Share News

మన ఖాతాలో ఓట్లు పడాలి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:13 AM

ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసీపీ అన్ని కుయుక్తులు పన్నుతోంది. ప్రధానంగా వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఓట్లు రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే.. ‘ఎలాగైనా సరే.. ఓట్లు మన ఖాతాలోనే పడాలి’ అంటూ వలంటీర్లకు ఐప్యాక్‌ టీమ్‌ సందేశాలు పంపించింది.

మన ఖాతాలో ఓట్లు పడాలి

- వలంటీర్లకు ఐప్యాక్‌ టీమ్‌ సందేశాలు

(మెళియాపుట్టి)

ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైసీపీ అన్ని కుయుక్తులు పన్నుతోంది. ప్రధానంగా వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఓట్లు రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే.. ‘ఎలాగైనా సరే.. ఓట్లు మన ఖాతాలోనే పడాలి’ అంటూ వలంటీర్లకు ఐప్యాక్‌ టీమ్‌ సందేశాలు పంపించింది. సచివాలయాలకు సంబంధించి మండల కోఆర్డినేటర్లను నియమించింది. వారి ద్వారా వలంటీర్లకు సంబంధించిన గ్రూప్‌ ఏర్పాటు చేసి.. వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని సందేశాలు పంపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మళ్లీ మనం అధికారంలోకి వస్తే ‘మీ భవిష్యత్‌ మాదీ’ అంటూ వైసీపీ నేతలు కూడా వలంటీర్లకు భరోసా ఇస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు ముందస్తుగా తాయిలాలు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వలంటీర్లు విధుల్లో పాల్గొంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా.. కొంతమంది వైసీపీ ప్రచారంలో పాల్గొనడం చర్చనీయాంశమవుతోంది. ఈ నెల 18న మెళియాపుట్టిలో పాతపట్నం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి తరపున వలంటీర్లు ఇంటింటా ప్రచారం చేపట్టారు. కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ దృష్టికి ఈ విషయం చేరగా.. విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఎంపీడీవో భాస్కరరావుకు ఆదేశించారు. ఈ మేరకు విచారణ చేపట్టి.. క్లస్టర్‌ నెంబర్‌-6లో పనిచేస్తున్న వలంటీరు మాడుగుళ్ల మణికంఠను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. కాగా.. ఎన్నికల నిబంధనలు అడ్డంకిగా మారిన నేపథ్యంలో చాలామంది వలంటీర్లు రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చేది రూ.5వేల వేతనమే కాబట్టి.. రాజీనామా చేసినా ఈ రెండు నెలలూ తాయిలాల రూపంలో ఎలా అయినా ఆ డబ్బులు వచ్చేస్తాయని భావిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే తమ ఉద్యోగాలు గ్యారంటీ అనే ధీమాతో వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆరుగురు వలంటీర్ల తొలగింపు

సంతబొమ్మాళి, మార్చి 28: సంతబొమ్మాళి పంచాయతీతోపాటు బోరుభద్రలో వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్టు సి-విజిల్‌కు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో గురువారం ఆరుగురు వలంటీర్లను విధుల నుంచి తొలగించినట్టు ఎంపీడీవో ఉమాసుందరి తెలిపారు. టెక్కలి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి.. సంతబొమ్మాళిలో వలంటీర్లు కల్లూరి పాపారావు, వాదాల దుర్గారావు, అట్టాడ కామేశ్వరరావు, బొమ్మాళి ఉమాశంకర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధారాలతో సహా గురువారం సి-విజిల్‌కు ఫిర్యాదు చేశారు. ఆధారాలను పరిశీలించిన నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి టెక్కలి సబ్‌కలెక్టర్‌ సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌కమర్‌.. ఆ నలుగురు వలంటీర్లను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారని ఎంపీడీవో ఉమాసుందరి తెలిపారు. ఈ మేరకు పంచాయతీ లాగిన్‌ నుంచి వారిని తొలగించాలని కార్యదర్శికి ఆదేశాలు జారీచేశామన్నారు. అలాగే బోరుభద్రలో ఉపాధిహామీ పనుల వద్ద వైసీపీకి అనుకూలంగా వలంటీర్లు మల్ల అశ్విని, బొడ్డ శ్రీలత ప్రచారం చేస్తున్నారని సి-విజిల్‌కు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై విచారణ చేపట్టి ఆ ఇద్దరినీ విధుల నుంచి తొలగించామని ఎంపీడీవో తెలిపారు.

ఉపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు

జలుమూరు(సారవకోట), మార్చి 28: మూగుపురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చౌదరి లక్ష్మీనారాయణకు గురువారం షోకాజ్‌ నోటీసు జారీచేసినట్లు ఎంఈవో ఎం.వి.రమణ తెలిపారు. కోడ్‌ ఉల్లంఘించి సోషల్‌ మీడియాలో లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం చేశారని ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడికి షోకాజ్‌ నోటీసు అందించి సంజాయిషీ కోరినట్లు ఎంఈవో తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:13 AM