Share News

గొట్టా బ్యారేజి రక్షణకు చర్యలు తీసుకుంటాం

ABN , Publish Date - May 15 , 2024 | 11:51 PM

హిరమండలం వద్ద వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజి సురక్షితంగా ఉన్నప్పటికీ దాని రక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉందని సీఈసీడీవో బీఎస్‌ఎస్‌ శ్రీనివాసయాదవ్‌ వంశధార అధికారులకు సూచించారు.

గొట్టా బ్యారేజి రక్షణకు చర్యలు తీసుకుంటాం
వంశధార ఎస్‌ఈ తిరుమలరావు నుంచి వివరాలు తెలుసుకుంటన్న సీఈసీడీవో, ఇంజనీరింగ్‌ అధికారులు

- రూ.25 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు

- సీఈసీడీవో బీఎస్‌ఎస్‌ శ్రీనివాసయాదవ్‌

హిరమండలం, మే 15: హిరమండలం వద్ద వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజి సురక్షితంగా ఉన్నప్పటికీ దాని రక్షణకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉందని సీఈసీడీవో బీఎస్‌ఎస్‌ శ్రీనివాసయాదవ్‌ వంశధార అధికారులకు సూచించారు. బుధవారం గొట్టా బ్యారేజితో పాటు వంశధార రిజర్వాయర్‌, ఎత్తిపోతల పథకం పనులను ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొట్టా బ్యారేజి రక్షణకు తీసుకోవలసిన చర్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. ఈ మేరకు వివిధ హోదాల్లో ఉన్న ఇరిగేషన్‌ శాఖకు చెందిన ఇంజనీరింగ్‌ అధికారులతో బ్యారేజీని పరిశీలించినట్లు చెప్పారు. బ్యారేజి దిగువన ఉన్న జడ్జిస్టోన్‌ ఏప్రాన్‌, సీసీ బ్లాక్‌లు మరమ్మతులకు ప్రభుత్వం రూ.12.19 కోట్లు మంజూరు చేసిందని, అయితే పనులు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఎస్టిమేషన్‌ కాస్ట్‌ పెరిగిందని చెప్పారు. ఈ నిధులతో 2015 డ్రాయింగ్‌ ప్రకారం మరమ్మతులు చేపట్టాల్సి ఉందన్నారు. పూర్తి స్థాయిలో అధ్యాయనం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులు (డ్రిప్‌ షథకం) ద్వారా బ్యారేజి పటిష్టతకు రూ.25 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఈ నిధులు మంజూరైతే బ్యారేజి గేట్లు మరమ్మతులు, పెయింటింగ్స్‌, ఇతర పనులు చేపడతామని వివరించారు. ఆయనతో పాటు ఎస్‌ఈ సీడీవో జి.ఎస్‌.శివకుమార్‌, ఈఈలు సీడీవో ఎ.విజయభాస్కర్‌, కె.శేషుబాబు, డీఈఈలు సీడీవో కేధారేశ్వరరెడ్డి,కె.రీణా,జి.శ్రీనివాసరెడ్డి,సత్యనారాయణ ,వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ డోల తిరుమలరావు, ఈఈ ఎంవీ రమణ, డీఈఈలు రవికాంత్‌, సురేష్‌ ఉన్నారు.

Updated Date - May 15 , 2024 | 11:51 PM