నిధులు విదిల్చేనా?
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:04 PM
వైసీపీ ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బుధవారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించబోతోంది.
- నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్
- అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వైసీపీ ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
వైసీపీ ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బుధవారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సమర్పించబోతోంది. అయితే ఇందులో జిల్లాకు ఏ మేరకు నిధులు కేటాయిస్తారన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. ఎన్నికల సమయం కావడంతో ఈ బడ్జెట్‌లో కొత్త జిల్లాకు ఏ మేరకు ప్రాధాన్యం కల్పిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవంగా నాలుగున్నరేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం జిల్లాలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేపట్టింది లేదు. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దగా నిధులు కేటాయించలేదు. బిల్లులు సకాలంలో చెల్లించడం లేదు. దీంతో ఆయా పనులు నేటికీ నత్తనడకనే సాగుతున్నాయి. అయితే కొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం జిల్లాకు ఏ స్థాయిలో నిధులు కేటాయిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాగా ‘సిక్కోలు’లో సాగునీటి ప్రాజెక్టులకు ఎంతెంత నిధులు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం.
తోటపల్లి ప్రాజెక్టు..
నాగావళి నదిపై ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 1,31,221 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. దీనికోసం పిల్ల కాలువలు, మైనర్, సబ్‌మైనర్ కాలువలు మొత్తం 68 కిలోమీటర్ల మేర తవ్వాల్సి ఉంది. కానీ, సగం మాత్రమే పూర్తయ్యాయి. సబ్‌మైనర్ కాలువలు అధికప్రాంతం జిల్లాలోనే తవ్వాల్సిఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.80.84 కోట్లు భూసేకరణకు, ఆర్‌అండ్‌ఆర్‌కు కేటాయించారు. చెల్లింపులు ఆలస్యం కావ డంతో పిల్లకాలువల తవ్వకాల్లో జాప్యం చోటుచేసుకుంటుంది.
నేరడి బ్యారేజీ..
నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం అంగీకరించకపోవడంతో.. గొట్టా బ్యారేజీ కుడి ప్రధాన కాలువ నుంచి 12 టీఎంసీల నీటిని మళ్లించి హిరమండలం రిజర్వాయర్‌ను నింపేందుకుగాను ఎత్తిపోతల పథకం పనులు గతేడాది ప్రారంభమయ్యాయి. రెండేళ్ల క్రితం ఒడిశా సీఎంను మన సీఎం జగన్మోహన్‌రెడ్డి కలసి నేరేడి బ్యారేజీ విషయమై మాట్లాడారు. ఈ విషయాన్ని అధికార పార్టీ గొప్పగా ప్రచారం చేసుకుంది. కానీ, నేరడి బ్యారేజీకి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ప్రత్యామ్నాయంగా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. రూ. 140.17 కోట్లను కేటాయించారు. కానీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పూర్తి చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు బిల్లులు పెడుతున్నా.. సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ కావడంలేదు.
ఆఫ్‌షోర్ రిజర్వాయర్..
పలాస మండలం రేగులపాడు గ్రామం వద్ద ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా నందిగాం, పలాస, మెళియాపుట్టి మండలాల్లో 24,600 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉంది. పనులు, భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ కోసం రూ. 325.45 కోట్లు ఖర్చుచేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆఫ్‌షోర్ ప్రాజెక్టు అంచనాను పెంచి రూ.852.45 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు పనులు 45 శాతం మేర మాత్రమే పనులు జరిగాయి. పనులకు సంబంధించి రూ. 7.52 కోట్లు, భూసేకరణకు సంబంధించి రూ. 7కోట్లు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి.
గొట్టా బ్యారేజీ..
సుమారు 45 ఏళ్ల క్రితం రాతితో గొట్టా బ్యారేజీ ఎడమ ప్రధాన కాలువ నిర్మించారు. ప్రస్తుతం కాలువ సగం భాగం దెబ్బతింది. నీటి ప్రవాహం 2,480 క్యూసెక్కుల నుంచి 1980 క్యూసెక్కులకు తగ్గిపోయింది. కాలువ ఆధునికీకరణకు రూ.954 కోట్లు అవసరమని, నిధులు మంజూరుచేయాలని ఇంజనీరింగ్ అధికారులు ఏటా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నా రూపాయి కూడా మంజూరు కావడంలేదు. గొట్టా బ్యారేజీ కుడి ప్రధాన కాలువ గట్టు కూడా కోతకు గురైంది. సీసీ లైనింగ్ నిర్మాణం చేపట్టేందుకుగాను రూ. 22.88 కోట్లు అవసరం. ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. కానీ నిధులు మంజూరుకాలేదు.
ఫ ఈఏడాది వంశధార ఫేజ్-2 పనులు పూర్తికావాలంటే.. ఎత్తిపోతల పథకం, హైలెవల్ కాలువ పనులు కొనసాగాలంటే కచ్చితంగా రూ. 200 కోట్లు అవసరం.. ఇందులో పెండింగ్ బిల్లులే రూ. 50కోట్లు, భూ సేకరణకు రూ. 30 కోట్లు అవసరం. నిధులు కేటాయించి.. విధిల్చితేనే సాగునీటి వనరులు వినియోగమవుతాయి. ఎన్నికల ఏడాది కావడంతో ఇప్పుడైనా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.