AP News: ఈసీలో దొంగలు పడ్డారు!.. కీలక డేటా మొత్తం చోరీ!
ABN , Publish Date - Feb 06 , 2024 | 04:29 AM
జనంలోకి చొచ్చుకుపోవడం చేతకాక వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఓట్ల దొంగల వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతోంది.
రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో చొరబడ్డ ఐ-ప్యాక్
ఇప్పటికే కలకలం రేపుతున్న ‘ఓట్ల దొంగలు’
ఇప్పుడు ఏకంగా ఈసీలోకి ‘దొంగల’
చొరబాటు వ్యవహారం వెలుగులోకి..
సీఈవో కార్యాలయంలో ఉద్యోగులుగా చేరిన ఇద్దరు
ఆ ఇద్దరికీ ఐ-ప్యాక్‌తో సన్నిహిత సంబంధాలు
వారిలో ఒకరు ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్ హోదాలో ప్రవేశం
ఈసీ కార్యాలయంలోని కీలక విభాగాలపై కన్ను
నమ్మి లాగిన్లు వారిద్దరి చేతిలో పెట్టిన అధికారులు
అదే అదునుగా డేటా అంతా చాప చుట్టేశారు
రెండు నెలలు మాత్రమే అక్కడ విధులు
ఈ లోపే హార్డ్‌డి్‌స్కలు, మెయిల్స్ మొత్తం కాపీ
తీవ్ర ఆందోళనలో రాష్ట్ర ఈసీ అధికారులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జనంలోకి చొచ్చుకుపోవడం చేతకాక వైసీపీ అడ్డదారులు తొక్కుతోంది. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఓట్ల దొంగల వ్యవహారం ఇప్పటికే కలకలం రేపుతోంది. ఇప్పుడు ఏకంగా సీఈవో కార్యాలయంలోకే దొంగలు చొరబడడం తాజా సంచలనం. అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. వైసీపీ సొంత సంస్థగా భావించే ఐ-ప్యాక్ టీమ్‌తో సంబంధాలున్న ఇద్దరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో కీలక స్థానాల్లో ఉద్యోగాలు సంపాదించారు. వారి ద్వారా ఈసీలో ఉన్న డేటా మొత్తం వైసీపీ సేకరించినట్టు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబరులో మహబూబ్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి ఈసీలోకి ప్రవేశించారు. ఆ తర్వాత మరొకరు కూడా చేరారు. వీరిద్దరికీ ఐ-ప్యాక్ టీమ్‌తో అత్యంత దగ్గర సంబంధాలున్నాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తి ఈసీలో ఐటీ ప్రాజెక్టు మేనేజర్‌గా విధులు నిర్వహించారు. కానీ, డేటా సేకరణనే ఆ ఇద్దరూ పనిగా పెట్టుకున్నారు. తమకు సంబంధం లేని విభాగాల్లో కూర్చోవడం, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం వంటివి చేశారు. ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచే ఏ విభాగంలో ఏం జరుగుతుంది. ఈసీలో ఏఏ విభాగాలు కీలకం అన్న వివరాలన్నీ సేకరించారు. ఈసీలోని కీలక విభాగాల నుంచి డేటా మొత్తం సేకరించారు. మహబూబ్‌నగర్ వ్యక్తి ఈసీలో ఐటీ ప్రాజెక్టు మేనేజర్ కావడంతో డేటా మొత్తం సదరు ఉద్యోగి వద్దనే ఉండేది. ఉన్నతాధికారులు కూడా సదరు వ్యక్తిని పూర్తిగా నమ్మి ఈసీకి సంబంధించిన కీలక వ్యవహారాలు మొత్తం ఆయనకు అప్పగించేశారు. ఈఆర్వోల లాగిన్‌లు,. ఈఈఆర్వోల లాగిన్‌లతో పాటు ఈసీ డేటా మొత్తం తన చేతుల్లో ఆయన తీసుకున్నారు. డేటా మొత్తం చేతుల్లోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా అతడు ఉద్యోగం మానేశాడు. కేవలం నవంబరు, డిసెంబర్ నెలల్లో మాత్రమే ఈసీలో సదరు వ్యక్తి విధులు నిర్వహించారు. ఈ రెండు నెలల వ్యవధిలోనే ఈసీ సర్వర్‌లో ఉన్న డేటా, హార్ట్‌డిస్కుల్లో ఉన్న డేటా మొత్తం కాపీ చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహరం ఈసీలో చర్చనీయాంశంగా మారింది. రెండు నెలల వ్యవధిలోనే ఈసీలోని సమాచారాన్నంతా చాప చుట్టేశాడు. అయితే, ఆయన సేకరించిన డేటా ఎక్కడికి తీసుకువెళ్లారు..? ఎవరికి అప్పగించారన్నది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది.
డేటా మాయం..: రాష్ట్ర ఈసీ కార్యాలయంలో అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఒకవైపు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల వ్యవహరంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. వెంటనే దర్యాప్తు రిపోర్టులు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని గట్టిగానే ఆదేశించింది. సీఈసీ ఆదేశాల మేరకు తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి దొంగ ఓట్ల వ్యవహారంలో తిరుపతిలో ఏం జరిగింది..? తిరుపతి కలెక్టరేట్‌కు ఈసీకి జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు ఏమిటన్న దానిపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. కానీ సీఈసీ అడిగిన డేటా ఏదీ ఇప్పుడు రాష్ట్ర ఈసీలో కనిపించడం లేదు. ఈ డేటా మొత్తం అప్పటి ఉన్నతాధికారులు మాయం చేసినట్లు తెలుస్తోంది. దీనికి ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి సహకరించినట్లు తెలుస్తోంది. సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రభుత్వంలోని కీలకమైన ఉన్నతాధికారులతో టచ్‌లో ఉంటూ, తిరుపతి ఉప ఎన్నికల్లో చేయాల్సిన అరాచకాలు చేశారు. ఈ విషయాలు మొత్తం బయటకు వస్తాయన్న ఉద్దేశంతో ఈసీ ప్రధాన కార్యాలయంలోకి దూరి డేటా మొత్తం మాయం చేసినట్లు తెలుస్తోంది. 2021, 2022 ఏడాదికి సంబంధించిన డేటా ప్రస్తుతం కనిపించడం లేదు. కంప్యూటర్ హార్డ్‌డి్‌స్కలు, సీఈసీ నుంచి వచ్చిన మెయిల్స్ ఏవీ లేవు. దీంతో సీఈసీ అడిగిన సమాచారం ఏదీ ఈసీ ఇవ్వలేని పరిస్థితి. ఫలితంగా ఈసీ దొంగ ఓట్ల వ్యవహారంపై దర్యాప్తు టీమ్ నుంచి వచ్చిన రిపోర్టు మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఉప ఎన్నికల సమయంలో ఈసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సహయం తీసుకున్న వైసీపీ, ఇప్పుడు ఐ - ప్యాక్ టీమ్‌తో మరింత డేటా సేకరించింది. ఈ రెండు అంశాలు ఈసీకి తలనొప్పిగా మారాయి.