Share News

ఎన్నికలప్పుడే గుర్తొస్తామా?

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:50 PM

మందస మండలం దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మండలాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.

ఎన్నికలప్పుడే గుర్తొస్తామా?
మరమ్మతులకు నోచుకోని డబార్సింగ్‌ రిజర్వాయర్‌

-ప్రశ్నిస్తున్న మందస వాసులు

-అభివృద్ధిని పట్టించుకోని సర్కారు

-ఐదేళ్లుగా పాలకుల నిర్లక్ష్యం

-అధ్వానంగా గిరిజన రోడ్లు

-కానరాని ప్రభుత్వ ఆస్పత్రి, డిగ్రీ కళాశాల

-శిథిలావస్థలో రిజర్వాయర్లు, కాలువలు

(హరిపురం)

మందస మండలం దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మండలాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్లుగా అధికార పార్టీ పాలకులు పట్టించుకోకపోవడంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దశాబ్దాల కిందట నిర్మించిన రిజర్వాయర్ల నిర్వహణను గాలికొదిలేవారు. సాగునీటి కాలువల్లో పూడిక, పిచ్చిమొక్కలు పెరిగి శివారు ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. వైసీపీ పాలకులకు తాము ఎన్నికలప్పుడే గుర్తొస్తామని ఇక్కడి ప్రజలు విమర్శిస్తున్నారు.

మందస మండలానికి జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏజెన్సీ, మైదాన, తీర ప్రాంతాల కలయికతో అన్నిరకాల సామాజికవర్గ ప్రజలతో మమేకమై ఉంటుంది. ఉద్యమాలకు ఊపిరిగా ఈ మండలం నిలిచింది. ఎంతోమంది త్యాగధనుల జన్మభూమిగా పేరుగాంచింది. అయితే దశాబ్దాలుగా పాలకులు మారుతున్నా సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడంలేదు.

ఇవీ సమస్యలు..

- మండలంలో కేవలం 45 గ్రామాలకు మాత్రమే ఉద్దానం నీటి పథకం ద్వారా తాగునీరందుతోంది. ఇది కూడా నాలుగేళ్లుగా నెలకు పదిరోజులకు మించి రావడంలేదు. ఏటా వేసవిలో తాగునీటి సమస్య మరింత జఠిలంగా మారుతోంది.

-తీర ప్రాంతంలో ఏళ్ల తరబడి సాగు చేసిన సరుగుడు వనాలు అక్రమార్కుల పాలవుతున్నాయి. దీంతో తీరం కోతకు గురవుతోంది.

-ఉద్దాన, తీరప్రాంత ప్రజల సాగు, తాగు నీటి ప్రధాన వనరుగా ఉన్నజంతిబంద రిజర్వాయర్‌ ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. దీంతో ఏటా వర్షాకాలంలో వస్తున్న నీరు నిల్వచేయడానికి అవకాశం లేకపోవడంతో సముద్రం పాలవుతోంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌ శివారులో సాగునీటికి అగచాట్లు తప్పడంలేదు.

- దశాబ్దాల కాలం కిందట టీడీపీ హయంలో నిర్మించిన డబార్సింగి, కళింగదళ్‌ రిజర్వాయర్లు మరమ్మతులకు నోచుకోవడంలేదు. దీంతో కాలువలు శిథిలావస్థకు చేరడంతో శివారు ఆయకట్టుకు నీరందడం లేదు.

-బెల్లుపటియావద్ద కూలిపోయిన ఇనుపదోనెను ఏళ్లుగా పట్టించుకొనే నాథుడేలేడు. టీడీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరు కాగా పనులు కొంత మేర జరిగాయి. ఇంతలో ప్రభుత్వం మారడంతో సమస్య మొదటి కొచ్చింది.

-హరిపురం, మందసలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి నాయకులు ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉన్నత చదువులకోసం పలాస, సోంపేటలోని కళాశాలలను ఆశ్రయించాల్సివస్తోంది. కొంతమంది తల్లిదండ్రులు బాలికలను ఇంటర్‌తో నిలిపివేయిస్తున్నారు.

- మండలంలో తీరప్రాంత గ్రామాల్లో కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించాలని మత్య్సకారులు దశా బ్దాలుగా కోరుతున్నారు. కష్టబడి సముద్రంలో వేట చేసిన చేపలను తక్కువ ధరకు విక్రయించాల్సివస్తోందని మత్స్యకారులు వాపోతున్నారు.

-హరిపురం, మందసలో రైతు బజార్లు ఏర్పాటు కలగా మారింది. ఇక్కడ లేకపో వడంతో కూరగాయల రైతులు దోపిడీకి గురవుతున్నారు. తక్కువ ధరకే దళారులకు విక్రయించాల్సివస్తోంది.

- హరిపురం, మందసలో రోడ్లు విస్తరణ పనులు నిలిచిపోయాయి. ఈ రెండు పంచా యతీల్లో పూర్తిస్థాయి డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి చేరుతుంది.

-ఉద్దానంప్రాంతంలో సుమారు 65గ్రామాలకు అందుబాటులో ప్రాథ మికఆరోగ్య కేంద్రం లేదు. దీంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు సైతం ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్ర యిస్తున్నారు.

- సంకుజోడి రిజర్వాయర్‌ను ఏర్పాటు చేస్తే మందస, సోంపేట మండలాల పరిధి 22 గ్రామాల్లో ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందుతుందని ఇక్కడి రైతులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువస్తున్నా ఫలితం లేకుండాపోతుంది.

-దామోదరసాగర్‌ రిజర్వాయర్‌ పరిధిలో కాలువల నిర్మాణం పూర్తిగా చేపట్టలేదు. దీంతో ఏటా ఖరీఫ్‌లో సైతం శివారు భూములకు నీరందని పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.

- మండలంలో 35 గిరిజన గ్రామాల్లోని అంతర్గత రహదారులు పూర్తిగా అధ్వానంగా మారాయి. ఏటా వర్షాకాలంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. ఇక్కడ రహదారుల దుస్థితిని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని గిరిజనులు చెబుతున్నారు.

- ఫ్లోరైడ్‌ పీడిత కొండలోగాంలో రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేసి పంచాయతీలోని 14 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని స్థానికులు దశాబ్దాలుగా కోరుతున్నారు. పరిశుభ్రమైన తాగు నీరు లభించక ఏటా వందల మంది వ్యాధులబారిన పడుతున్నారు.

- మందస మండలంలో ఎక్కువ భాగం అటవీప్రాంతం విధ్వంసం కావడం, గొడ్డలిపేటుకు గురివడం తదితర కారణాల వల్ల వణ్య ప్రాణు లు గ్రామాలకు చేరుతున్నాయి. దీంతో వాటి దాడుల నుంచి రక్షించాలని ప్రభుత్వాన్ని గిరిజనులు వేడుకుంటున్నారు.

ఎన్నికల సమయంలోనే గుర్తొస్తాయి

నాయకులకు ప్రజలు పడుతున్న బాధలు ఎన్నికల సమయంలోనే గుర్తొస్తాయి. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే దిశగా నాయకులు ఆలోచించాలి. ప్రధానంగా మండలంలో సాగునీటి వనరుల అభివృద్ధికోసం నిధులు మంజూరుచేసి ఆదుకోవాలి. వచ్చిన నిధులు వాటాలు వేసుకుని పంచుకోకుండా అవి సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలి.

- గొలుసు మురళి, ఉయ్‌ఫర్‌ఆల్‌ స్వచ్ఛంద సంస్థ, హరిపురం

ఉపాధి చూపించి ఆదుకోవాలి

మందస మండలం విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉంది. ప్రభుత్వం విద్యాసంస్థలు ఏర్పాటుచేసి ఏజెన్సీ, ఉద్దానం ప్రాంతంలోని యువత ముందడుగు వేసేలా చర్యలు తీసుకోవాలి. తీరప్రాంతంలోని యువత వలస బాట పట్టకుండా ఉపాధి చూపించి ఆదుకోవాలి.

- ఎం.కుమారస్వామి, కంప్యూటర్‌ అధ్యాపకుడు. హరిపురం

Updated Date - Apr 19 , 2024 | 11:50 PM