50,66,616
ABN , Publish Date - Jul 11 , 2024 | 01:24 AM
జిల్లా జనాభా పెరుగుతోంది. గడిచిన ఏడాదితో పోలిస్తే 2.32 శాతం మేర పెరుగుదల నమోదైనట్టు ఏయూలోని జనాభా అధ్యయన కేంద్రం అధికారులు అంచనా వేశారు. గురువారం అంతర్జాతీయ జనాభా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా జనాభాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఇదీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జనాభా సంఖ్య
గత ఏడాదిలో 54,658 మంది పెరుగుదల
విభజిత విశాఖ జిల్లా జనాభా 23,85,658
అనకాపల్లి జిల్లా...17,26,998
అల్లూరి సీతారామరాజు జిల్లా...9,53,960
విశాఖపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి):
జిల్లా జనాభా పెరుగుతోంది. గడిచిన ఏడాదితో పోలిస్తే 2.32 శాతం మేర పెరుగుదల నమోదైనట్టు ఏయూలోని జనాభా అధ్యయన కేంద్రం అధికారులు అంచనా వేశారు. గురువారం అంతర్జాతీయ జనాభా దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా జనాభాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జనాభా 42,90,589 కాగా, ప్రస్తుతం 50,66,616 (విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు కలిపి). అంటే, గడిచిన 14 ఏళ్లలో ఉమ్మడి జిల్లాలో జనాభా సుమారు ఎనిమిది లక్షల మేర పెరిగింది. విభజిత విశాఖ జిల్లా విషయానికి వస్తే గడిచిన ఏడాది 23,31,000 మంది జనాభా ఉండగా ఈ ఏడాదికి ఆ సంఖ్య 23,85,658కి చేరింది. అంటే ఏడాదిలో 54,658 మంది (2.32 శాతం గ్రోత్ రేటు) పెరిగారు. జనాభా రీత్యా రాష్ట్రంలో అతి పెద్ద నగరాల్లో విశాఖపట్నం ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం విభజిత విశాఖ జనాభా మొత్తాన్ని అర్బన్ పాపులేషన్‌గా అంచనా వేశారు. ఇక, అనకాపల్లి జిల్లాలో గడిచిన ఏడాది 17,21,472 మంది ఉండగా ప్రస్తుతం 17,26,998 మంది ఉన్నారు. ఏడాదిలో 5,526 మంది (0.32 శాతం గ్రోత్ రేట్) పెరిగారు. అలాగే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గడిచిన ఏడాది 9,50,812 మంది ఉండగా, ఈ ఏడాది 9,53,960 మంది ఉన్నారు. ఏడాదిలో 3,148 మంది (0.33 గ్రోత్ రేట్) పెరిగారు. మూడు జిల్లాలను కలిపి ఉమ్మడి జిల్లాగా చూస్తే గడిచిన ఏడాది 50,03,284 మంది జనాభా ఉండగా, ఈ ఏడాదిలో 50,66,616కు (63,332 మంది పెరిగారు) చేరారు. ఏయూలోని పాపులేషన్ రీసెర్చ్ సెంటర్‌లో రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్స్‌గా డాక్టర్ కె.శ్రీనివాసరావు, డాక్టర్ వై.రమణ, రీసెర్చ్ ఫెలోస్ డాక్టర్ సీహెచ్ పాదాలు, డాక్టర్ శ్రీనివాస్ పని చేశారు.
వేగంగా అర్బనైజేషన్
ప్రొఫెసర్ బి.మునిస్వామి, పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్
ఏటా జనాభా భారీగా పెరుగుతోంది. 2011 లెక్కలను ప్రామాణికంగా తీసుకుని ఏటా జనాభా పెరుగుదలను అంచనా వేస్తున్నాం. ముఖ్యంగా దేశంలో అర్బనైజేషన్ వేగంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పనపై ప్రభుత్వాలు దృష్టిసారించాలి. ప్రస్తుతం దేశంలో 36.3 శాతం అర్బన్ పాపులేషన్ ఉంది. రానున్న పదేళ్లలో భారీగా పెరగవచ్చు. రోడ్లు, ఇళ్లు, తాగునీరు, వైద్యం వంటి సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉంది. లేకపోతే అనేక రకాల ఇబ్బందులు తలెత్తవచ్చు.