం అధ్యయనం చేసింది. 2040కల్లా తీర ప్రాంతంలో 1.02 శాతం (6.96 చదరపు కిలోమీటర్లు) నీట మునిగే ప్రమాదం ఉందని అంచనా వేసింది. వ్యవసాయ భూమి 0.48 చ.కి.లు, పచ్చదనం 1.24 చ.కి, పరిశ్రమలు 5.94, నగరం 14.2, వృథా భూములు 2.6, నీటి వనరుల ప్రాంతం 7.96 చదరపు కిలోమీటర్ల వైశాల్యం మేర నీట మునగనున్నది. దీంతో విశాఖ పోర్టు, తెన్నేటి పార్కు, రుషికొండ, మంగమారిపేటల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు నీట మునుగుతాయని ఈ సంస్థ అంచనా వేసింది.
పోర్టు నుంచి మంగమారిపేట వరకూ తీర ప్రాంతం ఇప్పటికే చాలావరకు కోతకు గురై నీట మునిగింది. ఏటా విశాఖ తీరంలో సముద్రం ముందుకువస్తోంది. కోస్టల్ బ్యాటరీ, సబ్‌మెరైన్, వైఎంసీఏ ఎదురుగా సముద్ర తీరం కోతకు గురవుతుంది. ఆర్కే బీచ్‌లో స్కాండిల్ పాయింట్‌కు ఒకప్పుడు సముద్రం చాలా దూరంగా ఉండేదని, ఇప్పుడు రుతుపవన సీజన్‌లో నీరు తాకుతోందని నిపుణులు గుర్తుచేస్తున్నారు. మానవ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా వాతావరణ మార్పుల ప్రభావంతో పెరిగిన భూతాపం వల్ల సముద్ర మట్టాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఇందుకు ఆసియా దేశాలు మినహాయింపు కాదని ఐపీసీసీ ఇప్పటికే స్పష్టంచేసింది. సముద్ర మట్టాలు పెరగడంతో ముంబై తరువాత ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే నగరం విశాఖేనని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది. సముద్ర మట్టాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టు పక్కనున్న మేహాద్రిగెడ్డలోకి నీరు ప్రవేశిస్తే ఆ ప్రాంతంలో చెట్లు, మడ అడవులు ముంపునకు గురవుతాయి. ఇంకా సముద్ర నీరు మేహాద్రిగెడ్డ లోపలకు ప్రవేశిస్తే భూగర్భ జలాలు ఉప్పునీటిగా మారతాయి. బీచ్‌రోడ్డు ఇప్పటికే కోతకు గురవుతూనే ఉంది. సముద్ర మట్టాలు పెరిగే క్రమంలో బీచ్‌రోడ్డు ప్రమాదంలో పడనున్నది. ఈ పరిణామం జీవ వైవిధ్యం, పర్యాటక, ఉపాధి రంగాలపై ప్రభావం చూపుతుంది. ఈ సంస్థ చేపట్టిన అధ్యయనం మేరకు 2060కల్లా విశాఖ తీరంలో 1.95 శాతం (13.29 చ.కి.మీ), 2080కల్లా 2.67 శాతం (18.18 చదరపు కిలోమీటర్లు), 2100కల్లా 4.76 శాతం (32.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం) భూమి నీట మునుగుతుందని అంచనా వేసింది.