Share News

అబద్ధాలు.. మోసాలు.. గులకరాయితో డ్రామాలు జగన్‌రెడ్డీ.. ఎన్నాళ్లీ నాటకాలు?

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:04 AM

సీఎం జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ మోసాలేనని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని.. మళ్లీ ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నాడని విమర్శించారు. ఇలాంటి దగాకోరు వ్యవహారాలను

అబద్ధాలు.. మోసాలు.. గులకరాయితో డ్రామాలు జగన్‌రెడ్డీ.. ఎన్నాళ్లీ నాటకాలు?

వీటిని జనం నమ్మే పరిస్థితి లేదు

ఎప్పుడు ఇంటికి పంపుదామా అని ఎదురుచూస్తున్నారు

సీఎం రోడ్‌షోలో కరెంటు పోవడమేంటి?

నేనొచ్చి తీసేశానా.. నా గవర్నమెంటు ఉందా?

రాయి తగిలాక బస్సులోకి వెళ్లకుండా

బస్సు మీదే డ్రామాలేంటి?

గత ఎన్నికల్లోనూ కోడికత్తి డ్రామా

దగాకోరు వ్యవహారాలను జనం నమ్మరు

ఉద్యోగులకు అన్ని బకాయిలూ ఇచ్చేస్తా

రాగానే 25 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ

నా తొలి సంతకం డీఎస్సీపైనే

అభివృద్ధికి మద్దతివ్వండి.. బాబు పిలుపు

జగన్‌రెడ్డి మోసగాడు.. ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు.. కనికట్టు చేసే వ్యక్తి.. చెత్తమాటలు.. చెత్త ప్రవర్తన.. బాబాయిని గొడ్డలితో చంపించి గుండెపోటు అనలేదా..? నాటకాలాడడంలో ఆరితేరిన వ్యక్తి. ఏపీని మరో పులివెందుల చేయడం మనకు అవసరమా? గొడ్డలి సంస్కృతి మనక్కావాలా?

గులకరాయి వ్యవహారం సింపతీ కోసం జగన్‌ ఆడుతున్న నాటకమని ప్రజలు గుర్తించారు. నీ కాన్వాయ్‌లో అంబులెన్స్‌ ఉండగా బస్సులో అందరూ చూస్తుండగా చికిత్స చేయించుకోవడమేంటి? చికిత్స అనంతరం హాస్పిటల్‌లో వైద్యసిబ్బందితో ఫొటో పోజులేంటి?

- చంద్రబాబు

విజయనగరం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ చెప్పేవన్నీ అబద్ధాలు.. చేసేవన్నీ మోసాలేనని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని.. మళ్లీ ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నాడని విమర్శించారు. ఇలాంటి దగాకోరు వ్యవహారాలను ప్రజలు నమ్మరని అన్నారు. ప్రజాగళంలో భాగంగా సోమవారం విజయనగరం జిల్లా రాజాం, శ్రీకాకుళం జిల్లా పలాసల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతాన్ని దోచుకునేందుకు జగన్‌రెడ్డి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చాడని.. ఉత్తరాంధ్రను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి దత్తత ఇచ్చారని ధ్వజమెత్తారు. విశాఖను చెరబట్టారని.. భూ కబ్జాలు, సెటిల్‌మెంట్లు చేసి 46 వేల కోట్లకు పైగా దోచుకున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో వారి పెత్తనం ఏమిటని నిలదీశారు. ‘విశాఖను ఆర్థిక రాజధాని చేయాలన్న సంకల్పంతో నేను ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టా. జగన్‌ వచ్చాక విశాఖను ఆర్థిక రాజధాని కాకుండా.. గంజాయి, డ్రగ్స్‌ రాజధానిగా తయారు చేశారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది జీవితాలు దుర్భరంగా మారాయి’ అని వాపోయారు. 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ పీఆర్‌సీ ఇవ్వలేదని.. తాను వస్తే వారి బకాయిలన్నీ ఇచ్చేస్తానని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

ఎన్నిసార్లు మోసం చేస్తావ్‌?

మొన్నటివరకు కోడికత్తి డ్రామా. బాబాయిని గొడ్డలితో లేపేయించి.. ఆ నేరం నాపై మోపాలని చూశారు. ఇప్పుడేమో గులకరాయి డ్రామా.. ఎన్నాళ్లిలా నాటకాలాడతావ్‌! ఎన్నిసార్లు ప్రజలను మోసం చేస్తావ్‌.. నీ డ్రామాలను, మోసాలను నమ్మే స్థితిలో వారు లేరు.. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. నిన్ను ఇంటికి పంపుదామా అని ఎదురుచూస్తున్నారు. నీ ప్రభుత్వంలో నీకే భద్రత లేదు. నువ్వు ముఖ్యమంత్రివి. కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకూ నీ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. నీ చుట్టూ భద్రతా వలయం ఉంది. అయినా నీపై గులకరాయి పడింది. సీఎం రోడ్‌షోలో కరెంటు పోవడం హాస్యాస్పదంగా ఉంది. నేనొచ్చి కరెంటు ఆపేశానా? నా గవర్నమెంటు ఉందా? ప్రభుత్వం నీదా.. నాదా..? గులకరాయి తగిలిన తర్వాత బస్సులోకి వెళ్లకుండా బస్సు మీదే డ్రామాలేంటి? నీ కాన్వాయ్‌లో అంబులెన్స్‌ ఉండగా బస్సులో అందరూ చూస్తుండగా చికిత్స చేయించుకోవడమేంటి? చికిత్స అనంతరం హాస్పిటల్‌లో వైద్యసిబ్బందితో ఫొటో పోజులేంటి? రాయి పడింది.. ఐదు నిమిషాల్లోనే బస్సు ముందు ప్లకార్డులు. ఈ డ్రామామాస్టారు డ్రామాలైపోయాయి. ఇదంతా సింపతీ కోసం నువ్వాడుతున్న నాటకమని ప్రజలు గుర్తించారు.

ఊడిగం చేస్తారా.. స్వేచ్ఛ కావాలా?

అధికారంలోకి వచ్చిన వెంటనే 25 వేల కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేస్తాం. వలంటీర్లకు జీతం రూ.10 వేలకు పెంచుతాం. వైసీపీకి ఊడిగం చేస్తారో.. మేం కల్పించే స్వేచ్ఛ కావాలో మీరే నిర్ణయించుకోండి. సామాజిక పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతా. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే.. మార్చి, ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించిన పెరిగిన మొత్తాన్ని జూన్‌లో అందిస్తా. విభిన్న ప్రతిభావంతులకు రూ.6 వేలు చేస్తాం. జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన ఇంటి పట్టాలకు సంబంధించి స్థలం ఉంటే వారికి ప్రభుత్వం నుంచి సాయం అందించి, ఇంటి నిర్మాణానికి సహకరిస్తాం. మా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు సెంట్ల స్థలాన్ని నిరుపేదలకు అందిస్తాం. ఇళ్లు కట్టుకునేందుకూ ఆర్థిక సాయం చేస్తాం. మెగా డీఎస్సీ నిర్వహిస్తాం. తొలి సంతకం దానిపైనే.

30 బీసీ పథకాలు రద్దు..

సామాజిక న్యాయం అంటూ జగన్‌ ఉదరగొడుతున్నాడు. సీఎం అయ్యాక బీసీలకు టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30 పథకాలకు పైగా రద్దు చేశాడు. ఉత్తరాంధ్రను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతాలతో సమానంగా ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో భోగాపురం ఎయిర్‌పోర్టును సంకల్పించాం. దీని నిర్మాణ బాధ్యతను కూడా రాజాంలో పుట్టి, పెరిగిన గ్రంధి మల్లికార్జునరావు(జీఎంఆర్‌)కే అప్పగించాం.అధికారంలోకి రాగానే జగన్‌ ఎయిర్‌పోర్టుపై రివర్స్‌లో ఆలోచన చేసి కాలయాపన చేశాడు. అప్పటి నుంచే పనులు కొనసాగించి ఉంటే ఇప్పటికే విమానాశ్రయం అందుబాటులోకి వచ్చేది. .

దొంగలు పడ్డారు.. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

రాష్ట్రంలో దొంగలు పడ్డారు.. సమష్టిగా కాపాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఓ పెద్ద సైకో.. అంతటా చిన్న సైకోలను తయారు చేశాడు. ఐదేళ్లు కష్టపడి నిర్మించిన రాష్ట్రాన్ని వైసీపీ సర్వనాశనం చేసింది.. జనసైనికులు, బీజేపీ కార్యకర్తలు, టీడీపీ సైన్యం దానిని తరిమేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్టీయే ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్‌నాయుడు, పలాస ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌతు శిరీష పోటీచేస్తున్నారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ దివంగత నేత ఎర్రన్నాయుడు లేని లోటు రామ్మోహన్‌ తీర్చుతున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్‌ గౌతు లచ్చన్న మనవరాలు శిరీష. పవన్‌ కల్యాణ్‌ సూపర్‌స్టార్‌. ఆయన్ను వైసీపీ తీవ్రంగా అవమానించింది. ఆ పార్టీని గద్దెదింపే వరకు పోరాటం ఆపననే పట్టుదలతో ఉన్నారు.

ఎంత దోచుకున్నాడో..

ఈ జె..గన్‌ రెడ్డి పథకాల పేరుతో ఎంత ఇచ్చాడు.. ఎంత కాజేశాడు? మద్యం, విద్యుత్‌, పెట్రోలు, డీజల్‌, పప్పు, నూనె, బియ్యం, ఇసుక, సిమెంటు, స్టీలు, రిజస్ట్రేషన్‌ చార్జీలు పెంపు, చెత్తమీద పన్ను, ఇంటి పన్నుల పేరుతో ఎంత దోచుకున్నాడో లెక్కవేయండి. ఒక్కో కుటుంబంపై సుమారు పదిలక్షల అప్పులు చేసి దోచుకున్నాడు. కొత్తగా భూ పరిరక్షణ చట్టం తెచ్చాడు. ఆ చట్టంతో మీ భూమికి రక్షణలేదు. అంతా జగన్‌రెడ్డి దగ్గరే ఉంటుంది.

Updated Date - Apr 16 , 2024 | 03:04 AM