Share News

వైసీపీ కార్యకర్త వీరంగం

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:58 PM

మునిసిపాల్టీలోని 29వ వార్డు రాజమ్మకాలనీలో వైసీపీ కార్యకర్త వీరంగం సృష్టించాడు. తాగునీటి కోసం బోరు (చేతిపంపు) వద్దకు వెళ్లిన మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు.

వైసీపీ కార్యకర్త వీరంగం
పోలీసుస్టేషన్‌ ఎదుట నిరసన తెలుపుతున్న రాజమ్మకాలనీ మహిళలు

- నీటి కోసం వెళ్లిన మహిళలతో అసభ్యప్రవర్తన

- న్యాయం చేయాలని పోలీస్టేషన్‌ ఎదుట బైఠాయించిన బాధితులు

- దళితుడు, విలేకరిపై ఎస్‌ఐ దౌర్జన్యం

పలాస, మార్చి 6: మునిసిపాల్టీలోని 29వ వార్డు రాజమ్మకాలనీలో వైసీపీ కార్యకర్త వీరంగం సృష్టించాడు. తాగునీటి కోసం బోరు (చేతిపంపు) వద్దకు వెళ్లిన మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసు స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. వారికి సంఘీభావం తెలిపిన ఓ దళితుడిపై ఎస్‌ఐ దురుసుగా ప్రవర్తించారు. దీన్ని కెమెరాలో చిత్రీకరిస్తున్న ఓ ఎలకా్ట్రనిక్‌ మీడియా విలేకరి పైనా ఎస్‌ఐ దాడికి యత్నించారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత జరిగిన ఘటన పట్టణంలో తీవ్ర సంచలనం కలిగిం చింది. రాజమ్మకాలనీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఉదయం వేళలో నీరు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ కాలనీ మహిళలు రాత్రి వేళల్లో బోరు వద్ద కు వెళ్లి నీటిని పట్టుకుంటుంటారు. ఇదే విధం గా మంగళవారం రాత్రి 11గంటల సమయంలో మహిళ లు బోరు వద్దకు వెళ్లి నీటిని పట్టుకుంటుండగా అదే ప్రాంతంలో ఉన్న వైసీపీ కార్యకర్త వారితో దురుసుగా ప్రవర్తించాడు. ఇదేంటని మహిళలు ప్రశ్నించడంతో బూతు పురాణాన్ని అందుకున్నాడు. దీంతో అర్ధరాత్రి దాటిన తరువాత వారంతా కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మహిళలంతా పోలీస్టేషన్‌ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అక్కడే మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ వారిని ఇక్కడ నుంచి వెళ్లి పోవాలని ఆదేశించారు. మహిళలకు సంఘీభావంగా వచ్చిన దళితుడు రాజారావుపై ఎస్‌ఐ దురుసుగా వ్యవహరించడంతో పాటు భుజం పట్టి తోసేశారు. మహిళలు అక్కడే ఉన్నా పత్రికల్లో రాయని భాషలో దుర్భాషలాడారు. ఈ వ్యవహారాన్ని కెమెరాలో రికార్డు చేస్తున్న ఓ టీవీ చానల్‌ విలేకరి ఎన్‌.మోహన రావుపైకి ఎస్‌ఐ దూసుకు వచ్చారు. కెమెరాను లాక్కునే ప్రయత్నం చేయడంతో మహిళలు ఎస్‌ఐ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దీంతో మహిళలు శాంతించారు. అయితే విలేకరిపై ఎస్‌ఐ దౌర్జన్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజిలను ఎస్పీ కార్యాలయానికి విలేకరులు పంపించారు.

Updated Date - Mar 06 , 2024 | 11:58 PM