Share News

అస్తవ్యస్తంగా రైల్వే స్టేషన్‌

ABN , Publish Date - Aug 12 , 2024 | 01:15 AM

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. రోజూ పది వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ స్టేషన్‌లో అడుగడుగునా సమస్యలే. ఏ సమాచారం కావాలన్నా కాళ్లు నొప్పి పుట్టేలా తిరిగాల్సిందే.

అస్తవ్యస్తంగా రైల్వే స్టేషన్‌

  • అధ్వానంగా నిర్వహణ

  • రైళ్ల సమాచారం అందించని డిస్‌ప్లే బోర్డులు

  • ప్లాట్‌ఫారాలపై పనిచేయని ఎస్కలేటర్లు

  • నాలుగు నెలలైనా అందుబాటులోకి రాని ఆర్‌ఓబీ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. రోజూ పది వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే ఈ స్టేషన్‌లో అడుగడుగునా సమస్యలే. ఏ సమాచారం కావాలన్నా కాళ్లు నొప్పి పుట్టేలా తిరిగాల్సిందే. హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం ఉదయం 5.45 గంటలకు రావలసిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌ గత వారం రోజులుగా ప్రతి రోజూ కనీసం రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ రైలు సరైన సమయానికి గమ్యానికి చేరుతుందని ప్రయాణికుల నమ్మకం. దానిని కూడా వమ్ము చేస్తున్నారు. శనివారం సాయంత్రం 5.05 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరిన ఈ రైలు ఆదివారం ఉదయం 3.14 గంటలు ఆలస్యంగా 8.59 గంటలకు విశాఖపట్నం చేరుకుంది. దువ్వాడ నుంచి విశాఖపట్నం స్టేషన్‌కు రావడానికి సుమారు 40 నిమిషాలు సమయం పట్టింది. ఎక్కువసేపు అవుటర్‌లో నిలిపివేశారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను రెగ్యులర్‌గా ఒకటో నంబరు ప్లాట్‌ఫారంపై నిలుపుతారు. ఆ సంప్రదాయాన్ని కూడా పక్కకునెట్టి ఏడో నంబరు ప్లాట్‌ఫారంపై పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న రైళ్లను అటు ఎనిమిది, ఇటు ఒకటో నంబరు ప్లాట్‌ఫారాలపై పెడుతూ ఈ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో ఉపయోగించుకునే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లను కొత్తగా వేరే నంబరు ప్లాట్‌ఫారాలపై పెడుతున్నారు. అక్కడి నుంచి స్టేషన్‌ బయటకు రావడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

పనిచేయని ఎస్కలేటర్లు

రైల్వే స్టేషన్‌లో ఒక ప్లాట్‌ఫారం నుంచి మరో ప్లాట్‌ఫారానికి వెళ్లడానికి మెట్లతో పాటు ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటో రెండో పనిచేస్తాయి. మిగిలినవన్నీ మొరాయిస్తుంటాయి. మెట్లపై ఎక్కినట్టు వాటిపై కూడా ఎక్కి వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదు. వాటికి మరమ్మతులు చేయించడం లేదు. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లకు వార్షిక నిర్వహణ కాంట్రాక్టు ఉంటుంది. ఫిర్యాదు చేస్తే సదరు సంస్థ వచ్చి మరమ్మతులు చేసి వెళుతుంది. ఈ విషయంలోను అధికారులు శ్రద్ధ చూపడం లేదు. నిత్యం ఎస్కలేటర్లు మొరాయిస్తున్నాయి.

సమాచారం డిస్‌ప్లే నిల్‌

రైళ్ల రాకపోకల వివరాలు ఒక వైపు మైకులో చెబుతూనే మరో వైపు ఎక్కడికక్కడ ఎల్‌సీడీ డిస్‌ప్లే ద్వారా అన్ని రైళ్ల వివరాలు డిస్‌ప్లే చేయాలి. స్టేషన్‌ పెద్దది కావడంతో అన్ని వైపుల వీటిని పెట్టారు. ప్రధాన మార్గం గుండా స్టేషన్‌కు వెళ్లేటపుడు గేట్‌-2 వద్ద పెద్ద డిస్‌ప్లే బోర్డు ఉంది. అక్కడ ఎటువంటి సమాచారం డిస్‌ప్లే చేయడం లేదు. ఆ మార్గంలో స్టేషన్‌ లోపలకు వెళ్లేవారు రైళ్ల సమాచారం కోసం దిక్కులు చూడాల్సి వస్తోంది. డివిజన్‌ కేంద్రమైన విశాఖపట్నంలోనే స్టేషన్‌ నిర్వహణ ఇంత దారుణంగా ఉంటే మిగిలిన పట్టణాల్లో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి. వారం క్రితం కోర్బా ఎక్స్‌ప్రెస్‌ మూడో నంబరు ప్లాట్‌ఫారంపై మంటలు అంటుకున్నాయి. దీనికి కారణం ఏమిటో ఇప్పటివరకూ వెల్లడి కాలేదు. దీని తరువాత భువనేశ్వర్‌ నుంచి తూర్పు కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ రెండు రోజుల క్రితం విశాఖపట్నం వచ్చి అన్నీ పరిశీలించారు. మరి స్టేషన్‌లో నెలకొని ఉన్న పరిస్థితులు గమనించలేదా?, వాటిని సరిదిద్దడానికి ఆదేశాలు ఇవ్వలేదా?...అని ప్రయాణికుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

రైళ్లు ఆలస్యం

రీ షెడ్యూల్‌తో హౌరా-చెన్నై మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ లేటు

మూడు గంటలు ఆలస్యంగా విశాఖ చేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌

గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ గంటన్నర...

విశాఖపట్నం, ఆగస్టు 11:

వివిధ రైల్వే డివిజన్లలో నిర్మాణ పనులు జరుగుతుండడంతోపాటు లింక్‌ రేక్‌ అందుబాటులో లేని కారణంగా పలు రైళ్లను రీ షెడ్యూల్‌ చేయడంతో ఆలస్యంగా నడుస్తున్నాయి. హౌరా-చెన్నై సెంట్రల్‌ మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12830)ను రీ షెడ్యూల్‌ చేయడంతో ఆదివారం సుమారు 14 గంటలు ఆలస్యంగా నడిచింది. నిర్ణీత సమయం ప్రకారం ఈ రైలు శనివారం రాత్రి 11.55 గంటలకు హౌరాలో బయలుదేరాల్సి ఉండగా, లింక్‌ రేక్‌ అందుబాటులో లేకపోవడంతో ఆదివారం సాయంత్రం 4.12 గంటలకు బయలుదేరింది. అలాగే హౌరా-తిరుపతి హంసఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ (20889) శనివారం హౌరాలో రెండు గంటల 48 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ఆదివారం తెల్లవారుజామున 2.00 గంటలకు విశాఖ స్టేషన్‌కు చేరాల్సిన ఈ రైలు ఉదయం 5.00 గంటలకు వచ్చింది. ఇక హౌరా-ఎర్నాకులం అంతోద్యయ ఎక్స్‌ప్రెస్‌ శనివారం హౌరాలో మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో ఆదివారం ఉదయం 4.45 గంటలకు దువ్వాడ స్టేషన్‌కు చేరాల్సిన ఈ రైలు 7.55 గంటలకు చేరింది.

మూడు గంటలు ఆలస్యంగా చేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12728) ఆదివారం ఉదయం మూడు గంటలు ఆలస్యంగా నడిచింది. షెడ్యూల్‌ ప్రకారం శనివారం సాయంత్రం 5.05 గంటలకు బయలుదేరి...రాత్రి 10.50 గంటలకు విజయవాడ స్టేషన్‌కు రావాల్సి ఉండగా...అర్ధరాత్రి 12.00 గంటలకు చేరింది. సోమవారం ఉదయం 5.45 గంటలకు విశాఖ చేరాల్సి ఉండగా, ఉదయం 9.00 గంటలకు వచ్చింది. అలాగే శనివారం దాదాపు నిర్ణీత సమయానికి సికింద్రాబాద్‌లో బయలుదేరిన గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ (12740) ఆదివారం ఉదయం సుమారు గంటన్నర ఆలస్యంగా విశాఖ చేరింది. ఉదయం 7.40 గంటలకు రావాల్సి ఉండగా, 9.25 గంటలకు వచ్చింది. ఇక చెన్నై-హౌరా మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12840) కూడా ఆదివారం సుమారు రెండున్నర గంటలు ఆలస్యంగా నడిచింది. ఈ రైలు ఉదయం 7.50 గంటలకు విశాఖ చేరాల్సి ఉండగా...10.10 గంటలకు చేరింది.

Updated Date - Aug 12 , 2024 | 01:15 AM