Share News

Land problems : ఈ భూములకు.. సర్వే నెంబర్లు ఏవీ?

ABN , Publish Date - Dec 28 , 2024 | 11:55 PM

No Survey Numbers వజ్రపుకొత్తూరు మండలంలో అత్యధిక భాగం తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉంది. దీంతో ఇక్కడ రైతులు సీఆర్‌జెడ్‌తో పాటు జిరాయితీ, అసైన్డ్‌, డీ-పట్టా భూములు కలిగి ఉన్నారు. కాగా.. జిరాయితీ భూములు కలిగిన రైతుల్లో చాలామందికి పాస్‌పుస్తకాలు ఉన్నా.. ఆన్‌లైన్‌లో వాటి సర్వే నెంబర్లు కనిపించడం లేదు.

Land problems : ఈ భూములకు.. సర్వే నెంబర్లు ఏవీ?
వజ్రపుకొత్తూరులో సర్వేనెంబర్లు లేని భూమి ఇదే

  • పాస్‌బుక్‌ ఉన్నా.. ఆన్‌లైన్‌లో నమోదుకాని వైనం

  • రీ సర్వేలో తప్పులతడకలు.. రైతులకు ఇబ్బందులు

  • రెవెన్యూ సదస్సుల్లో అధికారులకు వినతులు

  • వజ్రపుకొత్తూరు, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి):

  • ఏళ్ల తరబడి ఆ భూములు సాగు చేస్తున్నాం. ఆ భూములకు సంబంధించి మా పేరిట పాస్‌పుస్తకాలు ఉన్నాయి. కానీ ఆన్‌లైన్‌లో మాత్రం ఆ భూముల సర్వే నెంబర్లు కనిపించడం లేదు. దీంతో భూముల క్రయవిక్రయాలకు ఇబ్బందులు పడుతున్నాం. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. తాజాగా రెవెన్యూ సదస్సుల్లో కూడా మోక్షం దక్కలేదు. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి.

  • - ఇదీ వజ్రపుకొత్తూరు మండలంలో రైతుల ఆవేదన

  • .................

  • వజ్రపుకొత్తూరు మండలంలో అత్యధిక భాగం తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉంది. దీంతో ఇక్కడ రైతులు సీఆర్‌జెడ్‌తో పాటు జిరాయితీ, అసైన్డ్‌, డీ-పట్టా భూములు కలిగి ఉన్నారు. కాగా.. జిరాయితీ భూములు కలిగిన రైతుల్లో చాలామందికి పాస్‌పుస్తకాలు ఉన్నా.. ఆన్‌లైన్‌లో వాటి సర్వే నెంబర్లు కనిపించడం లేదు. బాతుపురం, చినవంక, వజ్రపుకొత్తూరు, అమలపాడు, కొత్తపేట, ఉద్దాన రామకృష్ణాపురం, మెట్టూరు, గరుడభద్ర, అక్కుపల్లి తదితర గ్రామాల్లో వందలాది మంది రైతులకు సంబంధించిన భూమి సర్వే నెంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. ఏళ్ల తరబడి తాము భూములు సాగుచేస్తున్నా.. ఆన్‌లైన్‌లో సర్వే నెంబర్లు లేకపోవడంతో భూముల క్రయవిక్రయాలు సాగడం లేదని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణాలు, ఇతర పనులకు డబ్బులు అవసరమైనా భూములు విక్రయించలేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూముల సమగ్ర సర్వే చేపట్టింది. కాగా భూముల రీ సర్వే చేసిన గ్రామాల్లో కూడా సమస్య పరిష్కారం కాలేదని రైతులు పేర్కొంటున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకుంటున్నా తమ సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. వైసీపీ హయాంలో చేపట్టిన భూముల రీ సర్వే పారదర్శకంగా లేదని ఆరోపిస్తున్నారు.

  • రెవెన్యూ సదస్సులోనూ..

  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజులుగా అధికారులు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. భూ సమస్యలపై వినతులు స్వీకరిస్తున్నారు. కొన్ని సమస్యలు వారం రోజుల్లో పరిష్కరిస్తామని చెబుతున్నారు. కాగా.. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన పలు గ్రామాల రైతులు ఈ రైతు సదస్సుల్లో కూడా తమ భూములకు సంబంధించి ఆన్‌లైన్‌లో సర్వే నెంబర్లు కనిపించడం లేదని, సమస్య పరిష్కరించాలని అధికారులకు వినతులు అందజేశారు. ‘వైసీపీ హయాంలో చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియ సక్రమంగా సాగలేదు. మా భూమికి సంబంధించిన సర్వే నెంబర్లు గల్లంతయ్యాయ’ని స్థానిక ఎంపీటీసీ కె.సురేఖ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు డబ్బులు అవసరమైనా.. తమ భూములు విక్రయించుకోలేకపోతున్నామని పలువురు రైతులు తెలిపారు. డబ్బుల్లేక శుభకార్యాలు వాయిదా వేసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నారు. కాగా.. ఆన్‌లైన్‌లో సర్వే నెంబర్లు లేని భూముల విషయమై.. జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామని అధికారులు చెప్పడంతో తమ సమస్యకు ఎప్పటికి మోక్షం లభిస్తుందోనని రైతులు నిట్టూర్చుతున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

  • రీ సర్వేలో తప్పులు ఉన్నాయి

  • వైసీపీ పాలనలో ఎంతో ఆర్భాటంగా చేసిన రీసర్వేలో అనేక తప్పులు ఉన్నాయి. కేవలం ప్రచార ఆర్భాటమే తప్ప.. రైతులకు మేలు జరిగింది తక్కువే. రీ సర్వేతో కొత్త సమస్యలకు ఆజ్యం పోశారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో.. గతంలో రీ సర్వే చేసిన గ్రామాల్లోని రైతులే అధికంగా భూ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు అందజేస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో భూ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకం రైతుల్లో ఉంది.

    - దువ్వాడ హేమబాబు చౌదరి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌

    ....................

  • సమస్య పరిష్కరించాలి

  • తీరప్రాంత గ్రామాల్లో భూ సమస్యలు అధికంగా ఉన్నాయి. వాటి పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి. రైతు స్వాధీనంలో భూములు ఉన్నా.. మ్యూటేషన్‌ నెంబర్లు సరిపోల్చక పోవడంతో చాలా వరకు భూములు రిజిస్ర్టేషన్లు నిలిచిపోతున్నాయి. దీంతో రైతులు అనేక శుభకార్యాలను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. రెవెన్యూ సదస్సుల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం.

    - బర్రి పురుషోత్తం, అక్కుపల్లి, వజ్రపుకొత్తూరు

    ...................

  • ఉన్నతాధికారులకు నివేదిక

  • భూములు ఉన్నా.. సర్వే నెంబర్లు లేని వాటిపై రైతులు రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదు చేస్తున్నారు. సర్వే నెంబర్లు సరిచేయాలని ఎక్కువగా వినతులు అందాయి. ఈ సమస్యపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. రైతులు ఆందోళన చెందవద్దు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే సర్వే నెంబర్లు సరిచేస్తాం.

    - మురళీకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్‌, వజ్రపుకొత్తూరు

Updated Date - Dec 28 , 2024 | 11:55 PM