Share News

సమస్యల బందిఖానా

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:21 AM

వైసీపీ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో కారాగార వ్యవస్థను పూర్తిగా విస్మరించింది.

సమస్యల బందిఖానా

  • కేంద్ర కారాగారంలో పరిమితికి మించి ఖైదీలు

  • జిల్లా జైలు ఏర్పాటు ప్రతిపాదనలు బుట్టదాఖలు

  • కనీసం విస్తరణ ఊసు కూడా లేదు

  • మరోవైపు సిబ్బంది కొరతతో నిర్వహణపరమైన సమస్యలు

  • ఐదేళ్లుగా కారాగార వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వం శీతకన్ను

  • సుప్రీంకోర్టు ఆదేశాలున్నా క్షమాభిక్ష లేదు

  • తాజాగా తెలంగాణలో 230 మందికి క్షమాభిక్ష

ఎం.వి.పి.కాలనీ, జూలై 3:

వైసీపీ ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో కారాగార వ్యవస్థను పూర్తిగా విస్మరించింది. ఇందుకు నిదర్శనం విశాఖ కేంద్ర కారాగారం. గడచిన కొంతకాలంగా ఈ జైలు కిక్కిరిసి ఉంది. వాస్తవ పరిమితి 914 కాగా 1,700 నుంచి 2,200 మంది ఖైదీలు ఉంటున్నారు. అయినా విస్తరించే ఆలోచన చేయలేదు. జిల్లా జైలు నిర్మించుకోవడానికి స్థలం అడిగినా దానికీ మోక్షం లభించలేదు. ఐదేళ్లుగా ఖైదీల క్షమాభిక్ష అంశం పట్టించుకోలేదు. సిబ్బంది కొరత ఉన్నా, నియామకాలు లేవు.

ఐదేళ్లుగా క్షమాభిక్ష లేదు

ఏటా కమిటీ పరిశీలించి క్షమాభిక్ష ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. కానీ వైసీపీ ప్రభుత్వం దీనిపై దృష్టిసారించనే లేదు. కొన్ని కఠినమైన సెక్షన్లలో శిక్షపడిన వారిని మినహాయించి, మిగిలిన వాటిలో...ఖైదీల సత్ప్రవర్తన, శిక్ష కాలం, రెమిషన్‌ వంటివి కమిటీ పరిశీలించి, వారిని విడుదల చేయాలని ఆదేశాల్లో స్పష్టంచేసింది. అయితే ఐదేళ్లుగా క్షమాభిక్షపై ఒక్క ఖైదీని కూడా విడుదల చేయలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 230 మందిని క్షమాభిక్షపై విడుదల చేస్తుండడం ప్రస్తావనార్హం.

వేధిస్తున్న సిబ్బంది కొరత

రాష్ట్రవ్యాప్తంగా జైళ్ల శాఖలో ఐదు వందలకు పైగా కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆ పోస్టుల భర్తీకి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కారాగారాల పరిపాలనా వ్యవస్థలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ పక్క జైళ్లలో ఖైదీల సంఖ్య పెరిగిపోతుండగా, మరోపక్క పదవీ విరమణల కారణంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. యుద్ధప్రాతిపదికన కానిస్టేబుళ్ల నియామకం జరగాల్సి ఉంది.

జిల్లా జైలు కోసం ప్రతిపాదనలు

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జిల్లా జైలు కట్టాలని జైళ్ల శాఖ నిర్ణయించినా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జిల్లా జైలు నిర్మిస్తే కేంద్ర కారాగారంలో రద్దీ తగ్గుతుందని అధికారుల భావన. ఆ మేరకు అక్కడ జైలు నిర్మించాలని, అందుకోసం కొంత స్థలం కేటాయించాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదు. కనీసం కేంద్ర కారాగారం అయినా విస్తరించి, కొత్తగా బ్లాకులు నిర్మించాల్సి ఉన్నా, ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

హోం మంత్రికి నివేదించాం

కిషోర్‌కుమార్‌, పర్యవేక్షణాధికారి, కేంద్ర కారాగారం, విశాఖపట్నం

రెండు రోజుల క్రితం కేంద్ర కారాగారాన్ని సందర్శించిన హోం మంత్రికి ఇక్కడి పరిస్థితులను వివరించాం. క్షమాభిక్ష అంశంతో పాటు, కారాగారంలో ఖైదీల సంఖ్య పెరిగిన విషయం, సిబ్బంది కొరత వంటివి ఆమె దృష్టికి తీసుకువెళ్లాం. కారాగారాల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొద్దిరోజుల్లోనే సమస్యలు తొలగిపోవచ్చు.

Updated Date - Jul 05 , 2024 | 01:21 AM