Share News

జనసేనకు 4

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:42 AM

తెలుగుదేశంతో పొత్తు నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలపై దాదాపు స్పష్టత వచ్చింది.

జనసేనకు 4

అనకాపల్లి జిల్లాలో మూడు, విశాఖ జిల్లాలో ఒకటి..

జాబితాలో అనకాపల్లి, ఎలమంచిలి, విశాఖ సౌత్‌, పెందుర్తి లేదా మాడుగుల

ఒక స్థానానికి కొణతాల రామకృష్ణ పేరు ఇప్పటికే ప్రకటన

మిగిలిన మూడుచోట్ల పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయకుమార్‌, వంశీకృష్ణ శ్రీనివాస్‌లకు అవకాశం?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

తెలుగుదేశంతో పొత్తు నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో జనసేన పార్టీ పోటీ చేసే స్థానాలపై దాదాపు స్పష్టత వచ్చింది. ఇరు పార్టీల అధినేతల మధ్య తాజాగా జరిగిన చర్చల్లో జనసేనకు నాలుగు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి లేదా మాడుగుల, విశాఖ జిల్లాలో దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

రెండు జిల్లాల్లో 13 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిలో నాలుగుచోట్ల జనసేన అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఇప్పటికే కొణతాల రామకృష్ణను ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేనలోకి వచ్చిన కొణతాల లోక్‌సభకు పోటీ చేసే అవకాశం ఉందని పలువురు భావించారు. యితే ఊహించని విధంగా పవన్‌కళ్యాణ్‌ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం మొత్తం తిరిగి, సమావేశాలు నిర్వహించారు. అచ్యుతాపురంలో ఉండడానికి నివాసం కూడా తీసుకున్నారు. ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్‌కళ్యాణ్‌ విశాఖపట్నం పర్యటనకు రావడం, నేరుగా కొణతాల ఇంటికి వెళ్లి గంటన్నర సేపు మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడే ఆయనకు అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అదేవిధంగా ఎలమంచిలి నుంచి కూడా జనసేన పోటీ చేయనున్నది. అక్కడ సుందరపు విజయకుమార్‌ చాలాకాలంగా పార్టీకి పనిచేస్తున్నారు. ఆయనకే పోటీ చేసే అవకాశం లభించవచ్చునని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన సోదరుడు సతీశ్‌కుమార్‌ కూడా గత మూడు నెలలుగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయనకు ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌చార్జి పదవి ఇచ్చారు. గాజువాక నుంచి పోటీకి దించుతారని ప్రచారం జరిగింది. అయితే పొత్తుల్లో భాగంగా గాజువాక సీటును తెలుగుదేశం పార్టీయే ఉంచుకుంటామని స్పష్టం చేసింది. ఇప్పుడు సతీశ్‌కుమార్‌ పార్టీ కోసమే పనిచేస్తారని అంటున్నారు.

పెందుర్తి లేదా మాడుగుల

అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు విస్తరించి ఉన్న పెందుర్తి సీటును కూడా జనసేనకు ఇవ్వడానికి టీడీపీ అధినేత అంగీకరించినట్టు చెబుతున్నారు. అయితే అక్కడ టీడీపీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన కుమారుడు అప్పలనాయుడు, అల్లుడైన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రత్యేకంగా బుధవారం చంద్రబాబునాయుడును కలిశారు. జనసేనకు పెందుర్తికి బదులుగా మాడుగుల కేటాయించాలని సూచించారు. దీనిపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. పెందుర్తి ఒకవేళ జనసేనకు ఇచ్చినట్టయితే ఆ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబుకు పోటీ చేసే అవకాశం ఉంది. పంచకర్ల వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరినప్పుడు పెందుర్తి నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని అధినేతను కోరగా...ఆయన భరోసా ఇచ్చారని, ఆ మాట ప్రకారమే పొత్తుల్లో పెందుర్తి సీటును కోరారని పార్టీ నాయకులు చెబుతున్నారు.

‘దక్షిణం’లో ఆశావహులు అనేకం

విశాఖ జిల్లాకు వచ్చేసరికి ఏడు అసెంబ్లీ స్థానాలు (ఆరు పూర్తిగా, ఒకటి పాక్షికంగా) ఉండగా...మొదట మూడు (గాజువాక, భీమిలి, విశాఖ దక్షిణం) సీట్లు ఇవ్వాలని జనసేన ప్రతిపాదించింది. అయితే అందుకు టీడీపీ అధిష్ఠానం ఒప్పుకోలేదు. దక్షిణ నియోజకవర్గం సీటు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ సీటు కోసం జనసేనలో అనేక మంది పోటీ పడుతున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీగా ఉంటూ ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్‌కు అవకాశం లభించవచ్చునని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా దక్షిణంలో టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

Updated Date - Mar 08 , 2024 | 01:44 AM