Share News

వలంటీర్ల వేదన

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:46 PM

రాష్ట్రంలో విద్యా వలంటీర్ల నియామకంపై స్పష్టత కరువైంది.

వలంటీర్ల వేదన

  • ఈసారైనా విధుల్లోకి తీసుకుంటారా ?

  • విద్యాశాఖ ఆదేశాల కోసం ఎదురుచూపులు

  • ఎల్లుండి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

  • జిల్లావ్యాప్తంగా 480 మంది వలంటీర్లు

  • కరోనా కాలంలో విధుల నుంచి తొలగింపు

  • మూడేళ్లుగా పట్టించుకోని విద్యాశాఖ

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యా వలంటీర్ల నియామకంపై స్పష్టత కరువైంది. ఎల్లుండి నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా.. ప్రభుత్వం వారిని విధుల్లోకి తీసుకోవడంపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. కొత్త ప్రభుత్వం తమ పట్ల సానకూలంగా స్పందిస్తునుకున్న వలంటీర్లు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న తరుణంలో తమను విధుల్లోకి తీసుకోవాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 691 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 2023-24 గణాంకాల ప్రకారం ఆయా స్కూళ్లలో 1,14,607 మంది విద్యార్థులున్నారు. వారికి 6,200 మంది ఉపాధ్యాయులు బోధన అందించారు. అయితే సర్కారు బడుల్లో టీచర్ల కొరత కారణంగా గత ప్రభుత్వం బీఈడీ పూర్తిచేసిన ఛాత్రోపాధ్యాయులను వలంటీర్లుగా విధుల్లోకి తీసుకుంది. కరోనా ముందు వరకు జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో 480 మంది విద్యా వలంటీర్లుగా పనిచేశారు. ఇందులో 45 శాతం మంది హైస్కూళ్లలో పాఠాలు బోధించగా, 55 శాతం మంది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేశారు. ప్రధానంగా సింగిల్‌ టీచర్‌, జీరో టీచర్‌ స్కూళ్లలో నిర్విరామంగా సేవలందించి నిరుపేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించారు. వారికి ప్రభుత్వం నెలవారీగా ఇచ్చే వేతనం రూ.12,500తో పాటు సాయంత్రం వేళల్లో ఇళ్ల వద్ద ట్యూషన్లు చెబుతూ కుటుంబాలను పోషించుకునేవారు.

కరోనాతో విధుల నుంచి తొలగింపు

కరోనా ముందు వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు సమానంగా విద్యా వలంటీర్లు విద్యార్థులకు బోధనలు అందించారు. అయితే 2020 మార్చిలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు అనివార్యంగా మూతపడ్డాయి. దీంతో అప్పటి ప్రభుత్వం వలంటీర్లను అర్ధంతరంగా విధుల నుంచి తొలగించింది. 2022 డిసెంబర్‌ వరకు కరోనా తీవ్రత తగ్గినప్పటికీ ఈ వ్యవస్థను పునరుద్ధరించకపోవడంతో చాలామంది నిరుద్యోగులు ఇతర వృత్తుల్లోకి వెళ్లారు. కొంతమంది ప్రైవేట్‌ స్కూళ్లలో అరకొర వేతనాలకు పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.

పెరిగిన ఖాళీలతో అరకొర బోధనే

కాగా, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరు. ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వారికి పాఠాలు చెప్పేందుకు తగినంతమంది టీచర్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా 1-5 వరకు నడిచే జీరో, సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ బోఽధించడంలో సతమతమవుతున్నారు.గతంలో వలంటీర్లు ఉండడంతో ప్రశాంతంగా పనిచేశామని, రెండేళ్లుగా పని ఒత్తిడితో సతమతమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, విద్యాశాఖ లెక్కల ప్రకారం స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో 419, ఎస్‌జీటీల్లో 128 ఖాళీలున్నాయి.

తప్పని ఎదురుచూపులు..

కరోనా పేరుతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొలగించిన విద్యా వలంటీర్లను తిరిగి తీసుకుంటామని కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే 11,602 పోస్టులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చామని, డీఎస్సీ ప్రక్రియ పూర్తయి, కొత్త ఉపాధ్యాయులు విధుల్లోకి చేరే వరకు అవసరమున్న చోట వలంటీర్లతో విద్యార్థులకు బోధనలు అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ప్రకటన చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఆందోళన నెలకొంది. ఎల్లుండి నుంచి 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న తరుణంలో కొంతమంది వలంటీర్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వచ్చి ఈ విషయమై అధికారులను సంప్రదిస్తున్నారు. ఈసారైనా తమను విధుల్లోకి తీసుకుని ఉపాధి కల్పిస్తారా..? లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే విద్యాశాఖకు ఆదేశాలు జారీచేసి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jun 10 , 2024 | 05:16 PM