కుమారుడిని చంపేసిన తండ్రి
ABN , Publish Date - Dec 30 , 2024 | 01:17 AM
మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ తండ్రి.. కన్న కొడుకుని సన్నికల్లు రాయితో కొట్టి, దారుణంగా హత్య చేశాడు. ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణమని తెలిసింది. నర్సీపట్నంలో కలకలం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి పట్టణ సీఐ జి.గోవిందరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సన్నికల్లు రాయితో తలపై మోది హత్య
మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ
ఆర్థిక వ్యవహారాలే కారణం
నిందితుడు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి
నర్సీపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ తండ్రి.. కన్న కొడుకుని సన్నికల్లు రాయితో కొట్టి, దారుణంగా హత్య చేశాడు. ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణమని తెలిసింది. నర్సీపట్నంలో కలకలం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించి పట్టణ సీఐ జి.గోవిందరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నర్సీపట్నంలోని వెంకునాయుడుపేట శివారు లక్ష్మీనగర్‌లో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కఠారి రమణకు కుమారుడు భాస్కర్ (32), కుమార్తె పావని ఉన్నారు. రమణ భార్య పార్వతి పదేళ్ల క్రితం మరణించింది. పావనికి వివాహం కావడంతో భర్తతో కలిసి ధర్మసాగరంలో నివాసం ఉంటున్నది. భాస్కర్‌కు ఇంకా వివాహం కాలేదు. తండ్రి, కుమారుడు వెంకునాయుడుపేట శివారు లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నారు. భాస్కర్ ఏ పనిచేయకుండా ఖాళీగా వుంటూ, తండ్రి పెన్షన్ డబ్బులతో మద్యం సేవిస్తూ జాల్సా చేస్తున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే తండ్రిని కొడుతుండేవాడు. దీంతో విసిగిపోయిన రమణ.. మూడు నెలల క్రితం తన ఆస్తిని కూతురు పేరున రాయడానికి సిద్ధమయ్యాడు. ఏటీఎం కార్డుని కుమార్తె వద్ద ఉంచాడు. ఈ విషయాలపై మూడు నెలల నుంచి తండ్రి, కొడుకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి రమణ, భాస్కర్‌తోపాటు జిలానీ అనే యువకుడు కలిసి రమణ ఇంటిలోనే మద్యం తాగారు. ఈ సందర్భంగా ఏదో విషయమై తండ్రి, కొడుకు మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. మద్యం తాగడం పూర్తయిన తరువాత జిలానీ తన ఇంటికి వెళ్లిపోయాడు. తండ్రీకొడుకులు ఆర్థికపరమైన విషయాలపై మరోసారి గొడవ పడ్డారు. ఘర్షణ పెద్దది కావడంతో కఠారి రమణ సన్నికల్లు రాయి తీసుకుని భాస్కర్ తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతనను అక్కడికక్కడే మృతిచెందాడు. ఆదివారం ఉదయం పని మనిషి వచ్చేసరికి భాస్కర్ రక్తపుమడుగులో విగతజీవిగా పడివున్నాడు. రమణ మద్యం మత్తులోనే వున్నాడు. వెంటనే ఆమె ఈ విషయాన్ని అదే ఇల్లు పైఅంతస్థులో ఉంటున్న వారికి చెప్పింది. వాళ్లు ధర్మసాగరంలో నివాసం ఉంటున్న పావనికి కూడా ఫోన్ చేసి సమాచారం చెప్పారు. పావని వచ్చి చూసి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ గోవిందరావు సంఘటనా స్థలానికి చేరుకొని రమణను, అతని కుమార్తె పావనిని విచారించారు. రమణ, భాస్కర్‌తో కలిసి మద్యం సేవించిన జిలానీని పిలిపించి శనివారం రాత్రి ఏం జరిగిందన్నదానిపై ఆరా తీశారు. నిందితుడు రమణను అదుపులోకి తీసుకున్నారు.