పలాస జీడికి.. మహా ప్రసాదం
ABN , Publish Date - Sep 03 , 2024 | 11:27 PM
పలాస జీడికి మహా ప్రసాదం దక్కింది. రుచి, సువాసనలో తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రాధాన్యం, ప్రాముఖ్యత ఉంది. ఈ లడ్డూ తయారీకి వినియోగించే వస్తువుల్లో జీడిపప్పు కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇకపై ఈ లడ్డూలో పలాస జీడిపప్పునకు స్థానం దక్కింది.
- ఇక తిరుమల లడ్డూలో వినియోగం
- తొలిసారి బిడ్ దక్కించుకున్న వ్యాపారి
- రోజూ 3 టన్నుల సరఫరాకు అంగీకారం
పలాస, సెప్టెంబరు 3: పలాస జీడికి మహా ప్రసాదం దక్కింది. రుచి, సువాసనలో తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రాధాన్యం, ప్రాముఖ్యత ఉంది. ఈ లడ్డూ తయారీకి వినియోగించే వస్తువుల్లో జీడిపప్పు కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇకపై ఈ లడ్డూలో పలాస జీడిపప్పునకు స్థానం దక్కింది. పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోష్ (ఎస్‌ఎస్‌ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో).. టీటీడీకి జీడిపప్పు సరఫరా చేసే టెండర్లు దక్కించుకున్నారు. మూడు రోజుల కిందట గ్లోబల్ విధానం ద్వారా టెండర్లు పిలవగా కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన వందలాది మంది వ్యాపారులు పోటీ పడ్డారు. దేశవ్యాప్తంగా 3వేలకు పైగా జీడి పరిశ్రమలు ఉండగా.. అనూహ్యంగా పలాస వ్యాపారికి ఈ అవకాశం దక్కింది. తిరుపతి బాలాజీ లడ్డూల తయారీకి రోజూ 3 టన్నుల జీడి పప్పు అవసరం. ప్రస్తుతం జేహెచ్(బద్ద) రకం జీడిపప్పు సరఫరా చేయాలని టీటీడీ నుంచి వర్తమానం అందింది. ఈ మేరకు ఆ రకం పప్పు తయారీలో నిర్వాహకులు నిమగ్నమయ్యారు. కలియుగ దైవంగా కొలువబడే శ్రీ వెంకటేశ్వరస్వామికి నేరుగా మన జీడిపప్పు వెళ్తుండడంతో.. దానికి అనుగుణంగా శుభ్రత, నాణ్యత, శుచితో జీడి పప్పును తయారు చేస్తున్నారు. మొత్తం 300 మంది కార్మికులు రెండు రోజుల నుంచి జేహెచ్ రకం జీడిపప్పు తయారు చేస్తూ.. కిలో, రెండు, ఐదు, పది కిలోలు చొప్పున ప్యాకింగ్ చేస్తున్నారు. నెలకు సరిపడా జీడిపప్పును వారం రోజుల్లో పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
45 ఏళ్లకు ముందు.. తర్వాత..
టీటీడీ లడ్డూ ప్రసాదానికి జీడిపప్పును కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి గుత్త పద్ధతిలో సేకరించేవారు. మొదట నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానమే కొనుగోలు చేసేది. అనంతరం వివిధ మార్పుల చోటుచేసుకొని గ్లోబల్ టెండర్ల ద్వారా సేకరిస్తున్నారు. జీడిపప్పు తయారీలో మన రాష్ట్రం దేశవ్యాప్తంగా ఐదో స్థానంలో ఉంది. 45 ఏళ్లకు ముందు మన రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్న పలాస మొక్క జీడిపప్పును వినియోగించారని వ్యాపారులు చెబుతున్నారు. ఆ స్థాయిలో సరఫరా చేయకపోవడంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పోటీ పడి జీడిపప్పు సరఫరా టెండర్లు దక్కించుకున్నాయి. అప్పటి నుంచీ మన రాష్ట్ర జీడిపప్పు విదేశాలకు విక్రయాలకు తప్ప.. స్వదేశంలో ఉన్న ప్రధాన ఆలయాలకు సరఫరాకు నోచుకోలేదు. ఎట్టకేలకు పలాస జీడిపప్పు చాలా ఏళ్ల తరువాత తిరుపతి బాలాజీ లడ్డూలో ప్రధాన భూమిక పోషించనుండడంతో వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి దయతోనే తమకు ఈ అవకాశం దక్కిందని, లాభాపేక్ష లేకుండా టీటీడీకి అందించాలని నిర్ణయించామని ఎస్‌ఎస్‌ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో చైర్మన్ కోరాడ సంతోష్ కుమార్ తెలిపారు.