Share News

ఓటు.. మూడు కొండలు

ABN , Publish Date - May 12 , 2024 | 12:18 AM

మెళియాపుట్టి మండలం చందనగిరి గ్రామంలో 150 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రంగా నెలబొంతు ఆశ్రమ పాఠశాలను కేటాయించారు. చందనగిరి నుంచి ఇక్కడకు చేరుకోవాలంటే మూడు కొండలు దిగి రావాల్సిందే.

ఓటు.. మూడు కొండలు

- వినియోగించాలనుకుంటే దిగక తప్పదు

- దూరభారంగా పోలింగ్‌ కేంద్రాలు

- కానరాని సౌకర్యాలు.. ఆందోళనలో ఓటర్లు

(మెళియాపుట్టి)

మెళియాపుట్టి మండలం చందనగిరి గ్రామంలో 150 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రంగా నెలబొంతు ఆశ్రమ పాఠశాలను కేటాయించారు. చందనగిరి నుంచి ఇక్కడకు చేరుకోవాలంటే మూడు కొండలు దిగి రావాల్సిందే. చందనగిరిలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. కాగా.. అది మావోయిస్తు ప్రభావిత ప్రాంతంతోపాటు అక్కడ ప్రభుత్వ భవనాలు లేక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయలేకపోతున్నామని రెవెన్యూ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. దీంతో గత్యంతరం లేక ఓటు వేసేందుకు కొండలు దిగి రావాల్సిన పరిస్థితి నెలకొందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

...........................

మెళియాపుట్టి మండలం అనంతగిరి పోలింగ్‌ కేంద్రంలో 200 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడ తాగునీటి వసతి, మరుగుదొడ్లు లేవు. రహదారి కూడా బాగోలేక వాహనాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

..................

మెళియాపుట్టి మండలం గూడ గ్రామంలో 120 మంది ఓటర్లు ఉన్నారు. వీరు ప్రతి ఎన్నికల్లోనూ కేరాశింగి పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓట్లు వేస్తున్నారు. గూడ నుంచి కేరాశింగికి చేరుకోవాలంటే.. కొండపై నుంచి నాలుగు కిలోమీటర్లు దిగిరావాల్సిందే.

...........................

... ఇలా జిల్లాలోని చాలా గిరిజన ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలంటే ఆపసోపాలు పడాల్సిందే. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ఆరు నెలల ముందే పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ప్రతి కేంద్రంలోనూ విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు, రహదారి సౌకర్యం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. కాగా.. కొంతమంది అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే కేంద్రాల్లో సౌకర్యాలు బాగానే ఉన్నట్టు నివేదిక ఇచ్చారు. దీంతో ఓటర్లకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో 2,048 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మారుమూల గ్రామాల్లో సౌకర్యాలు కనిపించడం లేదు. గిరిజన ప్రాంతాల్లోని చాలా పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీటి వసతి, మరుగుదొడ్లు లేవు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు కూడా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితి నెలకొంది. పాఠశాల నిర్వహణకే నిధులు లేక ఇబ్బందులు పడుతుండగా.. పోలింగ్‌ కేంద్రాల్లో ర్యాంపులు ఎలా నిర్మించగలమని సిబ్బంది చెబుతున్నారు. దీంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.

- కలెక్టర్‌ చెప్పినా అంతే..

మెళియాపుట్టి మండలంలో మార్చి 21న కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ పర్యటించారు. పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెళియాపుట్టి పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లు వచ్చేందుకు ఇబ్బందులు ఉన్నాయని గుర్తించారు. ఈ మార్గాన మట్టిపోసి రహదారి సౌకర్యం కల్పించాలని సూచించారు. కానీ నేటికీ పనులు చేపట్టలేదు. రెవెన్యూ అధికారులు పనుల బాధ్యతను పాఠశాల సిబ్బందికి అప్పగించగా.. తమ వద్ద డబ్బుల్లేవంటూ వారు చేతులెత్తేశారు.

Updated Date - May 12 , 2024 | 12:18 AM