Share News

వంశధార వంతెన.. ప్రమాదం అంచున

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:57 PM

వంశధార ప్రధాన ఎడమకాలువపై నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వం వీటి మరమ్మతులపై దృష్టి సారించకపోగా.. మరోవైపు ఈ వంతెనలపై గ్రానైట్‌ బ్లాకులతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

వంశధార వంతెన.. ప్రమాదం అంచున
కిట్టాలపాడు వద్ద శిథిలావస్థకు చేరుకున్న వంతెన

- ఎక్కడికక్కడ శిథిలావస్థకు చేరుకున్న వైనం

- గ్రానైట్‌ రాళ్లతో భారీ వాహనాల రాకపోకలు

- చోద్యం చూస్తున్న అధికారులు

- భయాందోళన ప్రజలు

(టెక్కలి)

వంశధార ప్రధాన ఎడమకాలువపై నిర్మించిన వంతెనలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వం వీటి మరమ్మతులపై దృష్టి సారించకపోగా.. మరోవైపు ఈ వంతెనలపై గ్రానైట్‌ బ్లాకులతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఏరోజు వంతెనలు కూలుతాయో తెలియని దుస్థితి నెలకొంది. గతంలో టెక్కలి నుంచి అంజనాపురం మార్గంలో వంశధార వంతెన భారీ వాహనాల రాకపోకలతో కూలిపోయింది. గత ఏడాది జాతీయరహదారి నుంచి గొల్లవూరు వైపు వెళ్లే వంశధార వంతెన కూడా ఇసుక వాహనాల రాకపోకలతో కూలిపోయింది. వంశధార ప్రధాన ఎడమకాలువపై 40ఏళ్ల కిందట నిర్మించిన వంతెనలే వివిధ గ్రామాల రాకపోకలకు ప్రధానమార్గం. కాగా.. భారీ వాహనాల రాకపోకలతో వంతెనలకు ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

- టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ పరిధి బొరిగిపేట సమీపంలో ఉన్న వంశధార ప్రధాన వంతెనపై రక్షణగోడ కూలి అధ్వానంగా ఉంది. ఈ వంతెనపై నుంచి సుమారు 12కు పైగా గ్రానైట్‌ క్వారీలు బ్లాకులను తరలిస్తుంటాయి. ఈ ప్రాంత గ్రానైట్‌ క్వారీల్లోని వేస్ట్‌ రాళ్లు మూలపేట పోర్టుకు రక్షణగోడ నిర్మాణాలకు తరలిస్తున్నారు. ఈ వంతెనపై భారీ వాహనాల రాకపోకలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వంతెన అనుకోకుండా కూలితే భీంపురం, పెద్దభీంపురం, డెప్పూరు, వంగర, కోదండపుం, సరియాపల్లి, జీడిపేట, కొత్తూరు, భీంపురం ఆశ్రమ పాఠశాలకు వెళ్లే మార్గం మూసుకుపోతుంది. వాస్తవానికి వంశధార కాలువలపై నిర్మించిన వంతెనలు అప్పట్లో 20టన్నుల సామర్థ్యానికి అధికారులు డిజైన్‌ చేశారు. అయితే ఈ వంతెనలపై ప్రస్తుతం 22 టైర్లు గల టైలర్‌ వాహనం 55 టన్నులతో, 18 టైర్లు గల టైలర్‌ వాహనం 50 టన్నుల వరకు, 16టైర్ల టారస్‌ వాహనం 48 టన్నులు, 12టైర్ల టారస్‌ వాహనం 40టన్నుల వరకు బరువులు తీసుకుపోతున్నాయి. నిత్యం పోర్టుకు రాళ్లు తరలించే డంపర్లు కూడా ఈ రోడ్లుపై తిరుగుతుండడంతో ఈ వంతెనల పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. వంతెనలు కూలితే శివారు ప్రాంతాలకు సాగునీటి సరఫరాకు బ్రేకులు పడతాయోమోనన్న ఆందోళన కలిగిస్తోంది. వంశధార అధికారులు గతంలో భారీ వంతెన ఏర్పాటు చేసుకోవాలని గ్రానైట్‌ క్వారీల నిర్వాహకులకు సూచించినా.. కొత్త వంతెనల నిర్మాణాలు చేపట్టలేదు. తర్వాత అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వంతెనలపై భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. శిథిలావస్థలో ఉన్న వంతెనలకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై వంశధార ఈఈ కె.శ్రీకాంత్‌ వద్ద ప్రస్తావించగా.. వంతెనలపై భారీ బరువులతో గ్రానైట్‌ వాహనాలు తరలివెళ్తున్న అంశంపై ఆయా శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. తమ శాఖ నిర్మించిన వంతెనలు 20 టన్నుల బరువు సామర్థ్యం మేర రాకపోకలకు డిజైన్‌ చేశామని తెలిపారు.

మరమ్మతులు శూన్యం

హిరమండలం : హిరమండలం మండలంలోని భగీరథపురం నుంచి చవితి సీదికి వెళ్లే మార్గంలోనూ, కిట్టాలపాడుకు వెళ్లేదారిలో వంశధార ఎడమ కాలువపై వంతెనలు శిథిలమై ప్రమాదకరంగా మారాయి. సుమారు 25 ఏళ్ల కిందట నిర్మించిన ఈ వంతెనలకు ఇరువైపులా రక్షణగోడలు శిథిలమైనా మరమ్మతులు చేపట్టడం లేదు. ఈ వంతెనలపై రోజూ వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏమాత్రం అదుపుతప్పినా ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తప్పదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వంతెనలకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

Updated Date - Mar 24 , 2024 | 11:57 PM