Share News

removal of VOA: వీఓఏ తొలగింపుపై రభస

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:51 PM

removal of VOA:మహిళా సంఘాల వీవోఏను తొలగించడంపై బాధితులు, సభ్యులు శనివారం శ్రీకాకుళంలోని వెలుగు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.

removal of VOA: వీఓఏ తొలగింపుపై రభస
ఏపీఎం రజనీని నిలదీస్తున్న వీవోఏ రాధాకుమారి తదితరులు

శ్రీకాకుళం రూరల్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల వీవోఏను తొలగించడంపై బాధితులు, సభ్యులు శనివారం శ్రీకాకుళంలోని వెలుగు కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తనను రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఏపీఎం రజని విధుల నుంచి తొలగించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వీఓఏ రాధా కుమారి విలేకరులకు తెలిపిన వివరాలివీ... చల్లవానిపేట గ్రామానికి చెందిన బొబ్బాది రాధా కుమారి ఏడాది కాలంగా స్వగ్రామంతో పాటు నైరలో వీఓఏ (విలేజ్‌ ఆర్గనైజేషన్‌ ఫెసిలిటేటర్‌)గా పని చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో కొత్తగా విధుల్లోకి చేరిన కె.రజనిని కలిసేందుకు కార్యాలయానికి వెళ్లగా... తన దగ్గర ఉన్న రికార్డులను ఏపీఎం తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు.ఇదిలా ఉండగా... నవంబరు నెలలో కొర్ను సంధ్య అనే మహిళ ను రాధ స్థానంలో వీఓఏగా నియమించి రికార్డులు అప్పగించారు. ఆమె రూరల్‌ మండలంలోని వెంకటా పురం, నైర గ్రామంలో విధులకు హాజరైందని చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే... గ్రామంలోని సంఘ సభ్యుల తీర్మానం ప్రకారమే కొత్త వారిని నియమించారని రజని చెప్పార న్నారు. దీంతో ఈ నెల 19న సమావేశం నిర్వహించగా 22 సంఘాల సభ్యులు ముక్తకంఠంతో తనను విధుల నుంచి తొలగించకూడదని చెప్పారని అన్నారు. సభ్యుల తీర్మానాన్ని పక్కన పెట్టి... రాజకీయ ఒత్తిళ్లతో తనను తొలగించారని రాధా కుమారి ఆరోపించారు.

కొత్తగా నియమించినట్టు తెలియదు..

వీవోఏ తొలగింపు విషయమై ఏపీఎం కె.రజనిని వివరణ కోరగా... రికార్డులు తీసుకున్న మాట వాస్తవమేనని చెప్పారు. కొత్త వీవోఏ సంధ్యను నియమించినట్టు తనకు తెలియదని అన్నారు. తన చుట్టూ రాజకీయ పన్నాగం పన్నుతున్నారని ఏపీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామంటూ బాధితురాలితో పాటు సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - Dec 28 , 2024 | 11:51 PM