Share News

హామీ ఇచ్చారు.. మరిచారు

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:20 AM

ఐదేళ్లకోసారి ఎన్నికల వేళ.. నేతలు మారుతున్నారు. కానీ, జిల్లావాసుల తలరాతలు మాత్రం మారడం లేదు. ప్రతిసారీ ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం పరిపాటిగా మారింది.

హామీ ఇచ్చారు.. మరిచారు
పలాసలో నిలిచిన రైల్వే వంతెన పనులు

- గత ఎన్నికల వాగ్ధానాలను నెరవేర్చని నేతలు

- ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే

- జిల్లావాసులకు తప్పని అవస్థలు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు.. ఎన్నెన్నో వాగ్దానాలు. ఓట్లు వేయించుకున్నారు. గెలిచారు.. అధికారం చేపట్టారు. ప్రజలను మాత్రం మర్చిపోయారు. హామీలు, వాగ్దానాలు గాలికొదిలేశారు. ఇవి ఒకటి, రెండు కాదు.. వందల సంఖ్యలో ఉన్నాయి. గద్దెనెక్కి ఐదేళ్లు పూర్తవుతున్నాయి. ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. రోడ్లూ వేయలేదు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పాలకులు మాట ఇచ్చి తప్పిన వైనంపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు..

............................

సిక్కోలు.. వ్యవసాయాధారిత జిల్లా. ప్రధానంగా వలసల జిల్లాగా పేరుగాంచింది. ఐదేళ్లకోసారి ఎన్నికల వేళ.. నేతలు మారుతున్నారు. కానీ, జిల్లావాసుల తలరాతలు మాత్రం మారడం లేదు. ప్రతిసారీ ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం పరిపాటిగా మారింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లా అభివృద్ధి మరింత వెనుకబడింది. అధికారపార్టీ ఎమ్మెల్యేలు భూదందాలు, ఇసుక.. మైనింగ్‌ దోపిడీ, సొంత వ్యాపారాలకే ప్రాధాన్యమిచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారంపై మాత్రం దృష్టి సారించలేదు. దీంతో జిల్లావాసులకు అవస్థలు తప్పడం లేదు. గత(2019) ఎన్నికల్లో నియోజకవర్గాల వారీ అభ్యర్థులు ఇచ్చిన హామీలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలు తీరును పరిశీలిద్దాం.

ఎచ్చెర్ల నియోజకవర్గం:

- ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌(వైసీపీ) ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. ఎచ్చెర్ల మండలం ఎస్‌.ఎం.పురం పెద్ద చెరువుకు మడ్డువలస మిగులు జలాలు ఇప్పిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకూ నెరవేర్చకపోవడంతో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.

- తోటపల్లి ప్రాజెక్టు ద్వారా రణస్థలం, లావేరు మండలాలకు పూర్తిస్థాయిలో సాగు నీరందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ పిల్ల కాలువల తవ్వకం పూర్తికాలేదు. ఈ ఐదేళ్లలో పనుల ఊసే లేదు.

- ఎచ్చెర్ల మండలం నారాయణపురం కుడికాలువ ఆధునికీకరణ పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ పూర్తికాలేదు. టీడీపీ హయాంలో జైకా నిధులు మంజూరు కాగా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నిలిచిపోయాయి.

శ్రీకాకుళం నియోజకవర్గం :

- శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు(వైసీపీ).. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వంశధార ప్రాజెక్టును పూర్తిచేసి శివారుప్రాంత రైతులకు సైతం సాగునీరు అందిస్తామని ధర్మాన హామీ ఇచ్చారు. నేటికీ సాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. కాలువలు అధ్వానంగా మారాయి. ఆధునికీకరణ మాటే మరిచారు. నిర్వహణకు రూపాయి కూడా విదల్చలేదు.

- శ్రీకాకుళంలో రింగు రోడ్డు నిర్మిస్తామని ప్రకటించారు. నేటికీ సర్వేకానీ, భూసేకరణ కానీ జరగలేదు. ప్రతిపాదనల దశలోనే అటకెక్కింది.

- అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని, ఇంద్రపుష్కరిణిని ఆధునికీకరిస్తామని ప్రకటించారు. మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి ఇటీవల శంకుస్థాపన చేశారు. కానీ పనులు ప్రారంభం కాలేదు.

- శ్రీకాకుళం నగర ప్రజలకు 24గంటలూ తాగునీరందిస్తాం. కంపోస్టు కాలనీలో కుళాయిలు వేయిస్తామని హామీ ఇచ్చారు. కానీ పైపులైన్లు ఎప్పటికప్పుడు పాడై.. నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు.

- భైరి ఓపెన్‌ హెడ్‌ ఛానల్‌ను పునరుద్ధరించి.. శివారు ఆయకట్టు వరకు సాగునీరందిస్తామని చెప్పారు. కానీ నేటికీ పనులు చేపట్టకపోవడంతో గార మండల రైతులకు సాగునీరందించే పరిస్థితి లేదు.

ఆమదాలవలస నియోజకవర్గం :

ఆమదాలవలస నియోజకవర్గానికి స్పీకర్‌ తమ్మినేని సీతారాం(వైసీపీ) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మునిసిపాలిటీలో పైపులైన్లు వేసి తాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. వంశధార నది నుంచి తాండ్రాసి మెట్ట వరకు ప్రధాన పైపులైన్లు ఏర్పాటు చేశారు. అక్కడ పొలాల మీదుగా పైపులైన్‌ వెళ్లకుండా రైతులు అడ్డుకోవడతో పనులు నిలిచిపోయాయి. సరుబుజ్జిలి కూడలిలో తాగునీటి పథకం ఏర్పాటుపై ప్రతిపాదనలు కూడా రూపొందించలేదు.

టెక్కలి నియోజకవర్గం :

- టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు(టీడీపీ) ఆఫ్‌షోర్‌ జలాశయం పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచినా.. టీడీపీ ప్రభుత్వం ఏర్పడకపోవడంతో నిధులు మంజూరుకాక.. పనులు పూర్తికాలేదు.

- హామీ మేరకు కోటబొమ్మాళికి డిగ్రీ కళాశాల మంజూరు చేయించుకున్నా.. ప్రభుత్వం అడ్డుపడి దానిని పలాసకు తరలించింది.

- సంతబొమ్మాళిలో ఇంటింటా కుళాయిలు వేస్తామని హామీ ఇవ్వగా.. ఇంకా 22 గ్రామాల్లో వాటిని ఏర్పాటు చేయాల్సి ఉంది.

- భావనపాడు పోర్టు నిర్మాణం చేపడతామని ప్రకటించారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం భావనపాడులో కాకుండా మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేసింది. పనులు ప్రారంభ దశలో ఉన్నాయి.

పాతపట్నం నియోజకవర్గం :

- పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి(వైసీపీ). కడగండి రిజర్వాయర్‌ నుంచి ఎల్‌.ఎన్‌.పేట మండలానికి కాలువలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు.

- ఎల్‌.ఎన్‌పేట కూడలి నుంచి కొమనాపల్లి, మోదుగువలస రోడ్డు నుంచి గొట్టిపల్లి, ఏబీ రోడ్డు నుంచి ముంగెన్నపాడు రోడ్డుల అభివృద్ధి హామీ కూడా నెరవేరలేదు. కనీసం మరమ్మతులు సైతం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

- హిరమండలం మండలం పరిధి జిల్లేడుపేట వద్ద మహేంద్రతనయ నదిపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కానీ పనులు ప్రారంభించలేదు.

- వంశధార ప్రాజెక్టు పనులు కొనసాగుతూనే ఉన్నాయి. నాగావళి, వంశధార అనుసంధానం జరగలేదు. వంశధార నదికి కొత్తూరు మండలంలో కరకట్టల నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు.

ఇచ్ఛాపురం నియోజకవర్గం :

- ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌(టీడీపీ).. ఎక్కువమంది జీవనోపాధి పొందేందుకు వీలుగా కొబ్బరి పార్కు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. కాగా.. వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పార్కు ఏర్పాటుపై కదలిక లేదు. బీలబట్టి ఆధునికీకరణ పనుల్లోనూ పురోగతి లేదు.

పలాస నియోజకవర్గం :

- పలాస నియోజకవర్గానికి పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పలాస రైలు నిలయం పక్కనున్న పైవంతెన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వాస్తవంగా 2008లో అప్పటి ఎమ్మెల్యే హనుమంతు అప్పయ్యదొర ఆధ్వర్యంలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2014లో గౌతు శివాజీ హయాంలో మరోసారి శంకుస్థాపన చేశారు. తాజాగా 2021లో మూడోసారి శంకుస్థాపన చేశారు. పనులు మధ్యలోనే నిలిపేశారు.

- ఉద్దానం రైతులు నేరుగా పంటలు విక్రయించేందుకు కాశీబుగ్గ రైతుబజారు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నెరవేరలేదు.

- పలాసలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు కళాశాల, పోస్టులు మంజూరు చేశారు. ప్రస్తుతం పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో డిగ్రీ కళాశాల నడుస్తోంది. సొంత భవనాలు కట్టలేదు.

- కళింగదళ్‌ గెడ్డపై దోని నిర్మాణానికి మూడుసార్లు అంచనాలు రూపొందించారు. కానీ పనుల ఊసే లేదు.

- నువ్వులరేవు-మంచినీళ్లపేట వద్ద జెట్టీ ఏర్పాటుకు నిధులు మంజూరైనా బిల్లులు చెల్లించక కాంట్రాక్టరు మధ్యలోనే పనులు నిలిపేశారు.

నరసన్నపేట నియోజకవర్గం :

- నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌(వైసీపీ-మాజీఉపముఖ్యమంత్రి) నియోజకవర్గంలో తాగునీరు, సాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. వంశధార కాలువల ఆధునికీకరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. తంపర భూముల అభివృద్ధి ఆగిపోయింది. జలుమూరు మండలం లింగాలపాడు ఎత్తిపోతల పథకం అభివృద్ధి చేయలేదు.

- నరసన్నపేట ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.15కోట్లు అవసరం కాగా.. రూ.4.5 కోట్లు మంజూరయ్యాయి. వీటితో భవనాల తొలగింపు పనులు మాత్రమే చేపట్టారు. 2022లో సీఎం జగన్‌ వచ్చి రూ.10కోట్లు ప్రకటించినా ఇంతవరకు రూపాయి కూడా విడుదల కాలేదు.

Updated Date - Apr 18 , 2024 | 12:20 AM