ఐదేళ్లలో చేసిందేమిటి?
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:36 PM
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాలో అభివృద్ధి జరగలేదని.. ఒక్క రూపాయి కూడా ఇతరత్రా కార్యక్రమాలకు విదల్చలేదని మాజీ విప్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. ఆదివారం జడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశం జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన నిర్వహించారు.

- జిల్లా అభివృద్ధి లేదు.. ఒక్క రూపాయి విదల్చలేదు..
- జడ్పీస్థాయీ సంఘ సమావేశంలో ఎమ్మెల్యే రవికుమార్ మండిపాటు
- అత్యధిక మంది వైసీపీ జడ్పీటీసీలు గైర్హాజరు..
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో జిల్లాలో అభివృద్ధి జరగలేదని.. ఒక్క రూపాయి కూడా ఇతరత్రా కార్యక్రమాలకు విదల్చలేదని మాజీ విప్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు. ఆదివారం జడ్పీ కార్యాలయంలో జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశం జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ.. ‘వెనుకబడిన జిల్లాగా సిక్కోలుకు ముద్ర ఉంది. గత వైసీపీ పాలనలో మరో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. వెనుకబడిన జిల్లాకు.. శాఖల వారీగా నిధులు ఇవ్వకుండా.. గత ఐదేళ్లలో మంత్రులు.. ఇతరత్రావారికి వైసీపీలో మంచిమంచి పదవులు కట్టబెట్టారు. వాటివల్ల జిల్లాకు ఏం ప్రయోజనం కలిగింద’ని ప్రశ్నించారు. శాఖల వారీగా ప్రస్తావిస్తూ.. గత ప్రభుత్వం ఏవిధమైన నిధులు కేటాయించలేదని స్పష్టం చేశారు. ఆయనతోపాటు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కూడా పాల్గొని.. అధికారుల తీరుపై ప్రశ్నలు సంధించారు. దీనిపై అధికారుల నుంచి సరైన సమాధానం కరువైంది.
- జడ్పీచైర్‌పర్సన్ పిరియా విజయ మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తుండటంతో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని.. సురక్షితమైన తాగునీరు అందించాలని.. అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమానికి వైసీపీకి చెందిన జడ్పీటీసీలు అత్యధికమంది గైర్హాజరయ్యారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ చిట్టిరాజు, డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, సీపీఓ ప్రసన్న, ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.