Share News

నారాయణ గెలుపు నల్లేరు మీద నడకే!

ABN , Publish Date - May 07 , 2024 | 05:13 AM

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు ఏకపక్షమేననని.. మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణకే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

నారాయణ గెలుపు నల్లేరు మీద నడకే!

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు ఏకపక్షమేననని.. మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణకే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆయన గెలుపు నల్లేరుపై బండినడక లాంటిదేనని అంచనా వేస్తున్నాయి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న మాజీ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ను కాదని ఆయన అనుచరుడైన ఖలీల్‌ అహ్మద్‌కు సీఎం జగన్‌ టికెట్‌ ఇచ్చారు. అయితే ఆయన ఎన్నికలకు కొత్త కావడం.. పార్టీలో వర్గ విభేదాలతో వైసీపీ శ్రేణులు ఎవరికివారుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నాయకత్వం కూడా చేతులెత్తేసిందని అంటున్నారు. నగరంలోని పరిస్థితిపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సైతం ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.

అనిల్‌కుమార్‌పై వ్యతిరేకత..

2014, 19 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి.. జగన్‌ కేబినెట్‌లో మూడేళ్లు మంత్రిగా పనిచేసిన పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ నగరాభివృద్ధికి ఏమీ చేయలేదు. గోతులు పడిన రోడ్లను కూడా బాగుచేయించలేకపోయారన్నది ప్రజల అభిప్రాయం.

తానేమీ చేయకపోగా, నారాయణ హయాంలో చేసిన అభివృద్ధి పనులను సైతం నిలిపివేయడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. నారాయణ హయాంలో నిర్మించిన 20వేల పైచిలుకు టిడ్కో ఇళ్లను ఐదేళ్లు గడిచినా ప్రజలకు ఇవ్వలేదు. 90శాతానికి పైగా పూర్తయిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, డ్రింకింగ్‌ వాటర్‌ స్కీమ్‌లను పూర్తి చేయలేదు. దీనికితోడు అనిల్‌ వ్యవహారశైలితో వైసీపీలో కుమ్ములాటలు అధికమయ్యాయి.

టీడీపీ కేడర్‌పైనే కాకుండా సొంత పార్టీ నేతలపైనా ఆయన కక్షసాధింపులకు పాల్పడ్డారు. ఫలితంగా ముఖ్య నాయకులందరూ పార్టీకి దూరమయ్యారు. అభివృద్ధి చేయకపోగా నగరంలో శాంతిభద్రతల సమస్య సృష్టించారన్న విమర్శలు ఉన్నాయి. దీనిని గుర్తించిన అధిష్ఠానం అనిల్‌ను తప్పించి.. ఆయన అనుచరుడైన డిప్యూటీ మేయర్‌ ఖలీల్‌ అహ్మద్‌కు టికెట్‌ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని వైసీపీ శ్రేణులు తీవ్రంగా నిరసిస్తున్నాయి. టీడీపీలోకి వలసబాట పట్టారు.

నారాయణ అభివృద్ధి నినాదం..

2014-19లో నెల్లూరులో నారాయణ రూ.5,600 కోట్లతో అభివృద్ధి చేశారు. తాజా ఎన్నికల్లోనూ అభివృద్ధినే ప్రధాన అజెండాగా తీసుకొని ప్రచారంలో దూసుకుపోతున్నారు.

- నెల్లూరు, ఆంధ్రజ్యోతి

నియోజకవర్గ స్వరూపం..

‘నెల్లూరు కార్పొరేషన్‌లోని 26 డివిజన్లు)

మొత్తం ఓటర్లు 2,38,465

పురుషులు 1,16,230

మహిళలు 1,22,168

ట్రాన్స్‌జెండర్లు 67

పొంగూరు నారాయణ బలాలు..

  • సౌమ్యుడు, వివాదరహితుడు, ఆర్థికంగా సంపన్నుడు.. మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో రూ.5600 కోట్లతో చేసిన అభివృద్ధి పనులు. అభివృద్ధి చేసినా ఓడిపోయారనే సానుభూతి..

  • జగన్‌ కక్ష సాధింపుతో రాజధాని అమరావతిలో పలు కేసులు.. పేపర్‌ లీకేజీ కేసులో హైదరాబాద్‌లో అరెస్టు చేసి నెల్లూరు తరలించడంపై ప్రజల్లో సానుభూతి.

  • టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వర్గం కలిసిరావడం.. ఎన్నికల నిర్వహణలో అందెవేసిన చేయి.

బలహీనతలు..

  • సొంత సిబ్బందిని నమ్మినట్లు టీడీపీ కేడర్‌ను నమ్మడం లేదనే ప్రచారం.

  • ఖలీల్‌ అహ్మద్‌ బలాలు...

  • వైసీపీ ఓటుబ్యాంకు.. మాజీ మంత్రి అనిల్‌కుమార్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈయనపై లేకపోవడం.

  • బలహీనతలు..

  • అనిల్‌కుమార్‌ మనిషిగా ముద్ర.. ఎన్నికల నిర్వహణ కొత్త కావడం. వైసీపీ కేడర్‌ పట్టించుకోకపోవడం..

Updated Date - May 07 , 2024 | 05:13 AM