22ఏ నుంచి 6,704.13 ఎకరాలు ఔట్
ABN , Publish Date - Aug 24 , 2024 | 01:22 AM
గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో విలువైన భూములను వైసీపీ నేతలు చేజిక్కించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో తాజాగా పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వ నిర్వాకమిది
ఎక్కువ భూములు పోర్టు, ఎయిర్‌పోర్టు, హౌస్‌కమిటీవే
జాబితా నుంచి జిల్లాలోని నాలుగు మండలాల్లో 1119.04 ఎకరాలు, రూరల్‌లో 194 ఎకరాలు మినహాయింపు
వైసీపీ కీలక నేతల ఆదేశాలతోనే అధికారుల చర్యలు
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):
గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో విలువైన భూములను వైసీపీ నేతలు చేజిక్కించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో తాజాగా పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిషేధిత జాబితా (22-ఎ) నుంచి మినహాయింపు పొందిన భూముల్లో ప్రైవేటు భూములు కూడా ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రధానంగా విశాఖ రూరల్, భీమిలి, ఆనందపురం మండలాల్లో మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, పొలిటికల్ సఫరర్స్‌కి ఇచ్చిన భూములకు ఎన్‌వోసీ తీసుకుని, వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించారని, దీని వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందనేది ప్రధాన ఆరోపణ.
జిల్లాలో 2019 ఏప్రిల్ ఒకటోతేదీ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీ వరకు అంటే ఐదేళ్లలో మొత్తం 6,704.13 ఎకరాలను 22-ఎ నుంచి తొలగించారు. ఈ మేరకు గత వారం జిల్లాలో పర్యటించిన రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం 2019 ఏప్రిల్ ఒకటోతేదీ నాటికి జిల్లాలోని 11 మండలాల్లో 2,06,315.01 ఎకరాలు 22-ఎలో ఉండగా వాటిలో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటోతేదీ వరకు 6,701.13 ఎకరాలు తొలగించారు. ఇంకా 22-ఎలో 1,99,610.09 ఎకరాలున్నాయి. అయితే ఈ ఐదేళ్లలో 22-ఎ నుంచి తొలగించిన వాటిలో ఎక్కువగా విశాఖ పోర్టు, ఎయిర్‌పోర్టు, హౌస్‌కమిటీ భూములేనని చెబుతున్నారు. ఎక్కువగా ములగాడ మండలంలో 4582.69 ఎకరాలకు గాను 2,900.79 ఎకరాలను 22-ఎ నుంచి తొలగించారు. గోపాలపట్నం పరిధిలో 7912.26 ఎకరాలకు 1,591.94 ఎకరాలు, గాజువాకలో 8,958.80 ఎకరాలకుగాను 845.56 ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తప్పించారు. ఈ మూడు మండలాల్లో పోర్టు, ఎయిర్‌పోర్టు, భూములు, పేదలకు పట్టాలు ఇచ్చిన భూములు, గాజువాకలో హౌస్‌కమిటీ 22-ఎ నుంచి తప్పించారని చెబుతున్నారు. మొత్తంగా 22-ఎ నుంచి తప్పించిన 6,701.13 ఎకరాల్లో రెగ్యులర్ ప్రాసెస్‌లో 5,724,31 ఎకరాలున్నాయి. వీటిలో మూడు మండలాల్లో పోర్టు, ఎయిర్‌పోర్టు, పేదలకు ఇచ్చిన పట్టాలు, హౌస్ కమిటీకి చెందిన భూములు 5,338.29 ఎకరాలున్నాయి. ఇంకా భీమిలిలో 67.63 ఎకరాలు, ఆనందపురంలో 46.32 ఎకరాలు, మహారాణిపేటలో 1.27 ఎకరాలు, పద్మనాభంలో 10.88 ఎకరాలు, పెదగంట్యాడలో 8.1 ఎకరాలు, పెందుర్తిలో 20.58 ఎకరాలు, సీతమ్మధారలో 36.38 ఎకరాలు, విశాఖ రూరల్‌లో 194.86 ఎకరాలను 22-ఎ నుంచి రెగ్యులర్ విధానంలో తొలగించారు. ఇంకా పేదల ఇళ్ల కోసం సేకరించిన భూములకు పరిహారంగా రైతులకు 369.9 ఎకరాల్లో ప్లాట్లు కేటాయించడంతో వాటిని 22-ఎ నుంచి తొలగించారు. 609.93 ఎకరాల డీపట్టా భూములకు ప్రీహోల్డ్ సర్టిఫికెట్లు జారీచేయడంతో వాటిని నిషేధిత జాబితా నుంచి తప్పించారు. వీటిలో ఎక్కువగా ఆనందపురంలో 407.77 ఎకరాలు, భీమిలిలో 52.513 ఎకరాలు, పద్మనాభంలో 129,6 ఎకరాలు, పెందుర్తిలో 20.04 ఎకరాలున్నాయి. నిషేధిత జాబితా నుంచి నాలుగు గ్రామీణ మండలాల్లో తొలగించిన భూములు 1119.04 ఎకరాలున్నాయి. విశాఖ రూరల్ మండలంలో 194.86 ఎకరాలు తొలగించారు. ఫ్రీహోల్డ్ భూములు, ల్యాండ్ పూలింగ్ భూములు మినహాయించి చూస్తే స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులు, పొలిటికల్ సఫరర్లుకు చెందిన భూములు, వివాదాస్పదంగా గతంలో గుర్తించిన భూములను 22-ఎ నుంచి తొలగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ భూముల్లో 516.9 ఎకరాలకు రిజిసే్ట్రషన్లు జరిగాయి. వాటిలో ఆనందపురంలో 203.29 ఎకరాలు , విశాఖ రూరల్ మండలంలో 108.02 ఎకరాలున్నాయి. రిజిస్ట్రేషన్ అయిన భూముల్లో ఎక్కువగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు, వారి బంధువులు, స్నేహితులు కొనుగోలుచేశారనే ఆరోపణలున్నాయి.