Share News

కాంగ్రెస్‌కు 1.93% ఓట్లు

ABN , Publish Date - Jun 07 , 2024 | 01:12 AM

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి గతంలో పోల్చితే ఓటింగ్‌ శాతం స్వల్పంగా పెరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు.

కాంగ్రెస్‌కు 1.93% ఓట్లు

ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ

44,699 ఓట్లు రాక

అరకులోయలో అత్యధికంగా 6.99 శాతం ఓట్లు

గత ఎన్నికల్లో 30,938 ఓట్లు...1.2 శాతం

విశాఖపట్నం, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి):

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి గతంలో పోల్చితే ఓటింగ్‌ శాతం స్వల్పంగా పెరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం నోటా కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 నియోజక వర్గాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు 30,938 ఓట్లు (1.2 శాతం) దక్కించుకున్నారు. తాజా ఎన్నికల్లో పొత్తులో భాగంగా రెండు స్థానాలను కమ్యూనిస్ట్‌ పార్టీలకు కేటాయించగా, 13 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసింది. ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు 44,699 ఓట్లు (1.93 శాతం) తెచ్చుకున్నారు.

అరకులోయలో పార్టీ తరపున పోటీ చేసిన శెట్టి గంగధరస్వామి 6.99 శాతం ఓట్లను సాధించారు. 12,503 ఓట్లు దక్కించుకున్న గంగాధరస్వామి నియోజక వర్గంలో ఐదో స్థానంలో నిలిచారు. మాడుగుల నియోజకవర్గంలో బొడ్డు శ్రీనివాస్‌కు 1,784 ఓట్లు (1.08 శాతం) మాత్రమే వచ్చాయి. ఆయన కంటే నోటాకు (4,070) ఎక్కువ ఓట్లు లభించాయి. నర్సీపట్నంలో రుత్తల శ్రీరామ్మూర్తికి 1,088 ఓట్లు (0.59 శాతం) రాగా, నోటాకు 3,824 ఓట్లు (2.09 శాతం) పడ్డాయి. చోడవరంలో జగత శ్రీనివాసరావుకు 2,527 ఓట్లు (1.36 శాతం), పాయకరావుపేట నియోజకవర్గంలో డాక్టర్‌ బోతి తాతారావుకు 2,087 ఓట్లు (1.01 శాతం), ఎలమంచిలి నియోజకవర్గంలో అనంత రామనరసింగరావు టంకాలకు 1,822 ఓట్లు (1.02 శాతం) వచ్చాయి. అలాగే అనకాపల్లిలో ఐఆర్‌ గంగాధర్‌కు 1,895 ఓట్లు (1.1 శాతం), పెందుర్తిలో పిరిడి భగత్‌కు 4,224 ఓట్లు (1.84 శాతం), విశాఖపట్నం తూర్పులో గుత్తుల శ్రీనివాసరావుకు 3,430 ఓట్లు (1.69 శాతం), ఉత్తర నియోజకవర్గంలో లక్కరాజు రామారావుకు 4,252 ఓట్లు (2.26 శాతం), దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి సంతోష్‌కుమార్‌కు 3,940 ఓట్లు (2.83 శాతం) వచ్చాయి. చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేట, పెందుర్తి, ఎలమంచిలి నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి. ఇక అనకాపల్లి పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వేగి వెంకటేష్‌కు 24,833 ఓట్లు (1.94 శాతం), విశాఖ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసిన పి.సత్యారెడ్డికి 30,267 ఓట్లు (2.18 శాతం) వచ్చాయి.

Updated Date - Jun 07 , 2024 | 01:12 AM