Share News

ముద్దగా అన్నం, నీళ్ల సాంబారు

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:09 AM

ముద్దగా ఉన్న అన్నం, నీళ్ల సాంబారు.. అది కూడా అరకొరగా తయారీ.. ఇదీ ఇమ్మానుయేలు సంస్థ యాజమాన్యం విద్యార్థులకు పెట్టే భోజనం. మాకవరపాలెం తహసీల్దార్‌ ప్రసాద్‌ మంగళవారం తామరం, కొండలఅగ్రహారంలో ఉన్న ఈ సంస్థకు చెందిన రెండు అనాథాశ్రమాలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ముద్దగా అన్నం, నీళ్ల సాంబారు
తామరం ఇమ్మానుయేలు అనాథాశ్రమంలో విద్యార్థులకు పెట్టే భోజనాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్‌ ప్రసాద్‌

ఇమ్మానుయేలు అనాథాశ్రమంలో విద్యార్థులకు పెట్టే భోజనం ఇది

అది కూడా అరకొరగానే..

రెండు ఆశ్రమాలను ఆకస్మికంగా తహసీల్దార్‌ తనిఖీ

అక్కడి పరిస్థితులపై అసహనం

ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని వెల్లడి

మాకవరపాలెం, ఆగస్టు 20: ముద్దగా ఉన్న అన్నం, నీళ్ల సాంబారు.. అది కూడా అరకొరగా తయారీ.. ఇదీ ఇమ్మానుయేలు సంస్థ యాజమాన్యం విద్యార్థులకు పెట్టే భోజనం. మాకవరపాలెం తహసీల్దార్‌ ప్రసాద్‌ మంగళవారం తామరం, కొండలఅగ్రహారంలో ఉన్న ఈ సంస్థకు చెందిన రెండు అనాథాశ్రమాలను తనిఖీ చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కోటవురట్లలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా, 42 మంది అస్వస్థతకు గురైన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తహసీల్దార్‌.. ఇమ్మానుయేలు సంస్థకు చెందిన రెండు అనాథాశ్రమాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కొండలఅగ్రహారంలోని అనాథాశ్రమాన్ని ఆయన సందర్శించారు. అక్కడ 40 మంది విద్యార్థులు ఉండగా, చాలీచాలని భోజనం తయారు చేసినట్టు గుర్తించారు. పిల్లలకు ఈ భోజనాలు ఏం సరిపోతాయని తహసీల్దార్‌ ప్రశ్నించగా, ప్రిన్సిపాల్‌ పొంతన లేని సమాధానం చెప్పారు. విద్యార్థులకు భోజనాలు ఇక్కడ పెట్టడం లేదని, వేరే చోట పెడుతున్నామన్నారు. సిబ్బంది అయితే విద్యార్థుల కోసమని ఒకసారి, కాదు ఆస్పత్రిలోని రోగులకు అని మరోసారి చెప్పారు.

విద్యార్థులకు అరకొర భోజనం

అనంతరం తామరంలోని అనాథాశ్రమానికి తహసీల్దార్‌ వెళ్లి అక్కడి వంటశాలను పరిశీలించారు. అక్కడ ముద్దగా ఉన్న అన్నంతో పాటు నీళ్ల సాంబారు, పప్పు ఉన్నాయి. అన్నం ఇంత దారుణంగా ఉందేమిటని ఆయన ప్రశ్నిస్తే నాణ్యత గల బియ్యమే వాడుతున్నామని సిబ్బంది చెప్పారు. అయితే అక్కడ నాసిరకం బియ్యం బస్తాలు ఉండడాన్ని తహసీల్దార్‌ గుర్తించారు. ఇక్కడ 180 మంది విద్యార్థులకు అరకొరగా వంటలు వండడం, విద్యార్థులకు కనీసం మజ్జిగ కూడా ఇవ్వకపోవడంపై సంస్థ నిర్వాహకులపై తహసీల్దార్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడి పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని తహసీల్దార్‌ చెప్పారు. ఆయనతో ఐసీడీఎస్‌ సిబ్బంది, వీఆర్‌వోలు ఉన్నారు.

కేజీబీవీ ఆకస్మిక తనిఖీ

మాకవరపాలెంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని తహసీల్దార్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల మెనూతో పాటు వంట గదిని పరిశీలించారు. పాడైపోయిన అరటి పండ్లు ఆ గదిలో ఉండడంతో ఎందుకు ఇక్కడ ఉంచారని పాఠశాల ప్రత్యేక అధికారి త్రివేణిని ప్రశ్నించారు. ముద్దగా ఉన్న బెల్లాన్ని పరిశీలించి విద్యార్థులకు దీనిని ఎలా పెడుతున్నారని మండిపడ్డారు. విద్యార్థినులకు సరైన భోజనం పెట్టకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్‌ఐ కృష్ణమూర్తి, వీఆర్‌వోలు రమణ, సూరిబాబు ఉన్నారు.

Updated Date - Aug 21 , 2024 | 12:09 AM