నిబంధనలతో మాకేం పని?
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:05 PM
మండలంలోని చవ్వాకులపేట వంశధార నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయి.
-వంశధారలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు
-నది మధ్యలోకి యంత్రాలను తీసుకెళ్లి..
ఆమదాలవలస, ఫిబ్రవరి 6: మండలంలోని చవ్వాకులపేట వంశధార నదీ పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు నదిలో ఎటువంటి యంత్రాలు వినియోగించకూడదు. అలాగే లారీలను కూడా నది మధ్యలోకి తీసుకెళ్లకూడదు. కానీ, ఇక్కడ యంత్రాలతో ఇసుకను తవ్వి లోడ్ చేయడం పరిపాటిగా మారింది. లారీలు నది లోపలకు వెళ్తున్నాయి. గతంలో ఇలాగే పురుషోత్తపురం ఇసుక ర్యాంప్ వద్ద లారీలు నది మధ్యలోకి వెళ్లాయి. అయితే, ఒక్కసారిగా నదిలో నీటి ప్రవాహం పెరిగిపోవడంతో 16 లారీలు చిక్కుకున్నాయి. లారీ సిబ్బంది అతి కష్టం మీద ఒడ్డుకు చేరుకున్నారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. ర్యాంప్ నుంచి విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ఇసుక రవాణా చేస్తున్న సమయంలో టార్పాలిన్లు కప్పడం లేదు. దీంతో గాలికి ఇసుక ఎగిరి ద్విచక్ర వాహన చోదకులు, ప్రజల కళ్లల్లో పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల చవ్వాకులపేట నుంచి ఆమదాలవలస ప్రధాన రహదారి మధ్యలో అధిక బరువుతో ప్రయాణించిన ఇసుక లారీలు పలుమార్లు బోల్తాపడ్డాయి. ఎటువంటి పత్రాలు లేని ఒక ఇసుక లారీ ఆమదాలవలస పోలీసులకు పట్టుబడింది. చవ్వాకులపేట ర్యాంపు వద్ద తవ్వకాలకు ప్రభుత్వం ప్రతిమ ఏజెన్సీకి అనుమతి ఇచ్చింది. ఈ ఏజెన్సీ నిబంధనలు పాటించకపోయినా గనులశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇసుక లారీలతో ప్రమాదాలు జరుగుతుండడంతో ఇటీవల పొన్నంపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఇసుక లారీలను అడ్డగించడంతో ఆమదాలవలస పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.