Share News

రణభూమిలో రాజు ఎవరో?

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:08 AM

ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా ఉంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులకే ఓటర్లు పట్టంకట్టారు.

    రణభూమిలో రాజు ఎవరో?

- ఆరుసార్లు టీడీపీదే విజయం

- కాంగ్రెసేతర పార్టీలకే పట్టంకడుతున్న ఓటర్లు

- ఈసారి కూటమి, వైసీపీల మధ్యే ప్రధాన పోటీ

- 2,43,056 మంది ఓటర్లు

- తూర్పుకాపులే అధికం

- ఇదీ ఎచ్చెర్ల నియోజకవర్గ ముఖచిత్రం

(రణస్థలం)

ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ కంచుకోటగా ఉంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఆరుసార్లు టీడీపీ అభ్యర్థులకే ఓటర్లు పట్టంకట్టారు. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా తూర్పుకాపులు ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటములను ఈ ఓటర్లే శాసించనున్నారు. ఈసారి ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు తలపడుతున్నారు. వీరంతా రణస్థలం మండలానికి చెందినవారే.

జాతీయ రహదారి పొడవునా విస్తరించిన ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాకే ముఖద్వారంగా స్వాగతం పలుకుతోంది. 1967లో ఈ నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 12 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1978 నుంచి 2004 వరకు ఎచ్చెర్ల సెగ్మెంట్‌ ఎస్సీలకు రిజర్వ్‌ కాబడింది. 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో ఎచ్చెర్ల జనరల్‌ కేటగిరీకి కేటాయించి... అప్పటి వరకు చీపురుపల్లిలో ఉన్న జి.సిగడాం మండలాన్ని ఎచ్చెర్లలో విలీనం చేశారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీకి ఎచ్చెర్ల కంచుకోటగా మారింది. ఇప్పటి వరకు టీడీపీ ఆరుసార్లు విజయం సాధించగా, కాంగ్రెస్‌ అభ్యర్థులు మూడుసార్లు, వైసీపీ, ఇండిపెండెంట్‌, జనతా అభ్యర్థులు చెరొకసారి గెలిచారు. ఈసారి పోటీ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు (బీజేపీ), వైసీపీ అభ్యర్ధి, సిట్టింగ్‌ శాసనసభ్యుడు గొర్లె కిరణ్‌కుమార్‌ల మఽధ్యే ప్రధానం నెలకొంది.

కూటమిలో బీజేపీకి దక్కిన సీటు..

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా కూటమి తరఫున బీజేపీ ఎచ్చెర్ల అసెంబ్లీ సీటును దక్కించుకుంది. ఈ సెగ్మెంట్‌లో టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న మాజీ మంత్రి, సీనియర్‌ నేత కిమిడి కళావెంకటరావు చీపురుపల్లి నుంచి పోటీచేస్తున్నారు. కాగా, ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌ ఆశించిన కలిశెట్టి అప్పలనాయుడు విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తుండడం కలిసొచ్చే అంశంగా పేర్కొనవచ్చు.

ఓటర్ల వివరాలు..

ఎచ్చెర్ల నియోజకవర్గంలో పురుషులు 1,22,223 మంది, మహిళలు 1,20,819 మంది, ఽథర్డ్‌ జెండర్‌ ఓటర్లు 14 మంది ఉన్నారు. నియోజకవర్గంలో తూర్పు కాపు ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. లావేరు, రణస్థలం, జి.సిగడాం మండలాల్లో కాపు సామాజిక వర్గం ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎచ్చెర్ల మండలంలో కాళింగ, వెలమ సామాజిక వర్గాలు ఉన్నాయి. ఎచ్చెర్ల, రణస్థలం మండలాల్లో సుమారు 15 వేల మంది మత్స్యకార ఓటర్లు ఉన్నారు. లావేరు, జి.సిగడాం మండలాల్లో తెలగ సామాజిక వర్గం ప్రజలు ఉన్నారు.

నియోజకవర్గ చరిత్ర..

ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది. 1967, 1972లో ఓపెన్‌ కేటగిరీలో ఎన్నికలు జరిగాయి. 1978 నుంచి 2004 వరకు ఎస్సీలకు రిజర్వ్‌ చేయబడింది. ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాలతో ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం 2004 ఎన్నికల వరకు ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో జి.సిగడాం మండలాన్ని ఎచ్చెర్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లో కొత్తగా కలిపారు. 2009 ఎన్నికల నుంచి ఓపెన్‌ కేటగిరీకి ఈ నియోజకవర్గాన్ని కేటాయించారు.

ప్రతిభాభారతి ఐదుసార్లు విజయం..

ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1983 నుంచి 1999 వరకు వరుసగా ఐదుసార్లు కావలి ప్రతిభాభారతి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గా ఆమె పనిచేశారు. నియోజకవర్గ పునర్విభజనలో ఎచ్చెర్ల జనరల్‌ కేటగిరీకి కేటాయించడంతో ఆమె రాజాం (ఎస్సీ) నియోజక వర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. 2004 ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి ప్రతిభాభారతి (టీడీపీ)పై విజయం సాధించిన కోండ్రు మురళీమోహన్‌ (కాంగ్రెస్‌), 2009లో రాజాం (ఎస్సీ) నియోజకవర్గంలో ఆమె పైనే పోటీ చేసి గెలుపొందారు. 1978లో ఎన్నికల్లో ప్రతిభాభారతి పెదనాన్న కొత్తపల్లి నరసయ్య జనతా పార్టీ తరఫున ఎచ్చెర్ల నుంచి పోటీచేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

రాష్ట్రంలో ఎచ్చెర్లకు ప్రత్యేక గుర్తింపు..

ఎచ్చెర్ల నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉంది. ఇక్కడి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించిన నేతలు మంత్రి పదవులతో పాటు పార్టీలో కీలక పదవులు చేపట్టడంతో ఎచ్చెర్లకు మంచి గుర్తింపు లభించింది. నాటి రణభూమిగా పేరొందిన రణస్థలం ఇదే నియోజకవర్గంలోనే ఉంది. బొబ్బిలి రాజులు, విజయనగరం రాజుల యుద్ధానికి ప్రధాన కేంద్రంగా అప్పట్లో రణస్థలం వర్ధిల్లిందని చరిత్ర చెబుతోంది. ఎస్‌ఎంపురం (ఎచ్చెర్ల మండలం) మహమ్మదీయుల కాలంలో ప్రధాన కేంద్రంగా ఉండేది. పారిశ్రామిక వాడ, విద్యాకేంద్రంగా భాసిల్లుతోంది. జిల్లా కేంద్రంలోకి అడుగుపెట్టగానే స్వాగతించే ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఇంకెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ఈసారి అభ్యర్థులంతా రణస్థలం వారే

ఈ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార వైసీపీ ఒంటరిగా పోటీచేస్తుండగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. మరో వైపు కాంగ్రెస్‌ పార్టీ సైతం క్రియాశీలకంగా మారింది. వామపక్షాలతో కలిసి ఇండియా కూటమి తరఫున పోటీచేస్తోంది. ఇప్పటికే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యింది. అయితే ఎచ్చెర్ల నియోజకవర్గం మాత్రం ఎన్నో ప్రత్యేకతలకు వేదికగా మారుతోంది. ఎచ్చెర్ల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. కానీ విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలో కొనసాగుతోంది. పొత్తులో భాగంగా ఈ అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయించగా.. ఆ పార్టీ నడుకుదిటి ఈశ్వరరావును ఖరారు చేసింది. ఆయన సొంత గ్రామం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ నడుకుదిటిపాలేం. అటు విజయనగరం పార్లమెంట్‌ స్థానానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు ఖరారయ్యారు. ఈయన స్వగ్రామం రణస్థలం మండలంలోని వీఎన్‌పురం. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ పోటీచేస్తున్నారు. ఈయన స్వగ్రామం రణస్థలం మండలంలోని పాతర్లపల్లి. కాంగ్రెస్‌ అభ్యర్థిగా కరిమజ్జి మల్లేశ్వరరావు పేరును ఖరారు చేసింది. ఈయన స్వగ్రామం రణస్థలం మండలంలోని నగరప్పాలేం. దీంతో అన్ని పార్టీలు రణస్థలం మండలానికి ప్రాధాన్యం ఇచ్చాయి. పేరుకే ఎచ్చెర్ల నియోజకవర్గం కానీ.. రాజకీయ కార్యకలాపాలు నడిచేది రణస్థలం నుంచే. ఎన్నెన్నో యుద్ధగాధలతో ప్రాచుర్యంలోకి వచ్చిన రణస్థలం నిజంగానే రాజకీయాలకు ‘రణ’స్థలిగా మారడం విశేషం. ఏడాది కిందట జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ యువగళం పేరిట రణస్థలం నుంచే వైసీపీ ప్రభుత్వంపై పోరాటం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రాష్ట్రం చూపు రణస్థలంపై పడింది. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు రణస్థలానికి ప్రాధాన్యమివ్వడంతో మరోసారి రణస్థలం పేరు మార్మోగిపోతోంది.

ఎచ్చెర్ల నేతలు పక్క జిల్లాకు..

ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన నేతలు పొత్తుల నేపథ్యంలో పక్క జిల్లాలో పోటీకి దిగుతున్నారు. రణస్థలం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు, పొందూరు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కలిశెట్టి అప్పలనాయుడును విజయనగరం పార్లమెంట్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈయన ఎచ్చెర్ల నియోజకవర్గ అసెంబ్లీ సీటును ఆశించారు. అయితే, పొత్తుల కారణంగా బీజేపీకి ఎచ్చెర్ల సీటును కేటాయించారు. ఇక్కడ నుంచి విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నడుకుదిటి ఈశ్వరరావు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. దీంతో విజయనగరం పార్లమెంట్‌ అభ్యర్థిగా కలిశెట్టిని అధిష్ఠానం ఖరారు చేసింది. అలాగే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు కూడా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే, ఆయన బలమైన నేత కావడంతో చీపురుపల్లిలో మంత్రి బొత్సపై పోటీకి నిలబెట్టాలని అధిష్ఠానం భావించింది. ఈ మేరకు పలు దఫాలు సర్వేలు నిర్వహించింది. సర్వేలు అనుకూలంగా రావడంతో కళా వెంకటరావుకు చీపురుపల్లి సీటును కేటాయించింది. ఎచ్చెర్లకు చెందిన కలిశెట్టి అప్పలనాయుడు, కిమిడి కళావెంకటరావు పక్క జిల్లాలో పోటీకి దిగుతుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - Apr 19 , 2024 | 12:08 AM