Share News

ఆర్డీ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:14 AM

వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో అడ్డగోలుగా స్టాఫ్‌ నర్సు పోస్టులు భర్తీ చేసేందుకు గురువారం అధికారులు యత్నించడం వివాదాస్పదమైంది.

ఆర్డీ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం

కోడ్‌ ఉండగా స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి సిద్ధం

కలెక్టర్‌కు పలువురు అభ్యర్థులు ఫిర్యాదు

కాబోయే సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి కూడా..

ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు..నిలిచిన కౌన్సెలింగ్‌

విశాఖపట్నం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి):

వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయ పరిధిలో అడ్డగోలుగా స్టాఫ్‌ నర్సు పోస్టులు భర్తీ చేసేందుకు గురువారం అధికారులు యత్నించడం వివాదాస్పదమైంది. అది కూడా కేజీహెచ్‌తోపాటు ఇతర ఆస్పత్రుల్లో, విజయనగరం జిల్లాలో ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయకుండా ఏజెన్సీలోని మెడికల్‌ కాలేజీలో పోస్టింగ్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ అభ్యర్థులు పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలతో ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించారంటూ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబునాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఈ ప్రక్రియను నిలిపివేయాల్సిందిగా ఆయన డీఎంఈకు సూచించారు. దీంతో విశాఖలోని ఆర్డీ కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గురువారం చేపట్టాల్సిన కౌన్సెలింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై అభ్యర్థులు ఆనందాన్ని వ్యక్తంచేశారు.

జిల్లాలో 118మందికి డిపాజిట్‌ గల్లంతు

విశాఖపట్నం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి):

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు డిపాజిట్లు కోల్పోయారు. విశాఖ జిల్లాలో ఒక పార్లమెంటుకు 33 మంది, ఏడు అసెంబ్లీ స్థానాలకు 101 మంది పోటీ చేశారు. మొత్తం 134 మంది బరిలో ఉన్నారు. వీరిలో 16 మంది తప్ప మిగిలిన 118 మంది డిపాజిట్‌ కోల్పోయారు. పార్లమెంటు, ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఆయా స్థానాల్లో వైసీపీకి చెందిన ఎనిమిది మంది అభ్యర్థులకు డిపాజిట్‌కు తగినన్ని ఓట్లు రాగా మిగిలిన 118 మంది ధరావత్తు కోల్పోయారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేసిన 33 మందిలో 31 మంది, ఏడు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన 101 మందిలో 87 మందికి డిపాజిట్‌ గల్లంతైంది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చెల్లిన ఓట్లలో 1/6 వంతు వస్తేనే డిపాజిట్‌ వెనక్కి ఇస్తారు. ఈ లెక్కన జిల్లాలో 118 మందికి డిపాజిట్‌ రాలేదు.

Updated Date - Jun 07 , 2024 | 01:14 AM