Share News

రాజీనామా చేస్తారా? లేదా?

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:28 AM

సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ.. వలంటీర్లను ప్రధానాస్ర్తాలుగా వాడుకుంటోంది. ఎన్నికల కమిషన్‌ వద్దని హెచ్చరిస్తున్నా.. ప్రచారంలో పాల్గొనాలంటూ వైసీపీ నేతలు వారిపై ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలే అడ్డంకి అయితే మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని ఆదేశిస్తున్నారు.

రాజీనామా చేస్తారా? లేదా?
స్పీకర్‌ ప్రచారంలో పాల్గొన్న వలంటీర్‌

- వలంటీర్లపై వైసీపీ నేతల తీవ్ర ఒత్తిడి

- ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటూ ఆదేశాలు

- భవిష్యత్‌ పరిస్థితులపై వలంటీర్ల ఆందోళన

(శ్రీకాకుళం అర్బన్‌)

సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ.. వలంటీర్లను ప్రధానాస్ర్తాలుగా వాడుకుంటోంది. ఎన్నికల కమిషన్‌ వద్దని హెచ్చరిస్తున్నా.. ప్రచారంలో పాల్గొనాలంటూ వైసీపీ నేతలు వారిపై ఒత్తిడి చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలే అడ్డంకి అయితే మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని ఆదేశిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మీ భవిష్యత్‌కు మాది గ్యారంటీ అంటూ భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో మూకుమ్మడిగా వలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. కాగా.. ఒకవేళ వైసీపీ గెలవకపోతే భవిష్యత్‌లో తమ పరిస్థితి ఏంటని వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు.

- వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లను నియమించింది. ఒక్కొక్కరికీ 50 ఇళ్లను కేటాయిస్తూ.. ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాలను అందించే బాధ్యత అప్పగించింది. ఇప్పుడు ఆయా ఓట్లన్నీ వైసీపీకి పడేలా ప్రజల్లో సంక్షేమ పథకాల లబ్ధిపై అవగాహన కల్పించాలని అధిష్ఠానం ఇప్పటికే సూచించింది. అవసరమైతే రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటూ వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో సుమారు 1,600 మంది వలంటీర్లు ఉన్నారు. వారందరి చేత రాజీనామాలు చేయించేందుకు పూనుకున్నారు. ఈ మేరకు వలంటీర్ల విధి నిర్వహణ బాధ్యతలు చూసే ఎఫ్‌ఓఏ(ఎమ్‌ఎల్‌ఓ) లోకేష్‌ వలంటీర్లకు రాజీనామా చెయ్యాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కోడ్‌ నిబంధనల మేరకు మార్చి నెలాఖరున వలంటీర్లందరూ తమ సెల్‌ ఫోన్లు, సిమ్‌లు, తంబ్‌ మిషన్‌లను సచివాలయాలకు అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వలంటీర్ల పర్సనల్‌ నెంబర్లలో వారిని సంప్రదిస్తున్నారు. ఉగాదిలోగా మూకుమ్మడిగా రాజీనామా చేయాలని సూచిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు గెలుపుకోసం కార్యకర్తల్లా పనిచేయాలని ప్రతి డివిజన్‌లోని పార్టీ ఇన్‌చార్జిలు, నేతలు వలంటీర్లకు ఆదేశించారు. రూరల్‌ మండలంలో 400 మంది, నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 670 మంది వలంటీర్లు ఉన్నారు. శుక్రవారం ఉదయం రాజీనామా పత్రాలను సమర్పించాలని వారందరికీ తెలిపారు. బుధవారం మండలవీధిలో వైసీపీ నాయకుడి ఇంటి వద్దే వలంటీర్లతో రాజీనామా పత్రాలు రాయించారు. అయితే గురువారం రాత్రి వరకు నగరపాలక సంస్థ కార్యాలయానికి ఒక్క రాజీనామా పత్రం కూడా అందలేదని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం 50 డివిజన్లలోని వలంటీర్ల అంతా నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి రాజీనామాలు అందజేసేలా వైసీపీ నాయకులు చర్యలు చేపడుతున్నారు.

ఆందోళనలో వలంటీర్లు

రాజీనామా చేస్తే తమ పరిస్థితి ఏంటంటూ వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. ఐదేళ్లపాటు సేవలందించిన వారిపై రాజీనామాల ఒత్తిడి చేయడంతో ఏమి చేయాలో తెలియక సతమతమవుతున్నారు. రాజీనామా చేస్తే.. ఎన్నికల తర్వాత మళ్లీ తమను విధుల్లోకి తీసుకుంటారో లేదోనని తర్జనభర్జన పడుతున్నారు. ఇదెక్కడి వేధింపులు అంటూ తలలు పట్టుకుంటున్నారు.

రాజకీయాలకు తలొగ్గి..

పాతపట్నం: పాతపట్నం మండలంలో 64మంది వలంటీర్‌లు మూకు మ్మడిగా గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. స్థానిక ఎంపీ డీవో కార్యాలయంలో ఎంపీడీవో కె.రామకృష్ణరాజుకు రాజీనామా పత్రాలను అందజేశారు. కొంతమందికి ఇష్టం లేకున్నా వైసీపీ నేతల ఒత్తిడితో రాజీ నామా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తే భారీ తాయిలాలు ఉంటాయంటూ కొంతమంది నేతలు ప్రలోభ పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కోటబొమ్మాళి మేజర్‌ పంచాయతీలో 36 మంది వలంటీర్లు, జలుమూరు పంచాయతీలో 15 మంది వలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.

వలంటీర్ల ఎన్నికల ప్రచారం

ఆమదాలవలస: ఆమదాలవలస నియోజకర్గంలోని వలంటీర్లు అంతా ఎంపీడీవో కార్యాలయాలకు వచ్చి రాజీనామాలు చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎలాగూ రాజీనామా చేస్తామనే ఉద్దేశంతో.. కొంతమంది వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. గురువారం స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆమదాలవలస మండలం నారిపేట, ఇసుకలపేట, దిబ్బలపేట గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో కొంతమంది వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 12:28 AM