Share News

నామినేషన్ల సందడి

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:50 AM

సార్వత్రిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది.

నామినేషన్ల సందడి

తొలిరోజు పది మంది దాఖలు

లోక్‌సభ స్థానానికి ముగ్గురు

నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఏడుగురు

భీమిలిలో గంటా నామినేషన్‌

ఆయనతో పాటు డమ్మీగా ఆయన కుమారుడు

రెండేసి సెట్లు రిటర్నింగ్‌ అధికారికి అందజేత

భారీగా తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు

విశాఖ ఎంపీ స్థానానికి ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నామినేషన్‌

భారీ పోలీస్‌ బందోబస్తు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి):

సార్వత్రిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. తొలిరోజు విశాఖ లోక్‌సభ స్థానానికి ముగ్గురు, మూడు అసెంబ్లీ స్థానాలకు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన రాజకీయ పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు భీమిలి అసెంబ్లీ స్థానానికి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

జిల్లాలో ఉన్న ఒక లోక్‌సభ స్థానానికి ఇండిపెండెంట్‌గా వడ్డి హరిగణేష్‌, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కిలారి ఆనందపాల్‌ (కేఏ పాల్‌), పిరమిడ్‌ పార్టీ నుంచి పి.సత్యవతి ఒక్కొక్క సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ వేసేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ కొద్దిమంది మద్దతుదారులతో కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే ఆయనతోపాటు మరో నలుగురిని మాత్రమే కలెక్టరేట్‌ లోనికి అనుమతించారు. తొలిరోజు నామినేషన్‌ దాఖలు చేసిన ముగ్గురు కూడా లోక్‌సభ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి డాక్టర్‌ ఎ.మల్లికార్జునకు నామినేషన్లు అందజేసి ప్రమాణం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్‌ నామి నేషన్లను పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో కలెక్టరేట్‌ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

గురువారం ఉదయం పది గంటల తరువాత జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డీఆర్వో మోహన్‌కుమార్‌ కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాట్లు పరిశీలించి పోలీసులకు పలు సూచనలు చేశారు. పోలీసులు ప్రధానగేటు వద్ద బందోబస్తు ఏర్పాటుచేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. కార్యాలయ ఆవరణ లోకి మూడు వాహనాలను, మఽధ్య ఉన్న గేటు నుంచి అభ్యర్థితోపాటు ఐదుగురిని మాత్రమే అనుమతించారు. నామినేషన్ల ఘట్టం ముగిసేంత వరకు అంటే ఈనెల 25వ తేదీ వరకు (ఆదివారం తప్ప) ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు అధికారులు తెలిపారు.

అసెంబ్లీ స్థానాలకు ఏడుగురు నామినేషన్లు...

తొలిరోజు జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలకుగాను భీమిలి, విశాఖ ఉత్తరం, గాజువాక, పెందుర్తి సెగ్మెంట్‌లకు ఏడుగురు నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలి అసెంబ్లీకి తెలుగుదేశం తరపున గంటా శ్రీనివాసరావు, ఆయన కుమారుడు రవితేజ రెండేసి సెట్లు నామినేషన్లు భీమిలి ఆర్డీవో భాస్కరరెడ్డికు అందజేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఇంకా విశాఖ ఉత్తరం నియోజక వర్గానికి నవభారత నిర్మాణ సేవ పార్టీ తరపున చింతాడ సూర్యం, జాతీయ జనసేన పార్టీ తరపున పి.జగదీష్‌లు సీతమ్మధార తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి అఖిల వద్ద నామినేషన్లు సమర్పించారు. గాజువాక అసెంబ్లీకి జాతీయ జనసేన పార్టీ తరపున పల్లి శ్రీనివాసరావు, పిరమిడ్‌ పార్టీ తరపున పెబ్బలి సత్యనారాయణమూర్తిలు గాజువాక తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అఽధికారి లక్ష్మారెడ్డికి, పెందుర్తి అసెంబ్లీ సీటుకు బీఎస్‌పీ అభ్యర్థిగా బంగారు రమణ పెందుర్తి తహసీల్దారు కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి పి. శేషశైలజ వద్ద నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు అనంతరం ప్రమాణం చేశారు.

Updated Date - Apr 19 , 2024 | 01:50 AM