Share News

అమృత్‌ భారత్‌ స్టేషన్లకు రూ.1029.87 కోట్లు

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:50 AM

అమృత్‌ భారత్‌లో భాగంగా చేపట్టనున్న వివిధ స్టేషన్ల నవీకరణ పనులు వార్షిక సంవత్సరాంతానికి పూర్తి చేస్తామని వాల్తేరు డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సౌరభ్‌ప్రసాద్‌ పేర్కొన్నారు.

అమృత్‌ భారత్‌ స్టేషన్లకు రూ.1029.87 కోట్లు

రూ.19.98 కోట్ల వ్యయంతో సింహాచలం స్టేషన్‌ అభివృద్ధి

ప్రధాని చేతులమీదుగా పనులు ప్రారంభం రేపు

సంవత్సరాంతానికి పూర్తి చేస్తాం

వాల్తేరు రైల్వే డీఆర్‌ఎం సౌరభ్‌ప్రసాద్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 24:

అమృత్‌ భారత్‌లో భాగంగా చేపట్టనున్న వివిధ స్టేషన్ల నవీకరణ పనులు వార్షిక సంవత్సరాంతానికి పూర్తి చేస్తామని వాల్తేరు డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సౌరభ్‌ప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాల్తేరు డివిజన్‌ పరిధిలోని 12 రైల్వే స్టేషన్లలో కొత్త భవనాలు, ఆధునిక సౌకర్యాలు, పాదచారుల వంతెనలు, స్టేషన్లకు రెండో వైపు ప్రవేశ ద్వారాలు వంటి నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్రమోదీ సోమవారం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. నిర్ణీత సమయంలో నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ఇప్పటికే భవనాల రూపకల్పన (డిజైన్‌), ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అమృత్‌ భారత్‌ పథకం కింద వాల్తేరు డివిజన్‌కు మొత్తం రూ.1248 కోట్ల నిధులు మంజూరయ్యాయని, దీనిలో రూ.1029.87 కోట్లు స్టేషన్ల అభివృద్ధికి, రూ.218.13 కోట్లు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణాలకు వెచ్చించనున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల నుంచి నృసింహస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం సింహాచలం స్టేషన్‌ను రూ.19.98 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసి ఆధునిక సదుపాయాలు కల్పించనున్నామన్నారు. అలాగే రూ.16.31 కోట్లతో అరకులోయ, రూ.18.77 కోట్లతో కొత్తవలస, రూ.21 కోట్లతో చీపురుపల్లి, రూ.23 కోట్లతో శ్రీకాకుళం రోడ్డు, రూ.19 కోట్లతో నౌపడ జంక్షన్‌, రూ.12 కోట్లతో పర్లాకిమిడి, రూ.16 కోట్లతో బొబ్బిలి జంక్షన్‌, రూ.14.76 కోట్లతో పార్వతీపురం, రూ.17.94 కోట్లతో జైపూర్‌, 21.20 కోట్లతో కోరాపుట్‌ జంక్షన్‌ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నామన్నారు. కాగా విశాఖ స్టేషన్‌ అభివృద్ధి నిర్మాణ పనులకు రూ.492.64 కోట్లు కేటాయించగా, తర్వాత అత్యధికంగా రూ.243 కోట్ల వ్యయంతో రాయగడ స్టేషన్‌లో అభివృద్ధి నిర్మాణ పనులు చేపట్టనున్నామన్నారు. కాగా రూ.600 కోట్ల వ్యయంతో విశాఖ, దువ్వాడ, విజయనగరం, దామన్‌జోడి, జగదల్‌పూర్‌ స్టేషన్ల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల శంకుస్థాపన చేశారన్నారు. వీటి నిర్మాణ పనులు దాదాపు చివరి దశకు చేరాయని తెలిపారు. ఈ సమావేశంలో ఏడీఆర్‌ఎం సుధీర్‌కుమార్‌ గుప్తాతో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 01:50 AM