Share News

Varla Ramaiah: కుల ధృవీకరణ పత్రాలపై జగన్ బొమ్మ ముద్రించడంపై వర్ల ఫైర్

ABN , Publish Date - Jan 12 , 2024 | 10:36 AM

కుల ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ముద్రించడంపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు.

Varla Ramaiah: కుల ధృవీకరణ పత్రాలపై జగన్ బొమ్మ ముద్రించడంపై వర్ల ఫైర్

అమరావతి: కుల ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ముద్రించడంపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఇస్తున్న కుల ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బొమ్మ ముద్రిస్తున్నారన్నారు. ఇలా ముద్రించడమంటే.. ఎన్నికల సంఘం తలపెట్టిన నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు గండికొట్టడమేనన్నారు. కుల ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించి జగన్ రెడ్డికి రాజకీయ లబ్ది చేకూర్చాలని ప్రయత్నిస్తున్నారని వర్ల రామయ్య అన్నారు.

‘‘ప్రజాధనంతో రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూడటం ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదకరం. ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా వచ్చే ఈ తరుణంలో రెవెన్యూ అధికారుల ఇలాంటి చర్యలు తగవు. రెవెన్యూ అధికారులు కుల ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించడం అధికార పార్టీని బలపరచడమే. ఎన్నికల ప్రచారం కోసం అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడరాదని ఎన్నికల నియమావళి చాలా స్పష్టంగా చెబుతోంది. కావున, కుల దృవీకరణ పత్రాలపై, భూమి ప్రతాలైన పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించకుండా చర్యలు తీసుకోగలరు. రాబోవు ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపేందుకు తగు చర్యలు తీసుకోగలరు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోండి’’ అని వర్ల రామయ్య లేఖలో కోరారు.

Updated Date - Jan 12 , 2024 | 10:36 AM