మింగేసింది
ABN , Publish Date - Jun 02 , 2024 | 11:40 PM
సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్రతీరంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సారవకోట మండలం కూర్మనాథపురం పంచాయతీ మర్రిపాడు గ్రామానికి చెందిన జిన్ని ఉపేంద్ర(17) సముద్రంలో స్నానానికి దిగి.. ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు.
- భావనపాడు తీరంలో యువకుడి మృతి
- తల్లిదండ్రుల కళ్లెదుటే ఘటన
- మర్రిపాడులో విషాదఛాయలు
సంతబొమ్మాళి/ జలుమూరు, జూన్ 2: సంతబొమ్మాళి మండలం భావనపాడు సముద్రతీరంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. సారవకోట మండలం కూర్మనాథపురం పంచాయతీ మర్రిపాడు గ్రామానికి చెందిన జిన్ని ఉపేంద్ర(17) సముద్రంలో స్నానానికి దిగి.. ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. నౌపడ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మర్రిపాడుకు చెందిన 40మంది కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి ఆదివారం ఉదయం 11 గంటలకు భావనపాడు తీరానికి వచ్చారు. భోజనాలు అనంతరం వారంతా కలిసి సముద్రంలో స్నానం చేస్తుండగా.. అలల ఉధృతితో కెరటం వచ్చి ఉపేంద్రను సముద్రంలోకి లాక్కుపోయింది. దీంతో కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే భావనపాడు మెరైన్ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి గజ ఈతగాళ్లతో గాలించినా.. ఆచూకీ లభ్యం కాలేదు. సాయంత్రం మూడుగంటల సమయంలో రెడ్డికపేట తీరానికి ఉపేంద్ర మృతదేహం కొట్టుకువచ్చింది. దీంతో తల్లిదండ్రులు చలపతిరావు, అప్పలమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇదిలా ఉండగా.. ఆరు నెలల కిందట కుమార్తె మీనా విశాఖలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కుమారుడు ఉపేంద్ర పలాసలో ఐటీఐ చదువుతున్నాడు. తమ కళ్లెదుటే కుమారుడు కూడా సముద్రంలో కొట్టుకుపోయి మృతి చెందడంతో తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. గ్రామస్థుల్లో విషాదం అలుముకుంది. నౌపడ ఎస్‌ఐ కిషోర్‌వర్మ కేసు నమోదు చేసి.. మృతదేహోన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.