Share News

రాధా గోవిందస్వామికి.. పూర్వ వైభవం వచ్చేనా?

ABN , Publish Date - Jun 10 , 2024 | 11:25 PM

184ఏళ్ల చరిత్ర కలిగిన మెళియాపుట్టి రాధాగోవింద(వేణుగోపాల) స్వామి అలయం ఎట్టకేలకు పురావస్తు, దేవదాయశాఖ ఆధీనంలోకి వెళ్లినట్టు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఎట్టకేలకు స్వామికి మంచి రోజులు వచ్చినట్టేనని చెప్పొచ్చు.

రాధా గోవిందస్వామికి.. పూర్వ వైభవం వచ్చేనా?
రాధాగోవిందస్వామి ఆలయం

- పురావస్తు, దేవదాయశాఖ ఆధీనంలోకి ఆలయం

- ఆక్రమణల తొలగింపునకు అధికారుల చర్యలు

- త్వరలో ప్రారంభం కానున్న అభివృద్ధి పనులు

(మెళియాపుట్టి)

184ఏళ్ల చరిత్ర కలిగిన మెళియాపుట్టి రాధాగోవింద(వేణుగోపాల) స్వామి అలయం ఎట్టకేలకు పురావస్తు, దేవదాయశాఖ ఆధీనంలోకి వెళ్లినట్టు బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఎట్టకేలకు స్వామికి మంచి రోజులు వచ్చినట్టేనని చెప్పొచ్చు. కొన్నాళ్ల కిందట ఈ ఆలయ దుస్థితిపై.. ‘స్వామీ ఊయల మండపం ఉంచరట’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై దేవదాయశాఖ అధికారుల్లో కదలిక వచ్చింది. దీంతో దేవాలయాన్ని దేవదాయశాఖ కమిషనర్‌ పరిశీలించి.. ఆలయ అభివృద్ధికి రూ.కోటి నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటివరకు దేవాలయానికి చుట్టుపక్కల ఉన్న కొంతస్థలాన్ని ఓ వైసీపీ నాయకుడు ఆక్రమించాడు. ఆ కొంతమందికి విక్రయించి రూ.కోట్లు గడించాడు. అలాగే ఆలయానికి ఇరువైపులా షాపింగ్‌మాల్స్‌ ఏర్పాటు చేసి ప్రతినెలా అద్దెల రూపంలో వేలాది రూపాయలు సంపాదిస్తున్నడనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆలయం చుట్టుపక్కల 1.30 ఎకరాలు ఆక్రమణకు గురైందని అధికారులు గుర్తించారు. ఆక్రమణలు తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చరిత్ర

మెళియాపుట్టిలో 1840లో పర్లాఖిమిడి మహారాజు వీరేంద్ర ప్రతాప రుద్రడు తన భార్య విష్ణుప్రియ కోరిక మేరకు రాధాగోవింద స్వామి ఆలయాన్ని నిర్మించారు. రాతికట్టుతో ఆకట్టుకునే శిల్పాలతో నిర్మించిన ఈ ఆలయం ఖజురహోగా ప్రసిద్ధి చెందింది. గోపురం 108 తామర పువ్వులతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రాధాగోవిందస్వామిని భక్తులు కొలుస్తూ.. ఏటా డోలోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. కాగా.. 30ఏళ్ల కిందట ఈ ఆలయ భూములు కొంతమందికి చేతికి చిక్కడంతో.. ఆలయ ఆదరణ తగ్గుతోంది. ఈ క్రమంలో కొంతమంది భక్తులు చందాలు వేసుకుని ఏటా డోలోయాత్ర నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈ ఆలయాన్ని దేవదాయశాఖ ఆధీనంలోకి తీసుకోవాలని వినతులు సమర్పించారు. దీనికి సంబంధించిన భూముల వ్యవహారం కూడా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

తొమ్మిదేళ్లయినా.. దొంగలు దొరకలే..

2015 నవంబరు 3న రాధాగోవిందస్వామి ఆలయంలో దొంగలు పడి.. సుమారు రూ.50లక్షల విలువైన పంచలోహ విగ్రహలను చోరీ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. క్లూస్‌టీమ్‌, డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలించారు. కాగా నేటికీ దొంగలు దొరకలేదు. ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఆలయం ఉండడమే దొంగలు తప్పించుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

1991లోనే పురావస్తుశాఖ గెజిట్‌ విడుదల

చరిత్ర గల ఆలయాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో పురావస్తుశాఖ రాష్ట్రంలో ఉన్న కొన్ని దేవాలయాలను తమ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు వేణుగోపాలస్వామిని కూడా తీసుకునేందుకు 1960 యాక్ట్‌ ప్రకారం 1991లో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటకు రాకుండా అధికారులకు ఎంతోకొంత ముట్టచెప్పినట్టు సమాచారం. ఇటీవల ఆలయ భూముల పరిరక్షణకు వచ్చిన దేవదాయశాఖ అధికారులపై కొంతమంది ఆక్రమణదారులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. దీంతో దేవాలయాన్ని ఎలాగైనా రక్షించుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ముందుగా ఆలయాన్ని అభివృద్ధి చేసి.. ఆక్రమణలు తొలగించేందుకు సన్నద్ధమవుతున్నారు. వారం రోజులుగా పురావస్తుశాఖ సిబ్బంది ఆలయం చుట్టుపక్కల ఉన్న పిచ్చిమొక్కలను తొలగిస్తున్నారు. త్వరలో కోటి రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులు చేయనున్నారు.

అభివృద్ధి చేస్తాం

మెళియాపుట్టిలోని రాధాగోవిందస్వామి ఆలయం దేవదాయశాఖ ఆధీనంలో ఉంది. ఆలయ అభివృద్ధికి రూ.కోటి నిధులు అవసరమని ప్రతిపాదనలు రూపొందించాం. ఈ ఆలయాన్ని 1991లో పురావస్తుశాఖ స్వాధీనం చేసుకుంది. రెండు శాఖల సమన్వయంతో అభివృద్ధి చేస్తాం. బోర్డులతోపాటు ఇప్పటికే హుండీ కూడా ఏర్పాటు చేశాం.

- వాసుదేవరావు, ఈవో, పాతపట్నం

Updated Date - Jun 10 , 2024 | 11:25 PM