Share News

పెందుర్తి నుంచి అమర్‌కు చాన్స్‌?

ABN , Publish Date - Jan 09 , 2024 | 01:21 AM

ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం దృష్టిసారించింది.

పెందుర్తి నుంచి అమర్‌కు చాన్స్‌?

పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం

మూడో జాబితాలో పేరు ఉంటుందంటున్న ఆయన అనుయాయులు

వాస్తవానికి ఎలమంచిలి లేదా చోడవరం నుంచి పోటీకి ఆసక్తి చూపిన మంత్రి

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ససేమిరా అనడంతో పెందుర్తి వైపు చూపు

సిట్టింగ్‌ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ శిబిరంలో కలకలం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం దృష్టిసారించింది. ఇప్పటికే రెండు విడతలుగా 38 మందిని ప్రకటించింది. తాజాగా మరో 22 మందితో మూడో విడత జాబితా విడుదల చేయబోతున్నట్టు పార్టీలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అందులో పెందుర్తి నుంచి మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేరును ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది సిట్టింగ్‌ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ వర్గీయుల్లో కలవరం రేపుతోంది.

వైసీపీ నెల రోజుల కిందట తొలివిడత 11 మందితో ఒక జాబితా విడుదల చేసింది. గాజువాక నియోజకవర్గానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని, ఆయన కుమారుడు దేవన్‌రెడ్డిని కాకుండా 70వ వార్డు కార్పొరేటర్‌ ఉరుకూటి రామచంద్రరావును సమన్వయకర్తగా నియమించింది. కొద్దిరోజుల కిందట 27 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. అందులో ఉమ్మడి జిల్లాకు సంబంధించి పాయకరావుపేట టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు కాకుండా విజయనగరం జిల్లా రాజాం సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంబాల జోగులుకు కేటాయించింది. తాజాగా మరో 22 మంది అభ్యర్థులతో మూడో జాబితాను సిద్ధం చేసినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. మూడో జాబితాలో పెందుర్తి అభ్యర్థిగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పేరు ప్రకటించడం ఖాయమని అంటున్నారు. ఈ మేరకు రెండు రోజుల కిందటే అధిష్ఠానం నుంచి సంకేతాలు అందాయంటూ పేర్కొంటున్నారు. అయితే మంత్రి అమర్‌నాథ్‌ ఎలమంచిలి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపగా, అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కన్నబాబురాజు తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకవేళ తనకు టికెట్‌ ఇవ్వకుండా వేరెవరికి ఇచ్చినా వారి ఓటమిని కృషిచేస్తానని పార్టీ ముఖ్య నేతలకు ఆయన తేల్చిచెప్పడంతో మంత్రి అమర్‌నాథ్‌ వెనకడుగు వేసినట్టు చెబుతున్నారు. రెండో ప్రాధాన్యంగా చోడవరం నుంచి పోటీకి మంత్రి అమర్‌నాథ్‌ ఆసక్తి చూపారు. తనను తొలగించి ఎవరికి టికెట్‌ ఇచ్చినా వారి విజయానికి సహకరిస్తానని, తన సామాజికవర్గానికి చెందిన మంత్రి అమర్‌నాథ్‌కు ఇస్తానంటే మాత్రం తాను అంగీకరించబోనని సిట్టింగ్‌ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పార్టీలో కీలక నేతకు స్పష్టంచేసినట్టు చెబుతున్నారు. దీంతో విధిలేని పరిస్థితిలో పెందుర్తి నుంచి పోటీకి అనుమతించాలని మంత్రి అమర్‌నాథ్‌ అధిష్ఠానాన్ని కోరారంటున్నారు. గతంలో తనతాత అప్పన్న, తండ్రి గురునాథరావు కూడా పెందుర్తి నుంచే పోటీ చేసి గెలిచినందున తనకు అక్కడ నుంచి పోటీకి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌పై వ్యతిరేకత ఉందంటూ అతడిని మార్చే ప్రతిపాదన అధిష్ఠానం వద్ద ఉండడం...అమర్‌నాథ్‌కు కలిసొచ్చినట్టయిందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుండగా గుడివాడ అమర్‌నాథ్‌కు పెందుర్తి టికెట్‌ కేటాయించనున్నారనే ప్రచారం సిట్టింగ్‌ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ శిబిరంలో కలవరం రేపుతోంది. మరి...అదీప్‌రాజ్‌ను ఎక్కడ నుంచి పోటీకి దింపుతారని ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఆయన్ను కాకుండా వేరెవరినో తమపై రుద్దితే వారి విజయానికి తాము పనిచేసేది లేదని అంటున్నట్టు సమాచారం.

Updated Date - Jan 09 , 2024 | 01:21 AM