Share News

సర్క్యూట్‌హౌస్‌లో రాజకీయ ప్రెస్‌మీట్లకు చెక్‌

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:37 AM

నగరంలోని గవర్నర్‌ బంగ్లా (సర్క్యూట్‌ హౌస్‌)ను వైసీపీ కార్యాలయంగా మార్చేశారన్న విమర్శలకు జిల్లా యంత్రాంగం ఆలస్యంగా స్పందించింది.

సర్క్యూట్‌హౌస్‌లో రాజకీయ ప్రెస్‌మీట్లకు చెక్‌

మంత్రి అమర్‌నాథ్‌ సమావేశానికి నో చెప్పిన అధికారులు

ఐదేళ్ల నుంచి వైసీపీ కార్యాలయంగా మార్చేసిన మంత్రులు, నేతలు

ఎట్టకేలకు ఎన్నికల ముందు మేల్కొన్న యంత్రాంగం

విశాఖపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని గవర్నర్‌ బంగ్లా (సర్క్యూట్‌ హౌస్‌)ను వైసీపీ కార్యాలయంగా మార్చేశారన్న విమర్శలకు జిల్లా యంత్రాంగం ఆలస్యంగా స్పందించింది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుండడంతో గవర్నర్‌ బంగ్లా (ప్రభుత్వ అతిథిగృహం) వేదికగా రాజకీయ ఆరోపణలు, విమర్శలు చేయడానికి ఏర్పాటుచేసే విలేకరుల సమావేశాలకు అనుమతించకూదని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం సర్క్యూట్‌హౌస్‌ మేనేజర్‌ను ఆదేశించింది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తుపై శనివారం సాయంత్రం మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సర్క్యూట్‌హౌస్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. అయితే ఇక్కడ (సర్క్యూట్‌హౌస్‌) రాజకీయపరమైన విమర్శలు చేయడానికి విలేకరుల సమావేశాలు నిర్వహించవద్దని జిల్లా యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలను మేనేజర్‌, మంత్రికి చెప్పారు. దీంతో అమర్‌ బంగ్లా వెలుపల సమావేశం నిర్వహించారు.

ఆలస్యంగా మేలుకున్న యంత్రాంగం

నగరం నడిబొడ్డున వున్న సర్క్యూట్‌హౌస్‌ను ఐదేళ్ల నుంచి మంత్రులు, ఎంపీలు, అధికార పార్టీ నేతలు వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. గతంలో ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా వున్న ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రస్తుత ఇన్‌చార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్‌నాథ్‌, ఇతర నేతలు గవర్నర్‌ బంగ్లా వేదికగా విపక్షాలపై దుమ్మెత్తిపోస్తూ వస్తున్నారు. ఉత్తరాంధ్ర ఇన్‌చార్జులుగా ఉన్న నేతల వెంట వచ్చే కిందిస్థాయి నాయకులు గవర్నర్‌ బంగ్లాలోని పలు గదుల్లో తిష్ఠవేసి తమ సొంత భవనంలా వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌ పదవీకాలం ముగిసిన తరువాత కేవలం వైసీపీ నేతగానే (ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి) వున్నారు. పలు సందర్భాల్లో గవర్నర్‌ బంగ్లాలో నాయకులతో సమావేశాల నిర్వహణకు ఆయనకు అనుమతి ఎలా ఇచ్చారో జిల్లా యంత్రాంగం చెప్పాలి.

ఇదిలావుండగా ప్రభుత్వానికి న్యాయపరమైన సలహాలు ఇచ్చే న్యాయవాది ఒకరు సర్య్యూట్‌హౌస్‌లో ఒక గదిని నెలల తరబడి తన స్వాధీనంలో వుంచుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. అమర్‌నాథ్‌ మంత్రి అయిన తరువాత విశాఖ కేంద్రంగానే రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. సర్క్యూట్‌హౌస్‌లో తరచూ విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి విపక్షాలపై విమర్శలు చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్న జిల్లా యంత్రాంగం, ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న తరుణంలో మేల్కొనడం గమనార్హం.

Updated Date - Mar 11 , 2024 | 01:37 AM