Share News

వైసీపీ ఓట్లకు కాంగ్రెస్‌ గండి!

ABN , Publish Date - May 17 , 2024 | 12:08 AM

అధికార పార్టీకి శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గం గెలుపుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈసారి త్రిముఖ పోటీలో... లాభపడేది టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కాగా.. నష్టపోయేది మాత్రం వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

వైసీపీ ఓట్లకు కాంగ్రెస్‌ గండి!

- శ్రీకాకుళం పార్లమెంట్‌, టెక్కలి అసెంబ్లీ స్థానంలో అధికం

- అధికారపార్టీ అభ్యర్థులకు సొంత సామాజికవర్గం నుంచే పోటీ

- త్రిముఖ పోరులో టీడీపీకే లాభదాయకమంటున్న నిపుణులు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

అధికార పార్టీకి శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గం గెలుపుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈసారి త్రిముఖ పోటీలో... లాభపడేది టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కాగా.. నష్టపోయేది మాత్రం వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్‌ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. వైసీపీ ఓట్లకు కాంగ్రెస్‌ గండి కొట్టిందని.. టీడీపీకి ఓటు బ్యాంకు మరింత పెరిగిందని స్పష్టం చేస్తున్నారు. ఇటు శ్రీకాకుళం పార్లమెంట్‌తో పాటు టెక్కలి అసెంబ్లీ స్థానాల్లో అధికారపార్టీ అభ్యర్థులపై సొంత సామాజికవర్గ నేతలే కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగడంతో ఓట్ల చీలిక జరిగిందని పేర్కొంటున్నారు.

- కింజరాపు ఎర్రన్నాయుడు మరణానంతరం రాజకీయరంగ ప్రవేశం చేసిన ఆయన కుమారుడు రామ్మోహన్‌నాయుడు తొలిసారిగా 2014లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి భారీమెజార్టీతో గెలుపొందారు. పలు సమస్యలపైనా పార్లమెంట్‌లో తన హవా చూపించి... సిక్కోలు సత్తా చాటారు. 2019లో జగన్‌ ఒక్కచాన్స్‌ హవాలోనూ.. ఎంపీగా రామ్మోహన్‌నాయుడు గెలిచారు. అప్పట్లో టీడీపీకి టెక్కలి, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే స్థానాలే దక్కగా.. రామ్మోహన్‌నాయుడు మాత్రం క్రాస్‌ ఓటింగ్‌తో మెజార్టీ పొందారు. ఈసారి హ్యాట్రిక్‌ సాధిస్తానన్న ధీమాతో రామ్మోహన్‌ ఉన్నారు. సోమవారం జరిగిన పోలింగ్‌ తీరు పరిశీలిస్తే.. అందుకు పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉన్నాయి.

- వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌.. గత ఎన్నికల్లో టెక్కలిలో అచ్చెన్నాయుడుపై ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేసి ఓడిపోయారు. అయినా జిల్లాలో బలమైన కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ సారి ఎంపీగా పోటీచేసేందుకు జగన్‌ అవకాశం కల్పించారు. కాగా.. ఇదే సామాజికవర్గానికి చెందిన కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి.. వైసీపీలో తనకు తగిన గుర్తింపు లేదంటూ.. ఈ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. వైసీపీకి గట్టి షాక్‌ ఇచ్చారు. టెక్కలి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు. వైసీపీలోని వైఎస్సార్‌ అభిమానులు.. చాలామంది కృపారాణికే ఓట్లు వేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈక్రమంలో అక్కడ వైసీపీలో ఓట్ల చీలిక జరిగినట్టే. ముందుగా వైసీపీ నుంచి కృపారాణికి ఎంపీ సీటు కేటాయిస్తే.. ఆమె పార్టీలోనే కొనసాగేది. టీడీపీ-వైసీపీ మధ్య టఫ్‌ ఫైట్‌ జరిగేది. అలాకాకుండా ఓటమిపాలైన తిలక్‌కు ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడంతో వార్‌ వన్‌సైడ్‌ జరిగిందని.. టీడీపీ ఎంపీ అభ్యర్థి వైపు ఓటర్లు మొగ్గు చూపారని తెలుస్తోంది.

- ఇక కాంగ్రెస్‌పార్టీ నుంచి పేడాడ పరమేశ్వరరావు ఎంపీ అభ్యర్థిగా పోటీచేశారు. ఈయన కూడా కళింగ సామాజిక వర్గమే. టెక్కలి నియోజకవర్గం నుంచే రావడంతో పరోక్షంగా.. ప్రత్యక్షంగాను ప్రభావితం చేయగలిగారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సొంత సామాజిక వర్గం నుంచి పరమేశ్వరరావుకు అండదండలు లభించాయి. గెలుపు సంగతి పక్కనపెడితే పరమేశ్వరరావు వెంట వైసీపీలో ఉన్నవారే కొంతమంది తిరిగారు. అటు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, ఇక్కడ కృపారాణిపై అభిమానం ఉన్నవారంతా కాంగ్రెస్‌కే ఓటేశారు. ఈ క్రమంలో వైసీపీ ఓట్లకు కాంగ్రెస్‌ గండికొట్టినట్టేనని.. పరోక్షంగా టీడీపీకి మరింత లాభదాయకంగా పరిస్థితి మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - May 17 , 2024 | 12:08 AM