Share News

ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తాం

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:14 AM

వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు.

ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తాం
టెక్కలి: మదనగోపాలసాగరం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

టెక్కలి/పలాసరూరల్‌, జూలై 7: వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం టెక్కలి సమీపంలో 55.765 కిలోమీటరు వద్ద జోగిపాడు రెగ్యులేటర్‌ను పరిశీలించారు. కాలువల్లో పూడికతీత పనులపై ఆరాతీశారు. ప్రస్తుతం కాలువలో ఎన్ని క్యూసెక్కుల నీరు వస్తుందని సంబంధిత అధికారులను అడగగా 560 క్యూసెక్కుల వస్తుందని తెలిపారు. ప్రస్తుతం గొట్టాబ్యారేజ్‌లో 38.10మీటర్లు రిజర్వాయర్‌ లెవల్‌ మెంటైన్‌ చేస్తున్నట్లు వారు చెప్పారు. పలాస సమీపంలోని జగన్నాథసాగరం నిండిన తరువాత శివారు ప్రాంతమైన వజ్రపుకొత్తూరు మండలం కొత్తచెరువు వరకు సాగునీరు అందిస్తామన్నారు. అలాగే టెక్కలి సమీపంలోని మదనగోపాలసాగరం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను వంశధార అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ రిజర్వాయర్‌లో 0.12 టీఎంసీ సాగునీరు నిల్వ ఉంటుందని వంశధార ఈఈ బి.శేఖరరావు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. కాలువల పరిశీలనకు గట్ల వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని, గ్రావెల్‌ మార్గాలు వేసుకునేందుకు అవకాశాలు కల్పించాలని ఈఈ కోరారు. అవసరమైన నిధులు మంజూరుకు కలెక్టర్‌ హామీ ఇచ్చారు. వంశధార ఎస్‌ఈ రాంబాబు, డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.

‘ఆఫ్‌షోర్‌’లో సాంకేతిక లోపాలను అధిగమించాలి

పలాసరూరల్‌: ఆఫ్‌షోర్‌ రిజర్వాయరులో సాంకేతిక లోపాలను అధిగమించి పనులు చేపట్టేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ అన్నారు. మండలంలోని రేగులపాడు వద్ద ఉన్న ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ను, టెక్కలిపట్నం వంశధార ఎడమ కాలువను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆఫ్‌షోర్‌ డిజైనింగ్‌ మ్యాప్‌ను పరిశీలించి సాంకేతిక లోపాలు ఏమి ఉన్నాయి, వాటిని ఎలా అధిగమించాలి, పెండింగ్‌ పనులు ఎంతవరకు వచ్చాయి తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో భరత్‌నాయక్‌, ఆఫ్‌షోర్‌ అఽధికారులు, టీడీపీ నాయకులు వజ్జబాబూరావు, లొడగల కామేశ్వరరావు, జనసేన నియోజక వర్గ సమన్వయకర్త దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:14 AM