Share News

సర్టిఫికెట్లు ఎప్పుడిస్తారో?

ABN , Publish Date - May 23 , 2024 | 12:32 AM

ఉన్నత చదువులు అభ్యసించేందుకు విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల జారీ చాలా జాప్యమవుతోంది. సార్వత్రిక పోరు షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచీ.. జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికల కోడ్‌ అమలు నేపథ్యంలో కుల, ఆదాయ, నివాస తదితర ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది.

సర్టిఫికెట్లు ఎప్పుడిస్తారో?

- కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలకు పాట్లు

- ఎన్నికల విధులతో నిలిచిన జారీ ప్రక్రియ

- విద్యార్థుల ఆవేదన

(ఇచ్ఛాపురం)

ఉన్నత చదువులు అభ్యసించేందుకు విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల జారీ చాలా జాప్యమవుతోంది. సార్వత్రిక పోరు షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచీ.. జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఎన్నికల కోడ్‌ అమలు నేపథ్యంలో కుల, ఆదాయ, నివాస తదితర ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయినా వెబ్‌సైట్‌లు తెరచుకోవడం లేదని వాపోతున్నారు. నూతన విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ధ్రువీకరణ పత్రాల అవసరం పెరిగింది. నూటికి 80 శాతం విద్యార్థులు ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆయా విద్యాసంస్థల్లో చేరేందుకు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉంటుంది. ఈ మేరకు విద్యార్థులు మీసేవ, సచివాలయాల ద్వారా దరఖాస్తులు చేసుకున్నా.. సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. విద్యాసంస్థల్లో అడ్మిషన్లు వేగంగా అయిపోతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏమిచేయాలో తెలియక సతమతమవుతున్నారు. ఆయా యాజమాన్యాలకు కొద్దిరోజులు గడువు అడుగుతున్నారు. అధికారులు స్పందించి త్వరగా ధ్రువపత్రాలు జారీచేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీహరి వద్ద ప్రస్తావించగా.. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య కారణంగా సర్టిఫికెట్లు మంజూరు కాలేదన్నారు. ప్రస్తుతం చాలామంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశామని, పెండింగ్‌లో ఉన్నవాటిని కూడా రెండు రోజుల్లో జారీ చేస్తామని తెలిపారు.

Updated Date - May 23 , 2024 | 12:32 AM