Share News

ఎక్కడి పనులు అక్కడే

ABN , Publish Date - Apr 06 , 2024 | 11:59 PM

వైసీపీ పాలనలో అభివృద్ధి పనులు పడకేశాయి. నిధుల సమస్యతో వజ్రపుకొత్తూరు మండలంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

   ఎక్కడి పనులు అక్కడే
అక్కుపల్లి రోడ్డు పనులు నిలిచిపోవడంతో రాళ్లుతేలిన దృశ్యం

- నిలిచిన రాజాంకాలనీ-వజ్రపుకొత్తూరు రోడ్డు విస్తరణ

- ఆగిన ఫిష్‌ ల్యాండ్‌ నిర్మాణం

- అప్రోచ్‌ రోడ్డుదీ ఇదే పరిస్థితి

- జీవోలకే పరిమితమైన మరికొన్ని పనులు

- ప్రజలకు తప్పని ఇబ్బందులు

(వజ్రపుకొత్తూరు)

వైసీపీ పాలనలో అభివృద్ధి పనులు పడకేశాయి. నిధుల సమస్యతో వజ్రపుకొత్తూరు మండలంలో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క పని కూడా పూర్తికాలేదు. రాజాంకాలనీ-వజ్రపుకొత్తూరు రోడ్డు విస్తరణ పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. నువ్వలరేవు ఉప్పటేరు అప్రోచ్‌ రోడ్డుకు అతీగతి లేదు. ఫిష్‌ల్యాండ్‌ నిర్మాణాన్ని గాలికొదిలేశారు. నువ్వలరేవు- బెండిగేటు జంక్షన్‌ రోడ్డు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఇలా పనులన్నీ మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిధులు విడుదల కాకపోతే తామేమి చేస్తామంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు.

పూర్తికాని రహదారి విస్తరణ

రాజాంకాలనీ నుంచి వజ్రపుకొత్తూరు వరకు ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డును రెండు లైన్లగా విస్తరించడానికి మూడేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. తొలుత పనులు వేగవంతంగా జరిగినా తరువాత మందగించాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం ఈ పనులు నిలిచిపోయాయి. ధర్మపురం, గరుడుభద్ర, అక్కుపల్లి, బైపల్లి, బాతుపురం, చినవంక, డోకులపాడు గ్రామాల వద్ద రాళ్లు చేసి వదిలేశారు. తారుగానీ, గ్రావెల్‌ గానీ వేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై రాళ్లు తేలడంతో ద్విచక్ర వాహనాలు బోల్తాపడి పలువురు గాయపడుతున్నారు. ఎన్నికల కోడ్‌ రావడంతో నిధులు విడుదలపై అమోమయం నెలకొంది. దీంతో ఈ రోడ్డు పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అప్రోచ్‌ రోడ్డు పనులు వదిలేశారు..

నువ్వలరేవు ఉప్పటేరుపై సుమారు రూ.40కోట్ల వ్యయంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మాణం చేపట్టారు. వంతెనకు అటు మంచినీళ్లపేట వైపు, ఇటు నువ్వలరేవు వైపు అప్రోచ్‌ రోడ్డు పనులు చేపట్టే సమయంలో టీడీపీ ప్రభుత్వం మారిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం అప్రోచ్‌ రోడ్డును పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు కోసం నువ్వలరేవు వైపు 105 ఇళ్లు తొలగించాల్సి ఉంది. అధికారులు సైతం ఇళ్లకు మార్కింగ్‌ వేశారు. బాధితులకు గ్రామ సమీపంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అధికారులు, నాయకులు సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే, ఈ స్థలం సీఆర్‌జెడ్‌ పరిధిలో ఉండడంతో బాధితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు ముందుకు రాలేదు. మరోవైపు కేవీటీలు గ్రామానికి దూరంగా వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో అప్రోచ్‌ రోడ్డు పనులు ముందుకు సాగలేదు. గ్రామానికి దూరంగా ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు నువ్వలరేవు గ్రామస్థులను ప్రభుత్వం ఒప్పించి ఉంటే ఈ సమస్య పరిష్కారమయ్యేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భూమిపూజతో సరి..

నువ్వలరేవు గ్రామ సమీపంలో ఫిష్‌ల్యాండ్‌ నిర్మాణానికి వైసీపీ నాయకులు అట్టహాసంగా భూమి పూజ చేశారు. దీనికి నువ్వలరేవు- మంచినీళ్లపేట ఫిష్‌ల్యాండ్‌ అంటూ నామకరణం కూడా చేశారు. అయితే, నిధుల సమస్యతో పనులు ముందుకు సాగలేదు. తరువాత దీన్ని జట్టీగా మారుస్తున్నట్లు పలు వేదికలపై వైసీపీ నాయకులు ప్రకటనలు గుప్పించారు. ఇప్పటికీ ఈ పనులు 20 శాతం కూడా జరగలేదు. పనులు పూర్తయితే తీరప్రాంత మత్స్యకారులకు ఎంతో మేలు జరిగేది.

సగంలో ఆపేశారు..

నువ్వలరేవు నుంచి బెండి మీదుగా బెండిగేటు జంక్షన్‌ వరకు డబుల్‌ రోడ్డు నిర్మాణం పనులు నత్తనడకగా సాగుతున్నాయి. బెండి వద్ద ఒకవైపు సిమెంట్‌ రోడ్డు నిర్మించి మిగిలిన సగం ఆపేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పూండి- బెండిగేటు రోడ్డు పనులు, బెండి ఎత్తపోతల పనులు, ఒంకులూరు రాకాసి గెడ్డపై సుమారు రూ.5కోట్లతో వంతెన పనులు చేపట్టేందుకు జీవోలు విడుదలైనా పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోలేదు.

Updated Date - Apr 06 , 2024 | 11:59 PM