Share News

హింసకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - May 25 , 2024 | 11:54 PM

ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జీఆర్‌ రాధిక హెచ్చరించారు.

హింసకు పాల్పడితే కఠిన చర్యలు
పోలీసు సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ రాధిక

- ఎస్పీ జీఆర్‌ రాధిక

- అసాంఘిక శక్తులను ఎదుర్కొనేందుకు మాబ్‌ ఆపరేషన్‌

శ్రీకాకుళంక్రైం, మే 25: ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జీఆర్‌ రాధిక హెచ్చరించారు. హింసాత్మక ఘటనలు, అల్లరి మూకలు విధ్వంసాలకు పాల్పడినప్పుడు ఎలా ఎదుర్కోవాలో అనే దానిపై ఎస్పీ రాధిక పర్యవేక్షణలో జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసులు శనివారం డేఅండ్‌ నైట్‌ కూడలి వద్ద మాబ్‌ ఆపరేషన్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల సమయంలో హింసాత్మక ఘటనలకు పాల్పడితే ఏం చేస్తామన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాబ్‌ డ్రిల్‌ దోహదపడుతుందన్నారు. జిల్లాలో 144 సెక్షన్‌, 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉందని, ఒకచోట నలుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా లాఠీచార్జి, ఫైరింగ్‌కి వెనకాడబోమని హెచ్చరించారు. ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాల్లో పాల్గొనవద్దని కోరారు. ఓట్ల లెక్కింపు రోజున ఎవరైన హింసాత్మక ఘటనలకు పాల్పడనున్నట్లు తెలిస్తే సమాచారం అందిస్తే ముందస్తు అరెస్టులు చేస్తామని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే పెట్రోల్‌ బంకుల్లో లూజ్‌ పెట్రోల్‌ విక్రయాలను నియంత్రించామన్నారు. అలాగే బాణసంచా, పేలుడు పదార్ధాల విక్రయాలకు అనుమతి నిరాకరించామ న్నారు. జిల్లాలో విజయోత్సవ ర్యాలీలకు కూడా అనుమ తులు లేవన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ శాంతియుతంగా పూర్తయ్యేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు జిల్లా పోలీసు యంత్రాంగానికి సహకరించాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ డా.జి.ప్రేమ్‌ కాజల్‌, డీఎస్పీలు శ్రీనివాసరావు, ఎల్‌.శేషాద్రి నాయుడు, సీఐలు ఎల్‌.సన్యాశినాయుడు, జి.ఉమామహేశ్వరరావు, ఆర్‌ఐలు సురేష్‌, రమేష్‌, కేవీ నర్సింగరావు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మాక్‌ డ్రిల్‌

డేఅండ్‌ నైట్‌ కూడలి వద్ద మాబ్‌ ఆపరేషన్‌ మాక్‌ డ్రిల్‌ ఆకట్టుకుంది. ఒకవైపు ప్లకార్డులతో ఆందోళనకారులు, అల్లరి మూకలు (వీరంతా పోలీసులే) ఉండగా, మరోవైపు వారిని ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఆందోళనకారులకు పోలీసులు హెచ్చరికలు ఇవ్వడం, వినకపోతే అధికారుల అనుమతితో భాష్ప వాయువు ప్రయోగించడం, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌తో అల్లరి మూకలను చెదరగొట్టడం, లాఠీచార్జి, ప్లాస్టిక్‌ పెల్లెట్స్‌ ఫైరింగ్‌ చేయడం వంటి విన్యాసాలను కళ్లకు కట్టేలా పోలీసులు ప్రదర్శించారు. ఈ మాబ్‌డ్రిల్‌ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రాంతాల్లో అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని ఈ ప్రదర్శన ద్వారా ప్రజలకు వివరించారు.

Updated Date - May 25 , 2024 | 11:54 PM