Share News

ఇదేంటి తమ్మినేని సార్‌!

ABN , Publish Date - Jul 13 , 2024 | 11:35 PM

వైసీపీ పాలనలో అక్రమాలు ఏరీతిన జరిగాయన్నదీ ప్రజలందరికీ తెలిసిందే. కానీ పెద్ద నేతలు చేసిన అవినీతి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మాజీస్పీకర్‌ తమ్మినేని సీతారాం అక్రమాల బాగోతాన్ని.. ఆయన మేనల్లుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఒక్కోటీ వెలుగులోకి తెస్తున్నారు.

ఇదేంటి తమ్మినేని సార్‌!
ఆమదాలవలస మునిసిపాల్టీ కార్యాలయం.. ఇన్‌సెట్‌లో స్పీకర్‌ తమ్మినేని సీతారాం

- గత స్పీకర్‌ ఇంటి పనులకు మునిసిపల్‌ ఉద్యోగులు

- 12 మంది సిబ్బంది వినియోగం

- ఐదేళ్లలో రూ.1.2 కోట్లు దుర్వినియోగం

- అక్రమాలు వెలికితీసిన ఎమ్మెల్యే కూన రవి

- ఇటీవల సమీక్షలో అధికారులకు నిలదీత

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

వైసీపీ పాలనలో అక్రమాలు ఏరీతిన జరిగాయన్నదీ ప్రజలందరికీ తెలిసిందే. కానీ పెద్ద నేతలు చేసిన అవినీతి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మాజీస్పీకర్‌ తమ్మినేని సీతారాం అక్రమాల బాగోతాన్ని.. ఆయన మేనల్లుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఒక్కోటీ వెలుగులోకి తెస్తున్నారు. ప్రధానంగా ఆమదాలవలస మునిసిపాలిటీలో 12 మంది సిబ్బందిని.. తమ్మినేని తన ఇంటి పనుల నిర్వహణకు వినియోగిస్తూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు. దీనిపై సమాధానం చెప్పాలంటూ.. ఇటీవల సమీక్షలో అధికారులను నిలదీయగా.. వారు నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమదాలవలస బరిలో నిలిచి ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని సీతారామ్‌కు.. అప్పటి సీఎం జగన్‌ స్పీకర్‌ పదవి కట్టబెట్టారు. స్పీకర్‌గా కంటే.. తాను ముందుగా ‘ఆమదాలవలస’ ఎమ్మెల్యేనే అంటూ తనకుతానుగా అధికారుల్లోనూ, ప్రజల్లోనూ ఐదేళ్లు తమ్మినేని పలుచనైపోయారు. మరోవైపు స్పీకర్‌ పదవిని అడ్డం పెట్టుకుని.. అక్రమాలకు పాల్పడ్డారు. స్పీకర్‌గా వ్యవహరిస్తూ.. ఆమదాలవలస మునిసిపల్‌ సిబ్బందిని తన ఇంటిపనికి వినియోగించుకున్నారన్నది ఇప్పుడు తేటతెల్లమైంది. ఇటీవల ఆమదాలవలస మునిసిపాలిటీలో నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఈ విషయాన్ని బయటకు తీశారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ఐదేళ్లపాటు మునిసిపల్‌ సిబ్బందిని స్పీకర్‌ తమ్మినేని ఎలా వినియోగించుకున్నారన్న దానిపై కూపీ లాగారు.

- వేతనం అక్కడ.. పనులు ఇక్కడ

ఆమదాలవలస మునిసిపాలిటీలో 80మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. ఇందులో 71 మంది ఒప్పంద ప్రాతిపదికన కాగా.. 9 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు. గత ఐదేళ్లూ స్పీకర్‌ తమ్మినేని తన ఇంటి పనుల నిర్వహణకు 12మంది మునిసిపల్‌ సిబ్బందిని వినియోగించుకున్నారు. తమ్మినేనికి చెందిన పెట్రోల్‌ బంకులోనూ, టీఎస్‌ఆర్‌ కళాశాల కారులకు డ్రైవర్లుగానూ, గృహవసరాలకు వారిని వాడుకున్నారు. ఆ 12 మందికి ఐదేళ్లలో గత ప్రభుత్వం నుంచి రూ.1.20 కోట్లు వేతనాలుగా చెల్లించి.. స్పీకర్‌ సొంత అవసరాలకు వారిని వినియోగించుకున్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు. అప్పటి మునిసిపల్‌ అధికారులు కూడా స్వామి భక్తి చాటుకుని.. ఇష్టమొచ్చినట్లుగా స్పీకర్‌ ఇంటిపనికి సిబ్బందిని కేటాయించేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని స్థితిలో ఉన్నారు.

- అప్పట్లో కోడెలపై నానాయాగీ.. ఇప్పుడేమంటారో..

2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో స్పీకర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించిన డా. కోడెల శివప్రసాద్‌పై.. వైసీపీ అధికారంలోకి రాగానే నానాయాగీ చేసింది. ఫర్నీచర్‌ తీసుకువెళ్లాలని లేఖ ఇచ్చినప్పటికీ మాజీస్పీకర్‌ కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదుచేసి.. ఆయన వ్యక్తిత్వాన్నే హననం చేసేలా వైసీపీ ప్రభుత్వం వికృతంగా వ్యవహరించింది. కాగా.. 2019 నుంచి ఈ ఏడాది మే వరకు స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారాం ఇంటిపనికి.. ఆయన వ్యాపార కలాపాలకు మునిసిపల్‌ సిబ్బందిని వినియోగించుకోవడం.. ఆయన కోసం పనిచేసిన సిబ్బందికి ప్రభుత్వం నుంచి రూ.1.2కోట్లు జీతాల రూపంలో వెచ్చించడంపై ఇప్పుడు దుమారం రేగింది. తమ్మినేని అక్రమాల ఉదంతంపై దర్యాప్తు చేస్తారా? లేదోనన్నది చర్చనీయాంశమవుతోంది. ఎన్డీయే కూటమి కొలువుదీరిన తర్వాత తొలి సమీక్షలోనే ఈ అక్రమాలను ఎమ్మెల్యే కూన రవికుమార్‌ వెలుగులోకి తీశారు. ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడతాయని జిల్లావాసులు అభిప్రాయ పడుతున్నారు. గత ఐదేళ్లలో టీడీపీ నేత కూన రవిపై రౌడీషీటర్‌ తెరవడంతోపాటు కుప్పలుగా అక్రమ కేసులను తమ్మినేని పరోక్షంగా నమోదు చేయించారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయిందని పేర్కొంటున్నారు. గత ఐదేళ్ల అక్రమాలపై వైసీపీ పెద్దలు ఏమి సమాధానం చెబుతారోనని చర్చించుకుంటున్నారు.

Updated Date - Jul 13 , 2024 | 11:35 PM