Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

రౌడీషీటర్లపై ఉక్కుపాదం

ABN , Publish Date - Mar 03 , 2024 | 01:36 AM

నగరంలో రౌడీషీటర్లపై పోలీసులు ఎట్టకేలకు దృష్టిసారించారు. కొంతమంది రౌడీషీటర్లు తరచూ నగరంలో ఎక్కడో ఒకచోట దాడులు, దౌర్జన్యాలకు దిగడంతోపాటు భూ వివాదాల్లో తల దూరుస్తున్నారు.

రౌడీషీటర్లపై ఉక్కుపాదం

నిరంతరం నిఘా పెట్టాల్సిందిగా సీఐలకు పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాలు

ఎక్కడైనా పొరపాటు జరిగితే సంబంధిత కానిస్టేబుళ్లను కూడా బాధ్యులను చేస్తానంటూ హెచ్చరిక

స్టేషన్‌ల వారీగా వివరాల సేకరణ

విశాఖపట్నం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి):

నగరంలో రౌడీషీటర్లపై పోలీసులు ఎట్టకేలకు దృష్టిసారించారు. కొంతమంది రౌడీషీటర్లు తరచూ నగరంలో ఎక్కడో ఒకచోట దాడులు, దౌర్జన్యాలకు దిగడంతోపాటు భూ వివాదాల్లో తల దూరుస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి.

రౌడీషీటర్లకు ప్రతి ఆదివారం పోలీసులు తూతూమంత్రంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి ఇంటికి పంపించేస్తున్నారు. కౌన్సెలింగ్‌కు హాజరుకానివారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రౌడీషీటర్లలో దూకుడుగా ఉన్నవారిని, దందాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు నిత్యం జైల్లోనే ఉండేలా చర్యలు తీసుకునేవారు. ఒక కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత రౌడీషీటర్ల కదలికలను నిరంతరం గమనించే బాధ్యతను ఒక కానిస్టేబుల్‌కు అప్పగించేవారు. బెయిల్‌పై వచ్చిన రౌడీషీటర్ల మళ్లీ ఇతర రౌడీషీటర్లతో కలిసి తిరిగినా, ఎవరినైనా బెదిరించినా కేసు నమోదుచేసి తిరిగి జైలుకు పంపించేవారు. దీనివల్ల రౌడీషీటర్లలో భయం ఏర్పడి వివాదాల జోలికి వెళ్లేందుకు సాహసించేవారు కాదు. కానీ గతకొంతకాలంగా రౌడీషీటర్లపై పోలీసుల నిఘా కొరవడిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పోలీసులకు ఇతర విధులు పెరిగిపోవడంతో రౌడీషీటర్లపై దృష్టి పెట్టేందుకు వీల్లేకుండాపోయింది. దీంతో రౌడీషీటర్లు మళ్లీ గతంలో మాదిరిగా బెదిరింపులు, దందాలు మొదలుపెట్టారు. తాజాగా పాతనగరానికి చెందిన దండుపాళ్యం గ్యాంగ్‌ నాయకుడు దోని సతీష్‌ అలియాస్‌ గసగసాలు డమ్మీ తుపాకీ చూపించి ఇతరులను బెదిరించి డబ్బులు గుంజుతున్నట్టు ఫిర్యాదు అందడంతో అతడితోపాటు అతని అనుచరుడైన మనోజ్‌ను అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు పంపించారు. వారి నుంచి డమ్మీ తుపాకీతోపాటు పది సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరితోపాటు మరికొందరు రౌడీషీటర్లపై కూడా ఫిర్యాదులు అందుతుండడంతో సీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ప్రతి స్టేషన్‌ పరిధిలోనూ రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా పెట్టాలని సంబంధిత స్టేషన్ల సీఐలను ఆదేశించారు. ఒకవేళ రౌడీషీటర్‌ ఏదైనా నేరంలో పాల్గొన్నట్టు తేలితే సంబంధిత స్టేషన్‌ సీఐతోపాటు బాధ్యుడైన కానిస్టేబుల్‌పై కూడా చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. దీంతో అన్ని స్టేషన్ల పరిధిలోనూ రౌడీషీటర్ల జాబితాతోపాటు ఎవరెక్కడ ఉంటున్నారనే వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Updated Date - Mar 03 , 2024 | 01:36 AM