AP News: పర్యాటకశాఖ ఫైల్స్ మాయం!
ABN , Publish Date - Jun 07 , 2024 | 02:17 AM
రాష్ట్ర పర్యాటకశాఖలో గుట్టుచప్పుడు కాకుండా ఫైల్స్ తరలించటం, వాటిని కాల్చివేయటం కలకలం సృష్టిస్తోంది.

విజయవాడ శివారు గుంటుపల్లిలో కాల్చివేత?
ఐదేళ్లలో అడ్డగోలుగా చేసిన అవినీతి ఫైల్స్
అన్నీ ఓట్లలెక్కింపు రోజు ఆఫీసు కారులో మంగళగిరికి తరలింపు
అక్కడి నుంచి కీలక ఫైల్స్ గుంటుపల్లికి తరలించి దహనం
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర పర్యాటకశాఖలో గుట్టుచప్పుడు కాకుండా ఫైల్స్ తరలించటం, వాటిని కాల్చివేయటం కలకలం సృష్టిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగిన రోజు(ఈనెల 4వ తేదీ) మధ్యాహ్నం మూడు గంటలకు మూడు భారీ బండిల్స్‌తో కూడిన పర్యాటక ఫైల్స్‌ను మంగళగిరిలోని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. వాటిలో ఒక బండిల్ ఫైల్స్ మాత్రమే తిరిగి అక్కడి నుంచి విజయవాడ ఆటోనగర్‌లోని పర్యాటకశాఖ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంది. మరో రెండు బండిల్స్ ఫైల్స్‌ను అత్యంత రహస్యంగా గొల్లపూడి సమీపంలోని గుంటుపల్లికి తరలించినట్టు తెలుస్తోంది.
హెడ్డాఫీసులో పనిచేసే ఓ ఉద్యోగిని ఇంటి దగ్గర ఈ ఫైల్స్‌ను కాల్చివేసినట్టు సమాచారం. ఫైల్స్ తరలింపునకు హెడ్డాఫీసులోని ఉద్యోగులు ససేమిరా అన్నట్టు తెలిసింది. చివరికి పర్యాటక ఎండీ కన్నబాబు రంగంలోకి దిగి.. ‘నేను సీఎంవోలోకి వెళ్లబోతున్నా. భయం లేదు. మిమ్మల్ని నేను చూసుకుంటా’ అని హామీ ఇచ్చి ఫైల్స్ తరలింపునకు ఒత్తిళ్లు తెచ్చినట్టు ఏపీటీడీసీ ఉద్యోగుల్లో విస్తృత చర్చ నడుస్తోంది. అధికారిక కారులో తరలించటం వల్ల ఎవరికీ అనుమానం ఉండదన్న ఉద్దేశంతో ముందుగా మంగళగిరికి తరలించినట్టు తెలుస్తోంది. అక్కడ మూడు బండిల్స్ విప్పదీసి.. నిబంధనలను కాలరాసి చేపట్టిన పనులకు సంబంధించిన అతి ముఖ్యమైన ఫైల్స్‌ను వేరు చేసినట్టు సమాచారం.
ప్రధానంగా విశాఖలో రుషికొండ తవ్వకాలు, నిర్మాణాలకు సంబంధించిన పలు కీలక ఫైల్స్‌ను మాయం చేసినట్టు, ఏపీటీడీసీలో ఈడీగా పనిచేస్తున్న మల్‌రెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించినట్టు చెబుతున్నారు. రుషికొండ తవ్వకాలు, నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ మల్‌రెడ్డి పర్యవేక్షణలోనే జరిగాయి. అలాగే, పర్యాటక యూనిట్లను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటీకరించేందుకు పిలిచిన టెండర్ల ఫైల్స్‌ను మాయం చేశారు. పర్యాటక యూనిట్ల నిర్వహణను అయినవారికి కారు చౌకగా అప్పగించేందుకు వాటిని తన ఖా పెట్టి మరీ రూ.150 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ రుణంతో పర్యాటక యూనిట్ల ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఆధునికీకరణ ముసుగులో ఇప్పటికే ప్రైవేటుకు ఇచ్చిన మైపాడు బీచ్ రిసార్ట్స్, నాగార్జున సాగర్ రిసార్ట్‌లలో కూడా పనులు చేయించారు. వీటికి సంబంధించిన కీలక ఫైల్స్ మాయం చేసినట్టు సమాచారం. మైపాడు బీచ్ రిసార్ట్స్‌లో రేకుల షెడ్డుల మరమ్మతులకు రూ.4 కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. అంత ఖర్చు పెడితే పక్కా భవనాలనే నిర్మించవచ్చు. ఆ డబ్బులన్నింటినీ పక్కదారి పట్టించినట్టు సమాచారం.
పర్యాటక యూనిట్ల ఆధునికీకరణ పేరుతో టెండర్లు పిలిచిన అనంతరం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే..విజయవాడ ఆటోనగర్‌లోని ఏపీటీఏ ఆఫీసులో రహస్యంగా కాంట్రాక్టర్లతో సమావేశాలు నిర్వహించి ముందస్తుగా కమీషన్లు వసూలు చేశారని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించిన ఫైల్స్‌ను కూడా మాయం చేశారని తెలుస్తోంది. తిరుపతిలో ఏపీటీడీసీ రవాణా విభాగాన్ని పక్కన పెట్టి .. కళాధర్ ట్రావెల్స్ సంస్థకు ఎలక్ర్టికల్ బస్సులను సరఫరా చేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. కళాధర్ ట్రావెల్స్ సంస్థకే టీటీడీ దర్శనం టికెట్లను విక్రయించుకునే అధికారాన్ని కల్పించిన వ్యవహారంలో భారీ స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించిన కీలక ఫైల్స్‌ను కూడా మాయం చేసినట్టు తెలిసింది. అలాగే, గత ఐదేళ్లలో అడ్డగోలుగా వైసీపీ పెద్దలు సిఫారసు చేసిన వారికి సంస్థలో ఉద్యోగాలు కల్పించారు. ఇందుకోసం నిబంధనలకు విరుద్ధంగా నౌకరీ వెబ్‌సైట్, ప్రైవేటు హోటల్స్ వెబ్‌సైట్‌లలో ప్రకటనలు వేసి అడ్డగోలుగా నియామకాలు జరిపారు. కరోనా సమయంలో మార్కెట్ కంటే అధిక రేటుకు ప్లేట్స్ తదితరాల కొనుగోలు, నాణ్యతలేని బియ్యం కొనుగోలు ఫైల్స్‌ను కూడా మాయం చేసినట్టు తెలుస్తోంది.