మదుంలోకి దూసుకుపోయిన కారు
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:47 AM
అదుపుతప్పి కారు పెదబొడ్డేపల్లి మదుంలోకి దూసుకు పోవడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి జరిగింది.
ఒకరికి తీవ్ర గాయాలు
నర్సీపట్నం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): అదుపుతప్పి కారు పెదబొడ్డేపల్లి మదుంలోకి దూసుకు పోవడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి జరిగింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా వున్నాయి. నర్సీపట్నం బొంబాయి బజార్ యజమాని బి.కొండలరావు బ్యాంక్ కాలనీలో నివాసముంటున్నారు. ఆదివారం రాత్రి షాపులో పని చేసే సిబ్బందిని కారులో కోటవురట్ల మండలం జల్లూరులో వారి ఇంటి వద్ద దింపి తిరిగి నర్సీపట్నం బయలు దేరారు. పెదబొడ్డేపల్లి సెంటర్ దాటిన తర్వాత ఆర్డీవో బంగ్లా దగ్గరలో కారు అదుపుతప్పి వంతెనను ఢీ కొట్టింది. పాత వంతెన, కొత్త వంతెనల మధ్యలోంచి దూసుకు పోయి మదుంలో పడిపోయింది. కారు డ్రైవింగ్ చేస్తున్న కొండలరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. పెదబొడ్డేపల్లి మదుం దాటి మలుపు తిరిగితే బ్యాంక్ కాలనీలోని ఇంటికి చేరుకోవచ్చు. ఒక్క నిమిషంలో ఇంటికి చేరుకునే లోపు దురదృష్టం వెంటాడి కారు ప్రమాదంతో కొండలరావు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం నర్సీపట్నంలో గృహ ప్రవేశం జరగాల్సి ఉండగా ప్రమాదం కారణంగా వాయిదా వేసుకోవల్సి వచ్చింది.