Share News

అమాత్యులెవరో?

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:41 PM

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. గత ఎన్నికల లెక్కలను తిరగరాస్తూ.. ఎన్డీయే కూటమి జిల్లాలో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఒక లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి సునామీకి వైసీపీ తట్టుకోలేకపోయింది. మరి కొద్దిరోజుల్లో కేంద్రప్రభుత్వం.. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరునున్నాయి. జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి వరించనున్నదోనని చర్చ జరుగుతోంది.

అమాత్యులెవరో?

- అచ్చెన్నకు బెర్త్‌ ఖరారు... శాఖ సంగతే తెలియదాయె

- ఆశావహుల జాబితాలో అశోక్‌, కూన రవి, శిరీష

- మంత్రివర్గంలో జిల్లాకు దక్కనున్న అత్యంత ప్రాధాన్యం

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. గత ఎన్నికల లెక్కలను తిరగరాస్తూ.. ఎన్డీయే కూటమి జిల్లాలో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఒక లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి సునామీకి వైసీపీ తట్టుకోలేకపోయింది. మరి కొద్దిరోజుల్లో కేంద్రప్రభుత్వం.. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరునున్నాయి. జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి వరించనున్నదోనని చర్చ జరుగుతోంది.

అచ్చెన్నకు దాదాపు ఖరారు

కింజరాపు అచ్చెన్నాయుడుపై పలు కేసులు నమోదుచేసి చాలాత్రీవంగా వైసీపీ ప్రభుత్వం వేధించింది. ఏమాత్రం బెదరకుండా అచ్చెన్న కేసులను ఎదుర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు రవాణాశాఖ, కార్మికశాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు పదవీబాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం అచ్చెన్నకు మంత్రి పదవి దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం టెక్కలిలో జరిగిన ‘యువగళం’ సభలో స్వయంగా ఎంపీ రామ్మోహన్‌నాయుడే మాట్లాడుతూ అచ్చెన్నాయుడుకి హోంశాఖ ఇవ్వాలని నారా లోకేష్‌ను కోరారు. ఆవిషయం చంద్రబాబునాయుడు చూసుకుంటారని లోకేష్‌ బదులిచ్చారు. అయితే మంత్రిపదవి ఇవ్వడమన్నది దాదాపు ఖాయమన్నది సమాచారం. అయితే ఏశాఖ అన్నదీ స్పష్టతలేదు. చంద్రబాబుకు కుడిభుజంలా ఉంటున్న అచ్చెన్నకు తప్పకుండా ప్రాధాన్యం ఇస్తారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు.

ఆశావహుల్లో ఆ ఇద్దరు కూడా..

2014లో గెలిచిన కూన రవికుమార్‌కు విప్‌ పదవిని ఇచ్చారు. ఆతర్వాత 2019లో ఓటమిపాలైన రవికుమార్‌.. ఏమాత్రం వెనక్కు తగ్గకుండా స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారాంను బలంగా ఢీకొని.. అక్రమ కేసులకు వెరవకుండా టీడీపీకి పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టారు. అవకాశమున్నప్పుడల్లా అధికారపార్టీ అవినీతిని ఎండగడుతూ తమ్మినేనికి ఘోర పరాజయాన్ని రుచి చూపించారు. ఆయన కాళింగ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం.. ఇక్కడ ఆ వర్గం అధికంగా ఉండటంతో అమాత్య పదవి ఈ దఫా లభిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇచ్ఛాపురం నుంచి మూడుదఫాలు బెందాళం అశోక్‌ గెలిచారు. ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. పైగా పార్టీలో కీలకవ్యక్తులందరి ఆశీస్సులు అశోక్‌కు ఉన్నాయి. మంత్రి పదవి వరిస్తుందో.. లేదో.. త్వరలో తేలుతుంది

రేసులో గౌతు శిరీష కూడా..

ఐదేళ్లపాటు మహిళ అని చూడకుండా టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతు శిరీషపై వైసీపీ మూకలు సోషల్‌మీడియా వేదికగా హింసించాయి. వైసీపీ నేతలు ఆమె అనుచరులందరిపై అక్రమ కేసులను నమోదు చేయించారు. టీడీపీ సానుభూతి పరులను సైతం వేధించారు. ఇవన్నీ ఓపిగ్గా భరించి.. శిరీష స్థానిక మంత్రి సీదిరి అప్పలరాజును ఎదిరించి మట్టికరిపించారు. ఆమె తండ్రి గౌతు శివాజీ అంటే అత్యంత మక్కువ చంద్రబాబుకు. సీదిరి పెట్టిన ఇబ్బందులను ఎదుర్కొన్న శిరీషకు అమాత్యపదవి వరిస్తుందా? ఇతర ప్రాధాన్యం ఉన్న పదవిలో నియమిస్తారా? అన్న ప్రచారం సాగుతోంది.

కేంద్రమంత్రిగా రామ్మోహన్‌ నాయుడు!

ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు కేంద్రమంత్రి పదవి లభించనున్నట్లు సమాచారం. వరుసగా మూడోసారి గెలిచిన ఆయన.. ఇంతవరకు జిల్లాలో ఏ ఎంపీకి లభించని మెజార్టీని సొంతం చేసుకున్నారు. ఈ దఫా ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్య మైంది. ఇప్పటికే పార్లమెంట్‌లో తనవాణిని వినిపిస్తూ దేశవ్యాప్తంగా రామ్మోహన్‌ గుర్తింపుపొందారు. ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలకోసం తన తండ్రి దివంగతనేత కింజరాపు ఎర్రన్నాయుడు మాదిరిగానే పనిచేసేతత్వం ఉండటాన్ని చంద్రబాబు గుర్తించారు. కేంద్ర మంత్రివర్గంలోకి రామ్మోహన్‌కి కచ్చితంగా అవకాశం ఇవ్వనున్నట్లు తాజా సమాచారం. విద్యావంతుడు కావడం... మూడుదఫాలు లోక్‌సభలో ప్రజాసమస్యలపై గళమెత్తడం కారణంగా ఆయనకు ప్రతిభకు తగ్గట్టుగా మంత్రిత్వ శాఖను కేంద్రం ఇస్తుందని తెలుస్తోంది.

Updated Date - Jun 08 , 2024 | 11:41 PM