ప్రారంభించాక పనులా..?
ABN , Publish Date - Jul 15 , 2024 | 11:59 PM
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో సరుబుజ్జిలిలో నిర్మిస్తున్న గోదాములు నాలుగు నెలల కిందట ప్రారంభించగా.. నేటికీ పనులు చేపడుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించేసి.. నాణ్యతకు తిలోదకాలిస్తూ ఇప్పుడు పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- నాలుగు నెలల తర్వాత మొదలెట్టిన వైనం
- ఎన్నికలకు ముందు అధికారుల హడావుడి
- తమ్మినేని సీతారాంచే కానిచ్చేసిన వైనం
- ఇదీ గిడ్డంగుల సంస్థ నిర్వాకం
(సరుబుజ్జిలి)
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో సరుబుజ్జిలిలో నిర్మిస్తున్న గోదాములు నాలుగు నెలల కిందట ప్రారంభించగా.. నేటికీ పనులు చేపడుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభించేసి.. నాణ్యతకు తిలోదకాలిస్తూ ఇప్పుడు పనులు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం సరుబుజ్జిలిలో ఉన్న ఆమదాలవలస వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన స్థలంలో గిడ్డంగుల సంస్థకు చెందిన గోదాములు నిర్మించడానికి రూ.8.72 కోట్లు మంజూరు చేసింది. నెల్లూరుకు చెందిన నిర్మాణసంస్థకు బాధ్యతలు అప్పగించగా పనులు ప్రారంభించారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా.. వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలిచిన గిడ్డంగి అధికారులు.. పనులు పూర్తికాకుండానే ఈ ఏడాది మార్చి 14న అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాంతో గోదామును ప్రారంభించేశారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న ఈ నిర్మాణాలపై సరైన పర్యవేక్షణ లేక కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. పదివేల మెట్రిక్ టన్నులు సామర్థ్యం ఉన్న ఈ రెండు గోదాముల నిర్మాణంలో నాణ్యత లోపించిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే సుమారు 40 టన్నులు బరువుతో లారీలు తిరగాల్సిన ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన రహదారులు కూడా అధ్వానంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెటల్ గ్రావెల్‌తో నిర్మించాల్సిన ఈ రహదారులపై బురద కంకర వేస్తూ రోలింగ్ చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల మోస్తరు వర్షం కురవగా.. సాధారణ ట్రాక్టర్లు రాకపోకలు సాగించే సమయంలో ఈ రహదారి కుంగిపోయి చిత్తడిగా మారిందని పేర్కొంటున్నారు. నాణ్యతలేని ఈ రహదారిపై భవిష్యత్‌లో ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని చర్చించుకుంటున్నారు. ఈ విషయమై విజయవాడకు చెందిన డీఈ శ్యామ్ వద్ద ప్రస్తావించగా.. నిబంధనల మేరకు నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఎటువంటి లోపాలు ఉన్నా రెండేళ్ల వరకూ నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్‌దేనని తెలిపారు.