Share News

ఎవరికి అనుకూలమో?

ABN , Publish Date - May 15 , 2024 | 11:49 PM

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసి మూడు రోజులు అయింది. అయినా పొలిటికల్‌ హీట్‌ తగ్గలేదు. 2019 ఎన్నికలతో పోల్చితే ఈ దఫా పోలింగ్‌ శాతం పెరిగింది. అప్పుడు అధికశాతం నియోజకవర్గాల్లో అభ్యర్థి ఎవరన్నదీ పరిగణనలోకి తీసుకోకుండా ఓటర్లు వైసీపీకి ‘ఒక్క ఛాన్స్‌’ ఇచ్చారు.

  ఎవరికి అనుకూలమో?

-జిల్లాలో గతం కంటే పెరిగిన పోలింగ్‌

- 2019లో 75.33శాతం..

- ఇప్పుడు 76.81 శాతం నమోదు

-ఓటింగ్‌లో మహిళలే ముందంజ

- మాకే అనుకూలమంటున్న కూటమి

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసి మూడు రోజులు అయింది. అయినా పొలిటికల్‌ హీట్‌ తగ్గలేదు. 2019 ఎన్నికలతో పోల్చితే ఈ దఫా పోలింగ్‌ శాతం పెరిగింది. అప్పుడు అధికశాతం నియోజకవర్గాల్లో అభ్యర్థి ఎవరన్నదీ పరిగణనలోకి తీసుకోకుండా ఓటర్లు వైసీపీకి ‘ఒక్క ఛాన్స్‌’ ఇచ్చారు. ఇప్పుడా పరిస్థితిలేదు. ఈ ఎన్నికల్లో వైసీపీ సర్కారుకు చాలా వర్గాలు దూరమయ్యాయి. పైగా సొంతపార్టీలోనూ అసమ్మతి తీవ్రమైంది. ఎన్డీఏ కూటమి చెప్పుకుంటున్నట్లుగా విశ్లేషణను వైసీపీ జిల్లాలో చెప్పలేకపోతుంది. పైగా పోలింగ్‌ శాతం పెరగడంతో టీడీపీకి లాభం కూర్చేలా.. వైసీపీకి నష్టం తప్పదన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరో 18 రోజుల్లో ఫలితాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.

గత ఎన్నికల్లో 75.33 శాతం..

2019 ఎన్నికల్లో జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 75.33 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ ఎన్నికల్లో 76.81 శాతం నమోదైంది. ఎచ్చెర్ల అసెంబ్లీలో గత ఎన్నికల్లో 84.3 శాతం ఓటింగ్‌ జరగ్గా, ఈ దఫా 83.28శాతం పోలింగ్‌ నమోదైంది. పెద్దతేడా ఏమీలేదు. మిగిలిన ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాల్లో గతం కంటే పోలింగ్‌ శాతం పెరిగింది. ఇదంతా టీడీపీకి కలసివచ్చే అవకాశముంది.

ఓటేసినవారు 14,40,885 మంది

ఈ ఎన్నికల్లో మొత్తం 14,40,885 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 18,75,934 ఓటర్లు ఉండగా.. ఇందులో పురుష ఓటర్లు 9,29,859, మహిళా ఓటర్లు 9,45,945 మంది, ఇతరులు 130 మంది ఉన్నారు. వీరిలో ఓటు హక్కును వినియోగించుకున్న వారు పురుషులు 7,01,016 మంది, మహిళలు 7,39,852 మంది, ఇతరులు 17 మంది ఉన్నారు. అంటే 76.81 శాతం మంది ఓటుహక్కును సద్వినియోగించుకున్నారు. 2019లో జగన్‌పై ఉన్న సానుభూతి ఇప్పుడులేకపోవడం.. కనీసం గ్రామాల్లో రోడ్లు కూడా బాగుచేయకపోవడం.. మంత్రులు, స్పీకర్‌ వంటి పదవులు జిల్లాకు లభించినా.. వారు కూడా ప్రతిపక్షాన్ని తూర్పారబట్టేందుకే తప్ప జిల్లాకు ఊడబొడిచిందేమీలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వస్తుందని, జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఎన్డీఏ అభ్యర్థులు వెల్లడిస్తున్నారు. శ్రీకాకుళం పార్లమెంట్‌ స్థానం గురించి చర్చించుకోనవసరంలేదు. ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడుకి లక్షా 60వేలు మెజార్టీ వస్తుందని అంచనాకు వచ్చేశారు. దీనిపై పందేలు జోరందుకున్నాయి.

Updated Date - May 15 , 2024 | 11:49 PM